వేపకూ తప్పని చీడపీడలు!

15 Dec, 2015 01:31 IST|Sakshi
వేపకూ తప్పని చీడపీడలు!

పంటలపై చీడపీడల నివారణకు వేప గింజల నూనె, వేపాకుల రసం వాడటం పరిపాటి. భూసారం పెంపుదలకు, మట్టి ద్వారా పంటలకు తెగుళ్లు సోకకుండా వేప పిండి ఉపకరిస్తుంది. అటువంటి జగత్‌ప్రసిద్ధి గాంచిన వేప చెట్టుకూ పురుగుల బెడద తప్పటం లేదు. నల్లగొండ జిల్లాలో ఇటీవల రెండు రకాల పురుగులు వేప చెట్లకు ఆకు లేకుండా తినేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇటువంటి సందర్భాలున్నాయని సమాచారం. పురుగులకు సింహస్వప్నం లాంటి వేపకు ఈ పరిస్థితి రావడం చిత్రంగా అనిపించినా.. ఇది నిజం.

 నల్లగొండ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఇటీవల వేప చెట్లకు ఆకుపచ్చని పురుగు(సెమీలూపర్), గొంగళి పురుగులు వందల సంఖ్యలో ఆశించి ఆకులన్నీ తినేశాయి. ఈ పురుగులు శరీరంపై పాకితే దురదతో పాటు దద్దుర్లు వస్తుండడంతో జనం బెంబేలెత్తారు. మర్రిగూడ మండలంలోనూ కొన్ని వేప చెట్లను ఈ పురుగులు మోళ్లుగా మార్చేశాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్కడక్కడ వేప చెట్ల ఆకులను పురుగులు తినేస్తున్నట్లు చెబుతున్నారు.

 బీటీ పత్తి సాగుతో సంబంధం ఉందా?
 ఈ రెండు జిల్లాల్లోనూ బీటీ పత్తి సాగు చాలా విస్తారంగా సాగవుతోంది. నిలువెల్లా విషపూరితంగా ఉండే బీటీ పత్తిని విస్తారంగా సాగు చేయడానికి, వేపపై పురుగుల దాడికి ఏమైనా సంబంధం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘బీటీ పత్తి పొలాల చుట్టూతా కొన్ని చాళ్లలో నాన్‌బీటీ పత్తిని ఎర పంటగా సాగు చేయాల్సి ఉంటుంది. అయితే అలా జరగడం లేదు. పత్తిని ఆశించే పురుగే ఇప్పుడు వేప చెట్లను ఆశించడం ప్రారంభించినట్లుంద’ని నారాయణపూర్ వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు పి. నాగమణి ‘సాక్షి’తో చెప్పారు. తదనంతరం ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటకశాస్త్ర విభాగాధిపతి డా. వి. శశిభూషణ్, డా. జి. అనిత, డా. ఎం. శంకర్‌లతో కూడిన బృందం నారాయణ పూర్ గ్రామాన్ని సందర్శించి నమూనాలను సేకరించి, అధ్యయనం చేసింది.

 పత్తిని ఆశించే పురుగు కాదు : డా. రాజిరెడ్డి
 ఈ నేపథ్యంలో.. వేప చెట్లను ఆశించిన పురుగు పత్తిని ఆశించే శనగపచ్చ పురుగు కాదని తమ పరిశీలనలో తేలిందని వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ డి. రాజిరెడ్డి చెబుతున్నారు. ఇది వేప చెట్టును ఆశించే పురుగేనని, అయితే ఇటీవల దీని తీవ్రత బాగా ఎక్కువగా కనిపించడంతో వెలుగులోకి వచ్చిందన్నారు. 2009లో లక్నోలోని భావులా గ్రామంలోనూ, 2010లో ఉత్తర ప్రదేశ్‌లోనూ ఆకుపచ్చ పురుగులు వేప చెట్లను ఆశించిన దాఖలాలున్నాయని ఆయన అన్నారు. సెమీలూపర్‌తోపాటు, లద్దెపురుగు, పొలుసు పురుగు, శనగపచ్చ పురుగు, తేయాకు దోమ, రెక్కల పురుగు, పిండి పురుగు, ఆకుతేలు, పెంకు వంటివి కూడా వేప చెట్లను ఆశిస్తూ ఉంటాయని డా. రాజిరెడ్డి వివరించారు.

 అయితే, వాతావరణ మార్పుల నేపథ్యంలో కొత్తగా రూపాంతరం చెందిన పురుగులేవో వేప చెట్లను నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆశిస్తున్నాయని పత్తి సలహా సంఘం సభ్యుడు డా. డి. నర్సింహారెడ్డి సందేహం వెలిబుచ్చారు. శాస్త్రవేత్తలు ఉదాసీనత వదిలి దీనిపై మరింత లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
 - అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్
 ఇన్‌పుట్స్: విజయ్ పొలగోని; మునుగోడు, శ్రీధర్, నారాయణపూర్

మరిన్ని వార్తలు