ఓనమ్ము... భోజనమ్ము..!

4 Jun, 2014 22:38 IST|Sakshi
ఓనమ్ము... భోజనమ్ము..!

పుస్తెలు అమ్ముకునైనా పులసల్ని వండుకుతినాలని
 మన దగ్గర సామెత.
 కేరళలో కూడా ఇలాంటిదే ఒక సామెత ఉంది!
 ‘కనం విట్టుం ఓనమ్ ఉన్ననం’ అంటారు వాళ్లు.
 ఆస్తుల్ని అమ్ముకునైనా ‘తిరుఓనం’ విందును ఆరగించాల్సిందేనట!!
 ఎల్లుండే కేరళీయుల ఓనం పండుగ!
 పదో రోజు వచ్చేది తిరు ఓనమ్ పండుగ.
 అప్పుడు చూడాలి... అదో ఫుడ్ ఫెస్టివల్‌లా ఉంటుంది.
 అవియల్, అడై ప్రదమన్, ఇడియప్పమ్...
 పరిప్పు, వళైక్కళ్ తోరణ్... ఏతక్కప్పమ్... ఒకటా రెండా!
 పక్కన తెలుగువాళ్లుంటే...
 ఇరుగుదేవోభవ, పొరుగుదేవోభవ అనుకుంటూ...
 క్యారేజీలు కూడా వచ్చేస్తాయి!
 అందరి ఇళ్లూ కేరళ వాళ్ల పక్కన ఉండవు కదా... మరెలా?
 అందుకే కదా... ఈ రుచుల మేళా!
 పుస్తెలు, ఆస్తులు ఏవీ అమ్ముకోకుండానే... తృప్తిగా తిని త్రేన్చండి!
 హ్యాపీ ఓనం. హ్యాపీ తిరు ఓనం.

 
 అవియల్
 
 కావలసినవి:
 కూరగాయ ముక్కలు - మూడు కప్పులు (క్యారట్, బీన్స్, ఆలు, మునగకాడలు, పొట్లకాయ, అరటికాయ, తీపి గుమ్మడికాయ, సొరకాయ, కంద...); గట్టి పెరుగు - అర కప్పు; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - రుచికి తగినంత; కొబ్బరి తురుము - కప్పు; పచ్చిమిర్చి - 10; కొత్తిమీర - కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; కొబ్బరినూనె - చిన్నగిన్నెడు; కరివేపాకు - చిన్న కట్ట; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 2 (చిన్నగా ముక్కలు చేయాలి)
 
 తయారి:  

 ఒక పాన్‌లో తరిగి ఉంచుకున్న కూరముక్కలు, పసుపు, తగినంత నీరు వేసి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడికించాలి
 
 మిక్సీలో కొబ్బరితురుము, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, ఉప్పు వేసి పేస్ట్‌లా చేయాలి
 
  చిలకరించిన పెరుగు వేసి మరోమారు కలిపి దించేయాలి
 
  బాణలిలో టేబుల్ స్పూను కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి
 
 కరివేపాకు వేసి ఒకసారి కలిపి దించేయాలి
 
 కూరలో ఈ పోపు వేసి కలపాలి
 
  చివరగా కొబ్బరినూనె వేసి బాగా కలిపి దించేయాలి  
 
 ఇది రోటీలలోకి, అన్నంలోకి బాగుంటుంది.
 
 ఏతక్క అప్పం
 
 కావలసినవి:
 అరటిపళ్లు - 5; మైదా - కప్పు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - 3 టేబుల్ స్పూన్లు; పసుపు - చిటికెడు; నీరు - కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; వంటసోడా - చిటికెడు; ఉప్పు - చిటికెడు; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
 
 తయారి:
 అరటిపండు తొక్క తీసి పండును పొడవు (నిలువు)గా కట్ చేయాలి
 
 ఒక గిన్నెలో మైదాపిండి, బియ్యప్పిండి, పంచదార, పసుపు, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి  
 
 కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ, పిండిని బజ్జీలపిండి మాదిరిగా చేసుకోవాలి
 
 బాణలిలో నూనెపోసి కాగాక, కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కలను పిండిలో ముంచి బజ్జీలు వేసుకోవాలి  
 
 గోధుమవర్ణంలోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదికి తీసుకోవాలి  
 
 వేడివేడి టీతో స్నాక్‌గా సర్వ్ చేయాలి.
 
 అడై ప్రదమన్
 
 కావలసినవి:
 శనగపప్పు - కప్పు (ఉడికించి మెత్తగా చేయాలి); కొబ్బరితురుము - ఒకటిన్నర కప్పులు; బెల్లంతురుము - కప్పు; ఏలకులపొడి - టీ స్పూను; నెయ్యి - పావు కప్పు; జీడిపప్పు పలుకులు - 10; కిస్‌మిస్ - టేబుల్ స్పూన్; కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు
 
 తయారి:  
 బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్, కొబ్బరిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి
 
  చల్లటి నీటిలో కొబ్బరితురుము వేసి రెండుమూడు నిముషాలు ఉంచి, ఆ తరవాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి  
 
 కొబ్బరిని గట్టిగా పిండితే కొబ్బరి పాలు వస్తాయి. వాటిని పక్కన ఉంచాలి (మొదటిసారి తీసినప్పుడు చిక్కటిపాలు వస్తాయి. మళ్లీ నీరుపోసి బాగా కలిపితే వచ్చేవి పల్చగా ఉంటాయి. రెండిటినీ విడివిడిగా ఉంచాలి)  
 
