సిరుల వేరుశనగ!

26 Sep, 2014 00:18 IST|Sakshi

విత్తన శుద్ధి ఇలా..
 విత్తనాలు పురుగు పట్టినవి కాకుండా చూసుకోవాలి. ఎకరానికి 60 నుంచి 75 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకోజబ్ పొడి మందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు విత్తనానికి రైజోబియం లేక 6.5 మిల్లిలీటర్ల క్లోరో ఫైరిఫాస్ కానీ, రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.

 దుక్కి తయారీ
 దుక్కి మెత్తగా చదును చేసుకున్న తర్వాత చివరి దుక్కిలో 4, 5 టన్నుల సేంద్రియ ఎరువులు వేయాలి. నీటి పారుదలకు కింద అయితే ఎకరానికి వంద కిలోల సూపర్‌ఫాస్పెట్, 33 కిలోల మ్యూరెట్‌ఆఫ్ పొటాష్ మరియు 20 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. 9 కిలోల యూరియా, ఎకరానికి 200 కిలోల జిప్సంను పంట విత్తిన 30 రోజుల త ర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి.

 కలుపు నివారణ
 కలుపు నివారణ కొరకు ఫ్లూక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున దుక్కిపై పిచికారీ చేసి కలియ దున్నాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేయాలి. విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు మొక్కులూ లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఎలాంటి అంతరకృషి చేయకూడదు.

 ఆకుముడత తెగులు
 పురుగు ఆకు పొరల మధ్య తొలుస్తూ పత్రహరిత పదార్థాన్ని తింటుంది. దీంతో  ఆకులు గోధుమ రంగులోకి మారి ముడతలుగా మారుతాయి. పురుగు లార్వా దశలో రెండు ఆకులను దగ్గరకు చేర్చి వాటి మధ్య గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఆకుపై పొరకు, కింది పొరకు మధ్య ఉన్న కణజాలాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎక్కువ సంఖ్యలో రాలిపోయి మొక్కల పెరుగుదల కాయల అభివృద్ధి తగ్గుతుంది.

 నివారణ
 ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేరుశనగ పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. లీటర్ నీటికి 1.6 మిల్లిలీటర్ల మొనోక్రోటోఫాస్, రెండు మిల్లిలీటర్ల క్వినాల్‌ఫాస్ లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి.

 లద్దె పురుగు..
 లద్దె పురుగు నివారణకు వేసవిలో దుక్కి లోతుగా దున్ని నత్రజని, వేపపిండి వేసుకోవాలి. పురుగు తొలి దశ లలో ఐదు శాతం వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేపనూనే పిచికారీ చేసుకోవాలి. పురుగు లార్వా దశకు ఎదిగాక ఐదు కిలోల తవుడు, అరకిలో బెల్లం, అరలీటర్ మోనోక్రోటోఫాస్ లేదా అర లీటర్ క్లోరోపైరిఫాస్ కలిపి విషపు ఎరువు తయారు చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క మొదళ్ల వద్ద వేసినట్లయితే లద్దె పురుగును నివారించవచ్చు.

 తెగుళ్లు.. నివారణ చర్యలు
 పంటకు జింకులోపం ఏర్పడితే ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 400 గ్రాముల  జింక్‌సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

 లేత ఆకుమచ్చ తెగులు..
 మొక్కలు 20 నుంచి 30 రోజుల వయసులో ఉన్నప్పుడు ఆకుపై మచ్చలు కనిపి స్తే ఒక లీటరు నీటికి 2.5 గ్రామాలో మంకొజెబ్, లీటరు నీటికి ఒక గ్రాము కార్బడిజం కలిపి 200 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ఒక ఎకరానికి స్ప్రే చేయాలి.

 ముదురు ఆకుమచ్చ తెగులు..
 ఈ తెగులు విత్తిన 30 రోజుల తర్వాత వంద రోజుల్లోపు ఆశించే అవకాశం ఉంది. తెగులు ఆశించిన వెంటనే లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజెబ్ గానీ లీటరు నీటికి గ్రాము కార్బడిజం గానీ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు