తక్కువ నీటితో ఎక్కువ ఇంటి పంటలు!

4 Feb, 2015 23:15 IST|Sakshi
తక్కువ నీటితో ఎక్కువ ఇంటి పంటలు!

వికింగ్ బెడ్స్‌తో సుసాధ్యం  వారానికోసారి నీరు పోస్తే చాలు
 
అతి తక్కువ నీటి ఖర్చుతో రసాయనిక అవశేషాల్లేని సహజాహారాన్ని ఇంటిపట్టున పండించుకోవడానికి ఉపకరించే కంటెయినర్ పేరే ‘వికింగ్ బెడ్’. ఈ వికింగ్ బెడ్‌కు రోజూ నీరు పోయాల్సిన పనిలేదు. ఇందులో అమర్చిన పీవీసీ పైపులో వారానికోసారి నిండుగా నీరు పోస్తే చాలు.

వికింగ్ బెడ్స్‌ను మేడ మీద, నేల మీద, గచ్చు మీద ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్ద పీపాను మధ్యలోకి నిలువునా కోసి, అందులో వికింగ్ బెడ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఫైబర్ తొట్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. నేలలో గొయ్యి తవ్వి, గోతిలో ప్లాస్టిక్ షీట్ పరచి వికింగ్ బెడ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సాగుకు పనికిరాని భూమిలోనూ ఎంచక్కా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవచ్చు. చెక్క ముక్కలతో చేసిన పెట్టెలోనూ ప్లాస్టిక్ షీట్ వేసి వికింగ్ బెడ్‌ను నిర్మించవచ్చు.

 పట్నాలు, నగరాల్లో భవనాల్లో నివసించే వారూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. రైతులు కూడా అన్ని కాలాల్లో అన్ని పంటలూ పండించరు కాబట్టి వికింగ్‌బెడ్స్ వారికీ అవసరమే. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం ఆరుమాకులపల్లిలో లచ్చన్నగారి రామచంద్రారెడ్డి(85009 86728) అనే రైతు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన 8 వికింగ్ బెడ్స్ ద్వారా 3 కుటుంబాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు ఏడాది పొడవునా పండిస్తున్నారు. ఒక్కో బెడ్‌కు వారానికోసారి బిందెడు నీరు పోస్తే చాలని ఆయన చెప్పారు.
 
వికింగ్ బెడ్ తయారీ ఇలా..


వికింగ్ బెడ్ 4 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు ఉంటే సదుపాయంగా ఉంటుంది. పొడవు 6 అడుగులు పెట్టొచ్చు (అవసరాన్ని బట్టి పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు). తొలుత 6 గీ 4 గీ 2 సైజు కంటెయినర్‌ను తీసుకోవాలి. 4 అంగుళాల చుట్టుకొలతతో కూడిన రెండు పీవీసీ పైపులు తీసుకోవాలి. వీటిల్లో ఒకటి 6 అడుగులు, మరొకటి 2.5 అడుగుల పొడవుండాలి. 6 అడుగుల పీవీసీ పైపునకు అంగుళానికొకటి చొప్పున బెజ్జాలు చేయాలి. దీన్ని కంటెయినర్ లో పెట్టాలి. ఒక వైపు ఎండ్ క్యాప్‌తో మూసివేసి.. మరో చివర నుంచి 2.5 అంగుళాల పైపును ఎల్ ఆకారంలో నిలువుగా అమర్చాలి. దీనిలో నుంచే నీటిని అందించాలి. కంటెయినర్‌లో అడుగున పెట్టిన పీవీసీ పైపుపైన 5-6 అంగుళాల ఎత్తున ముతక రాళ్లను లేదా కొబ్బరి బొండాం డొప్పలను పేర్చాలి. కంటెయినర్ గోడకు చిన్న బెజ్జం పెట్టి అదనపు నీరు బయటకు పోవడానికి చిన్న పైపును అమర్చాలి. దానిపైన గ్రీన్ షేడ్‌నెట్‌ను కప్పాలి. దానిపైన మట్టి, కొబ్బరిపొట్టు మిశ్రమాన్ని 16 అంగుళాల మందాన పోయాలి. మట్టి మిశ్రమానికి అడుగున కూడా అదనపు నీరు బయటకు పోవడానికి చిన్న డ్రెయిన్‌ను ఏర్పాటు చేయాలి. అంతే.. వికింగ్ బెడ్ సిద్ధమైనట్లే. తొలిసారి మట్టిపైన నీటిని చల్లి.. విత్తనాలు లేదా మొక్కలు నాటాలి. ఆ తర్వాత నుంచి మట్టిపైన నీరు పోయాల్సిన పని లేదు. అప్పుడప్పుడూ పీవీసీ పైపులో నిండుగా నీటిని నింపాలి.

కంటెయినర్‌లో అడుగున అమర్చిన చిల్లుల పీవీసీ పైపులో నుంచి మట్టి మిశ్రమం ద్వారా మొక్కల వేళ్లకు నీటి తేమ అందుతూ ఉంటుంది. అందువల్ల నీటి వృథా బాగా తగ్గుతుంది. అందువల్లే వారానికోసారి నీటిని పీవీసీ పైపులో నింపితే సరిపోతుంది. వారాంతాల్లో తప్ప ఇతర రోజుల్లో ఎక్కువ సమయాన్ని ఇంటిపంటలకు కేటాయించలేని వారికి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వారికి వికింగ్ బెడ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

 సేంద్రియ ఆహారాన్ని ఎవరికి వారు పండించుకోవడానికి తోడ్పడే లక్ష్యంతో ఇంటిగ్రేటర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అక్కిపెద్ది కల్యాణ్ (097417 46478) వికింగ్ బెడ్స్‌పై శిక్షణ ఇస్తున్నారు. బెంగళూరు, గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో వికింగ్ బెడ్స్ నెలకొల్పి చక్కని ఫలితాలు సాధిస్తున్నారు.
 - ఇంటిపంట డెస్క్

మరిన్ని వార్తలు