 ఒక పెద్ద పాత్రలో చిక్కటి కొబ్బరిపాలు, నీరు, మెత్తగా చేసిన శనగపప్పు, సగం నెయ్యి వేసి బాగా కలిపి పొయ్యి మీద ఉంచి ఐదు నిముషాలు ఉడికించాలి  కొబ్బరితురుము జత చేసి ఆపకుండా కలుపుతుండాలి  
 
 మిగిలిన నెయ్యి, ఏలకుల పొడి వేసి కలపాలి  
 
 చివరగా పల్చటి కొబ్బరిపాలు వేసి రెండు నిముషాలు ఉడికించి దించాలి
 
 డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి.
 
 వజైక్కల్ తోరణ్
 
 కావలసినవి:
 అరటికాయలు - 2; కొబ్బరితురుము - అర కప్పు; పచ్చిమిర్చి - 4; సాంబారు ఉల్లిపాయలు - 6; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; పసుపు - చిటికెడు; కరివేపాకు - రెండు రెమ్మలు; ఎండుమిర్చి - 1; ఉప్పు - తగినంత; కొబ్బరినూనె - టేబుల్ స్పూను
 
 తయారి:  
 అరటికాయలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, ముక్కలు కట్ చేయాలి
 
 బాణలిలో అరటికాయముక్కలు, పసుపు, ఉప్పు, తగినంత నీరు వేసి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించి నీరు ఒంపేయాలి
 
 ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచాలి (మరీ మెత్తగా ఉండకూడదు)
 
  బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక, ఆవాలు కరివేపాకు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి
 
 
 కొబ్బరితురుము జత చేసి బాగా కలపాలి  
 
 ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి
 
  వేడివేడి అన్నంతో సర్వ్ చేయాలి.
 
 ఇడియప్పమ్
 
 కావలసినవి:
 బియ్యప్పిండి - 2 కప్పులు; నీరు - రెండు కప్పులు (అవసరమనుకుంటే మరికాస్త నీరు కలుపుకోవచ్చు); కొబ్బరితురుము - అర కప్పు; ఉప్పు - తగినంత: నూనె - అర టీ స్పూను
 
 తయారి:  
 బియ్యప్పిండి పాన్‌లో వేసి రెండు నిముషాలు వేయించాలి (నూనె వాడకూడదు)
 
  పెద్దపాత్రలో నీరు పోసి మరిగించాలి  
 
 ఉప్పు జత చేసి బాగా కలిపి దించేయాలి  
 
 వేయించి ఉంచిన బియ్యప్పిండిని వేడినీటిలో కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి  
 
 చల్లారాక జంతికల పిండి మాదిరిగా కలపాలి
 
 ఇడ్లీ రేకులకు నూనె లేదా నెయ్యి రాయాలి  
 
 అన్ని గుంటలలోనూ కొబ్బరితురుము చల్లాలి  
 
 పిండిని తీసుకుని జంతికల గొట్టంలో వేసి (కారప్పూస ప్లేట్ ఉపయోగించాలి) ఇడ్లీ రేకుల మీద జంతికల మాదిరిగా చుట్టాలి  
 
 అన్ని ప్లేట్లను కుకర్‌లో ఉంచి మూతపెట్టి,పదిహేను నిముషాలు ఉడికించాలి (విజిల్ పెట్టకూడదు)
 
 సాంబార్‌తో సర్వ్ చేయాలి.
 
 పరిప్పు కర్రీ
 
 కావలసినవి:
 పెసరపప్పు - అరకప్పు; పసుపు - చిటికెడు; నీరు - రెండు కప్పులు; ఉప్పు - తగినంత; కొబ్బరితురుము - అరకప్పు; ఉల్లి తరుగు - పావుకప్పు; పచ్చిమిర్చి - 4; జీలకర్ర - అర టీ స్పూను; కొబ్బరినూనె - 2 టీ స్పూన్లు; ఆవాలు - పావు టీ స్పూను; ఉల్లితరుగు - టేబుల్ స్పూను; ఎండుమిర్చి - 2
 
 తయారి:  
 బాణలిలో పెసరపప్పు వేసి వేయించాలి (నూనె వేయకూడదు)  
 
 ఒక గిన్నెలో పెసరపప్పు, పసుపు, రెండు కప్పుల నీరు వేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి  
 
 కొబ్బరి తురుము, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి  
 
 విజిల్ తీసి పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని మాష్ చేసి, కొబ్బరి మిశ్రమం, ఉప్పు జత చేయాలి
 
 ఐదు నిముషాలు స్టౌ మీద ఉంచాలి  
 
 బాణలిలో కొబ్బరినూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు, ఉల్లితరుగు, ఎండుమిర్చి వేసి వేయించి దించేయాలి
 
 పెసరపప్పు మిశ్రమంలో పోపు వేసి కలపాలి  
 
 వేడివేడి అన్నం, నేతితో సర్వ్ చేయాలి.
 
 సేకరణ :  డా. వైజయంతి
 కర్టెసీ :  ఇండియన్ క్విజైన్

 

మరిన్ని వార్తలు