పాలతో పూలబాట

2 Oct, 2014 23:47 IST|Sakshi

వర్షాభావ పరిస్తితులు, విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయం కష్టాలను మిగల్చడంతో ప్రత్యామ్నాయంగా పలువురు రైతులు పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించారు. రైతులకు బోరు బావుల కింద నీటి సౌకర్యం ఉండడం.. స్థానికంగా పాల శీతలీకరణ కేంద్రం ఉండడం వారికి మరింత కలిసొచ్చింది. రైతులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రూ.30వేల-రూ. 50వేల వరకు వెచ్చించి పాడి ఆవులను, గేదెలను కొనుగోలు చేశారు.

 కేవలం కుమ్మరిగూడ గ్రామంలోనే 3,500 వరకు పాడి గేదెలున్నట్లు అంచనా. రోజుకు 7 వేల లీటర్లకుపైగా పాలను ఈ గ్రామం నుంచి షాబాద్, పరిగి, షాద్‌నగర్, చేవెళ్ల పాల శీతలీకరణ కేంద్రాలకు తరలిస్తున్నారు.  ఒక్కో రైతు నెలకు రూ.10 వేలనుంచి రూ.15వేల వరకు ఆదాయం పొందుతున్నారు. 15 నుంచి 40 లోపు గేదెలున్న పాల ఉత్పత్తిదారులు ప్రతి నెలా నిర్వహణ ఖర్చులు పోగా రూ.25వేల నుంచి రూ.45 వేల వరకు, 70కు పైగా గేదెలు ఉండే పెద్ద పాల ఉత్పత్తిదారులు ప్రతి నెలా రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు.


 గ్రామంలో జెర్సీ, రిలయన్స్, జ్యోతి, సరిత, మదర్ డెయిరీలు వెలిశాయి. ఇవి పోటాపోటీగా ధరలు చెల్లించడంతో ఎక్కువమంది రైతులు పాడి ఆవులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో పశువు పేడకు సైతం ఏడాదికి రూ.1000 చొప్పున లాభాలు వస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు