సహజంగా కోళ్ల పెంపకంతో..

4 Jun, 2014 22:30 IST|Sakshi
సహజంగా కోళ్ల పెంపకంతో..

 ఆరోగ్యం.. ఆదాయం
 
  డా. చోహన్‌క్యూ విధానంలో వ్యాక్సిన్లు, హార్మోన్లు వాడకుండానే కోళ్ల పెంపకం
  తక్కువ ఖర్చుతో.. రైతే సొంతంగా దాణా తయారు చేసుకోవచ్చు
  షెడ్డు నుంచి దుర్వాసన రాకపోవడం ఈ పద్ధతి ప్రత్యేకత

 
 ఒలపల దాపల ఒక్క తీరుగా నడిస్తేగాని బండి ప్రయాణం భద్రంగా సాగదన్నట్లుగానే.. వ్యవసాయం లాభాల సాగవ్వాలంటే ప్రధాన, అనుబంధ రంగాల మధ్య సమతుల్యం సాధించడం అవసరం. వ్యవసాయం నగదు పంటల వ్యామోహంలో పడినప్పటి నుంచి ధరలకు దొరలెవరో తెలియని పరిస్థితి. పంటల ధర పూటకో తీరుగా ఊరించి చివరికి ఊబిలో దించుతున్నాయి. ఈ పరిస్థితిలో రైతుకు ‘సాగుబాటు’ కావాలంటే సమగ్ర వ్యవసాయ విధానమే శరణ్యం. మార్కెట్ మాయాజాలం పుట్టిముంచకుండా ఉండాలంటే వ్యవసాయానికి అనుబంధంగా పాడి, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టాలి. మాట భారీగా ఉన్నా ఇదే సమగ్ర వ్యవసాయ విధానమంటే. నగదుల పంటల వెంట మొదలయిన పరుగు రైతులను మిగతా రంగాలను విస్మరించేలా చేసింది.
 
 పారిశ్రామిక పద్ధతుల్లో కోళ్ల పెంపకంపై సందేహాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో దేశీ కోళ్ల పెంపకం రైతుకు బాగా లాభసాటిగా ఉంటుంది. సహజ విధానంలో కోళ్ల పెంపకంపై దక్షిణ కొరియాకు చెందిన డాక్టర్ చోహన్ క్యూ విస్తృతమైన పరిశోధన చేశారు. చో నేచురల్ పౌల్ట్రీ ఫార్మింగ్ పద్ధతిని రూపొందించారు. మార్కెట్‌పై ఆధారపడకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతోనే కోళ్లను పెంచగలగడం ఇందులో ప్రత్యేకత. వ్యాక్సిన్లు, హార్మోన్ల అవసరం లేకుండా రైతుకు అందుబాటులో ఉన్న వనరులతో పుష్టికరమైన కోడి మాంసం అందించడం ఇందులోని ప్రత్యేకత.
 
 వైవిధ్యభరితం చోహన్ విధానం
 
 డాక్టర్ చోహన్ విధానంలో కోళ్ల షెడ్డు నిర్మాణం సహజంగా గాలి, వెలుతురులందే విధంగా.. ఎలాంటి సిమెంట్ గచ్చు చేయని నేల మీదే నిర్మించాలి. ఈ విధానంలో ప్రతి కోడికీ గరిష్టంగా 4 అడుగుల స్థలం అవసరం అని నిర్ణయించారు. మీరు పెంచదలచిన కోళ్ల సంఖ్యకు అనుగుణంగా కొలతను నిర్ణయించుకోవాలి. ఎంపిక చేసుకున్న స్థలాన్ని దున్ని చదును చేసుకోవాలి. చుట్టూరా రెండు అడుగుల మేర గోడను నిర్మించుకొని సిమెంట్ స్తంభాల ఆధారంగా చుట్టూ ఇనుప వలను బిగించుకోవాలి. పై కప్పుకు సిమెంట్ రేకులు లేదా తాటాకు, పొరక, జమ్ముగడ్డి, వరిగడ్డి, కొబ ్బరాకులు.. ఏవైనా వాడొచ్చు. వర్షాకాలంలో నీరు పడకుండా కప్పు, చూర్ల నిర్మాణం ఉంటే సరిపోతుంది.
 
 ముందుగా తవ్విన మట్టి మీద మూడంగుళాల మేర వరిపొట్టు, చిన్నచిన్న ముక్కలుగా నరికిన గడ్డి, కొబ్బరి డొక్కు తదితరాలను మట్టితో పాటు కలపాలి. దీని మీద (పాలు, బియ్యం కడిగిన నీటితో తయారు చేసిన) ల్యాక్టో బ్యాక్టీరియా, (అన్నంతో తయారు చేసిన) ఆదిమ సూక్ష్మ జీవుల(ఐఎంఓ) మిశ్రమాన్ని నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. నేలలో ఉన్న మట్టిలో సూక్ష్మజీవులే కోళ్ల ఆరోగ్యానికి భరోసానిచ్చే కాపలాదారులన్నమాట. షెడ్డులో పూర్తి పొడి వాతావరణం ఏర్పడినప్పుడు ల్యాక్టో బ్యాక్టీరియా, ఐఎంఓను పిచికారీ చేయాలి. ఇవి కోళ్ల పెంటను కుళ్లింప జేసి అందులో చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. ఒకసారి షెడ్డులోని నేల తయారు చేస్తే పదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. వ్యవసాయ అవసరాల కోసం ఎరువును తీసుకోవాల్సి వచ్చినప్పుడు పై పొర 3, 4 అంగుళాల మేర తొలగించి వాడుకోవాలి.
 
 కోడి పిల్లలను తేవడానికి ముందు షెడ్డును రెండు భాగాలుగా విభజించాలి. ఇందులో మొదటి భాగంలో కోడి పిల్లలకు గూళ్లు ఏర్పాటు చేయాలి. రాత్రి వేళ అందులోనే విశ్రాంతి తీసుకుంటాయి. పెద్దవైన తరువాత గుడ్లు అదే చోట పెట్టడం అలవాటవుతుంది. ఈ గూళ్లను పౌల్ట్రీ భాషలో బ్రూడర్లంటారు. బ్రూడర్లకు ముందు భాగంలో మెత్తటి నూలు వస్త్రం, పాత చీరలు ఇందుకు సరిపోతాయి. తెరలు కట్టడం ద్వారా కోడి పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు తల్లి రెక్కలు తగిలిన అనుభూతి కలుగుతుంది. తెరకు ముందు భాగంలో దాణా తొట్లు ఉంచాలి. వాటికి ముందు భాగంలో నీరు తాగే వసతి కల్పించాలి. నీటి అవసరాల కోసం తొట్లు లేదా పీవీసీ పైపునకు రంధ్రాలు చేసి అందులో నీరు నింపి ఉంచాలి. ఎప్పటికప్పుడు పాత నీరు తొలగించే ఏర్పాటు చేసుకోవాలి. కోళ్లు పెరిగేకొద్దీ పెద్ద రంధ్రాలున్న పైపులను అమర్చాల్సి ఉంటుంది.
 
 రోజుకు ఒకసారే మేత!
 
 చో విధానంలో కోళ్లకు రోజుకు ఒకసారే మేత ఇవ్వాలి. చీకటి పడడానికి 2 గంటల ముందు మేత వేస్తే సరిపోతుంది.  మనకు అందుబాటులో దొరికే దాణాలనే మేతగా వాడొచ్చు. చిన్న కోడి పిల్లలకు రైసు మిల్లులో దొరికే ముక్కులు, వెదురు ఆకులను ఆహారంగా అందివ్వవచ్చు. దీని వల్ల కోడి పిల్లల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. కోడి పిల్లలు ఎదిగిన తరువాత రెండోనెల నుంచి తవుడు, గోధుమ పొట్టు, మొక్కజొన్నలు, ఉలవలు వంటి పప్పుధాన్యాలను వరిగడ్డి, గరిక, కూరగాయ వ్యర్థాలు, ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా ఇందుకు వాడొచ్చు. ఈ పద్ధతిలో సమతుల్య ఆహారం ఇవ్వడం వలన సాధారణ కోళ్ల కంటే ఎక్కువ కాలం గుడ్లు పెడతాయి. మేతలో 30% వరకు సన్నగా తరిగిన గరిక, మునగాకు, అవిశాకు తదితరాలను కూడా ఇవ్వవచ్చు. దీని వలన దాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. దాణాలో కేజీకి ఒక మిల్లీ లీటర్ చొప్పున ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలిపి ఇవ్వాలి. ఐఎంఓ, ల్యాక్టో బ్యాక్టీరియా కలవడం వలన మేత తేలికగా జీర్ణమవుతుంది. అందులో ఎంజైమ్‌లు, యాంటీ బయోటిక్స్ తయారవడానికి ఇవి తోడ్పడతాయి. ఈ దాణా కోడి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
 
 - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్
 (ఇన్‌పుట్స్ : డా. మల్లికార్జునరెడ్డి, న్యూస్‌లైన్, ఎస్వీయూ, తిరుపతి.       
 ఫొటోలు: మోహన కష్ణ కేతారి)
 
 మేత రెండు రకాలు: పొడి మేత, తడి మేత
 
 
 తడి మేతలో అరటి బోదెలు- 50%, కూరగాయ వ్యర్థాలు- 30%, వరి గడ్డి- 15%, వెదురు ఆకులు- 5% ఉండాలి. పొడి మేతలో.. వరి తవుడు 30%, మొక్కజొన్న 30%, ఉలవలు 25%, వరిగడ్డి లేదా పుట్టమన్ను 15% కలిపి ఇవ్వాలి.
 కాయగూరలతో పాటు అందుబాటులో ఉన్నప్పుడు బొప్పాయి, గుమ్మడి కాయలను కూడా సన్నగా తరిగి మేతలో కలపవచ్చు.
 షెడ్ చుట్టూరా అడుగు దూరంలో నిమ్మగడ్డి, పుదీనా వంటి మొక్కలను పెంచితే.. దోమలు, ఇతర పరాన్నజీవులు కోళ్లను బాధించవు.
 నీటిలో కరిగే సున్నం, గుడ్ల పెంకులు, నత్తగుల్లలు, ఎముకలు  గోధుమ రంగుకు తిరిగే వరకు వేయించి, పొడి చేసి నీటిలో కలిపి మేతలో కలిపి ఇస్తే కాల్షియం లోపం తీరుతుంది.
 
 డా. చో ప్రకృతి సాగు పద్ధతులపై వేసవిలోశిక్షణ!
 
 డా. చో పద్ధతిలో కోళ్ల పెంపకం ద్వారా రైతుకు నికరాదాయం బాగా వస్తుంది. మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు రావు. డా. చో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు పంటలూ పండించవచ్చు. ‘సర్ర’ స్వచ్ఛంద సంస్థతో కలసి ఎస్వీయూలో అధ్యయనం చేశాం. ఫలితాలు బాగున్నాయి. ఈ వేసవిలో రైతులు, విద్యార్థులు, అధ్యాపకులు, విదేశీయులకు విడివిడిగా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం.  
 
 - ప్రొ.సాయి గోపాల్ (98496 15634), వైరాలజీ విభాగాధిపతి, ఎస్వీయూ, తిరుపతి
 ఇతర వివరాలకు: రోహిణీరెడ్డి (‘సర్ర’ సంస్థ)- 099859 47003,  సోమశేఖర్- 99661 43361
 
 ల్యాక్టో బ్యాక్టిరియా తయారీ ఇలా
 
 కోళ్ల ఫారమ్‌లో ఉపయోగించే ల్యాక్టో బ్యాక్టీరియాను తయారు చేసుకోవడం అతి సులభం. ఇంట్లో బియ్యం కడిగిన నీటిని ఒక ప్లాస్టిక్ టబ్‌లో లేదా కుండలో పోసి ఉంచుకోవాలి. బియ్యం కడిగిన నీరు 3 నుంచి 5 రోజుల్లో పులిసి పుల్లని వాసన వస్తుంది. ఈ నీటిని ఓ పాత్రలోకి పోసుకోవాలి. ఒక వంతు బియ్యం కడిగిన నీళ్లకు పది వంతులు పాలు కలపాలి. పాత్రలో మూడో వంతు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఈ పాత్రకు మూతి బిగించి లేదా శుభ్రమైన తెల్లకాగితంతో కప్పి దారంతో కట్టి ఎండసోకని మూలన భద్రపర్చుకోవాలి. 3 రోజుల్లో పాత్రలోని ద్రావణం 3 పొరలుగా ఏర్పడుతుంది. పై భాగంలో పాలలోని కొవ్వు పదార్థాలు తెట్టు మాదిరిగా పేరుకుంటాయి. మధ్య భాగంలో పసుపు పచ్చ లేదా లేత పసుపు పచ్చ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ల్యాక్టో బ్యాక్టీరియా. దీన్ని వడకట్టుకొని మరో పాత్రలో పోసుకోవాలి. నిలువ ఉంచుకోవడానికి ద్రావణం ఎంత ఉందో అంత బెల్లాన్ని కలుపుకోవాలి. కోళ్ల షెడ్డులో నాలుగైదు మిల్లీలీటర్ల ల్యాక్టో బ్యాక్టీరియాను ఒక లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
 

మరిన్ని వార్తలు