పాటిస్తే మెళకువలు..పత్తిలో లాభాలు

26 Nov, 2014 03:47 IST|Sakshi

మద్నూర్: జిల్లాలో ఈ ఏడాది యాభై వేల ఎకరాలలో పత్తి సాగైంది. ప్రస్తుతం చేతికందే దశలో ఉంది. ఈ సారి ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎకరాని కి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 3 నుంచి 4 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వ మద్ద తు ధర రూ.4050 ప్రకటించినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడం రైతులను ఆవేదన కలిగిస్తోంది. పత్తిలో తేమశాతం 8 ఉంటే ఈ ధర లభిస్తుంది. ఆపైన వచ్చిన ఒక శాతానికి రూ.40.50 పైసల చొప్పున కోత విధిస్తోంది.

 సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రస్తుతం పత్తి కొనుగోలు చేస్తోంది. 12 శాతంలోపు వచ్చిన పత్తిని మాత్రమే వారు కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ గా వచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకు ని రూ. 200 నుంచి రూ.300 వరకు నష్టపోతున్నా రు. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎం డ అధికంగా ఉన్నప్పుడు పత్తి తీయెద్దు. ఆ సమయంలో ఎండుటాకులు, వ్యర్థ పదార్థాలు విరిగి పత్తిలో కలుస్తాయి. పొద్దున, సాయత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడే మాత్రమే తీయా లి. పత్తిని తీసేటప్పుడు అది పొడిగా ఉండాలి. వర్షం పడిన తర్వాత తీయొద్దు.  పంటకు దిగుబడి బాగా రావాలంటే పత్తి తీయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు (8886613150) సూచిస్తున్నారు.

 జాగ్రత్తలు
     పంట కాలంలో కనీసం మూడు నాలుగు సార్లు పత్తిని తీస్తారు. పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే కాయల నుంచి పత్తిని ఏరాలి. ఏరిన తర్వాత మట్టిలో కుప్పలుగా పోయరాదు. పత్తిలో దుమ్ము ధూళీ, ఎరువులు,పురుగుల మందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 వర్షం, చీడపీడల వల్ల పాడైన పత్తిని వేరుచేయాలి. దీన్ని మంచి పత్తిలో కలప కూడదు. మొదట మొక్కల కింద భాగం కాయల నుంచి తీయాలి. ఎందుకంటే ముందుగా పైభాగంలోని కాయల నుంచి తీస్తే కింది కాయల పత్తిలో చెత్తపడే అవకాశం ఉంటుంది.

 సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది.కాబట్టి దాన్ని ప్రత్కేకంగా అమ్ముకోవాలి. పంట చివరికి వచ్చేసరికి మొక్కలో, నేలలోనూ పోషకాలు తగ్గడంతో పత్తి నాణ్యత లోపిస్తుంది. నిల్వ చేయాల్సిన పత్తిలో 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే లోపల వేడి పెరిగి విత్తనంతో పాటు దూదిని కూడా పాడుచేస్తుంది. పత్తి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే పత్తి రంగుమారి నాణ్యత తగ్గుతుంది.
     
పత్తిని వీలైనంత వరకు గదుల్లో గానీ, షెడ్లలో గానీ సిమెంట్ నేలమీద గానీ పరచాలి.పత్తి పూర్తిగా ఆరిన తర్వాతనే బోరాల్లో నింపి పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి.

 ఆరిన తర్వాతే తీయాలి
     వర్షానికి తడిసిన, మంచుబిందువులతో చల్లబడిని పత్తిని ఆరిన తర్వాతే సేకరించాలి.
     గింజ, దూదిపింజల్లో తేమశాతం లేదని నిర్దారణకు వచ్చిన తర్వాత తీయాలి.
     ఎక్కువ మంది రైతులు మంచులోనే పత్తిని సేకరిస్తారు. వర్షానికి తడిసిన పత్తిని మాత్రం ఎండకాసే సమయంలో, మంచు నీరు లేని సమయంలో తీయాలి.

     ఎక్కువ రోజులు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. అలాంటి పత్తిని సేకరించిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి.

     ఆరబెట్టిన పత్తిని మూడు గంటలకోసారి తిరిగేయాలి.
     తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే బోరే(సంచు)ల్లో నింపాలి.
     కొద్దిపాటి తడిసిన పత్తిలో ఎటువంటి నాణ్యత లోపాలు ఉండవు.
     తడిసిన పత్తిని ఆరబెట్టిన తర్వాత టార్పాలిన్ కవర్ కప్పేటప్పుడు పూర్తిగా కాకుండా గాలి తాకే విధంగా ఉండాలి. ఆవిరి వచ్చి తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు