సూక్ష్మజీవులే సేద్యానికి ప్రాణం!

22 May, 2017 23:53 IST|Sakshi
సూక్ష్మజీవులే సేద్యానికి ప్రాణం!

వ్యవసాయ సంక్షోభం పైకి ఆర్థిక సంక్షోభంలా కనిపిస్తున్నప్పటికీ.. దీని మూలాలు పంట భూమిలో అనంత కోటి సూక్ష్మ జీవరాశి వినాశనంలో దాగి ఉంది. రసాయనిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల పంట భూములు నిర్జీవమై, నిస్సారమై ఉత్పాదక శక్తిని కోల్పోతున్నాయి. సేద్యాన్ని తిరిగి ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం ఒక్కటే మార్గం. అంటే భూమిలో సూక్ష్మజీవరాశిని,వానపాములను కంటికె రెప్పలా కాపాడుకునే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి(జడ్‌.బి.ఎన్‌.ఎఫ్‌.)ని చేపట్టడమే మేలైన మార్గమని జడ్‌.బి.ఎన్‌.ఎఫ్‌. పితామహుడు పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 13 నుంచి 21 వరకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలోని చిన్నజీయర్‌ స్వామి ఆశ్రమంలో ‘సేవ్‌’ తదితర సంస్థలు సుమారు 3 వేల మంది యువ రైతు కుటుంబాలకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం సందర్భంగా పాలేకర్‌ ‘సాగుబడి’తో ముచ్చటించారు. పాలేకర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు..

పంటల సాగులో భూమిలోని సూక్ష్మజీవరాశి, వానపాముల ప్రాధాన్యం ఏమిటి?
బియ్యాన్ని మనం నేరుగా తినలేం, అన్నం వండుకొని తినాల్సిందే. అదేవిధంగా పంట భూమిలో ఉండే పోషకాలు కూడా మొక్కలు, పంటల వేర్లు నేరుగా గ్రహించగలిగే రూపంలో ఉండవు. వాటిని వేర్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చగలిగేది మట్టిలో ఉండే కోటానుకోట్ల సూక్ష్మజీవరాశే. అందువల్లనే పంట భూమిలో ఉండే లెక్కకు అందనన్ని జాతుల సూక్ష్మజీవులు, వానపాముల పాత్ర పంటల సాగులో అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే, రసాయనిక ఎరువులు, కలుపు మందుల వాడకంతో భూమిలోని సూక్ష్మజీవరాశి సర్వ నాశనం అవుతున్నది. రసాయనిక ఎరువులు, కలుపుమందులు మాత్రమే కాదు సేంద్రియ ఎరువులు కూడా మట్టిలోని సూక్ష్మజీవరాశిపై విషతుల్యమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. అందువల్లనే ఈ రెండు పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు ప్రతి పంటకూ ఎరువులను మార్కెట్లో కొని వేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఇదొక కుట్ర. కానీ, భూమిలోని సూక్ష్మజీవరాశిని పెంపొందిస్తూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నిక్షేపంగా దిగుబడి సాధిస్తున్నాం.

అదెలాగో వివరించండి..?
దేశీ ఆవులను మనం వేల సంవత్సరాలుగా పూజిస్తున్నాం. కాబట్టి ఈ ఆవుల పేడ, మూత్రం, పాల వల్ల ఉపయోగకరమైన ప్రత్యేక గుణాలు లేకపోతే ఎందుకు పూజిస్తున్నట్లు? ఈ ఆలోచనతో దేశంలోని 35 గోజాతుల పేడ, మూత్రంలను లేబరేటరీలో పరీక్ష చేయించా. గ్రాము నాటు ఆవు పేడలో 300 కోట్లకుపైగా మేలుచేసే సూక్ష్మజీవులు ఉన్నాయని తెలుసుకున్నా. అనేకానేక జాతుల సూక్ష్మజీవులున్నాయి. కానీ, జెర్సీ, హోలిస్టీన్‌ పేడలో 70 లక్షలకు మించి లేవు. అందువల్ల దేశీ ఆవు పేడ, మూత్రంతో జీవామృతాన్ని తయారు చేశా. భూమిలో సూక్ష్మజీవుల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంపొందించే కల్చర్‌ (తోడు)గా జీవామృతాన్ని వాడుతున్నాం. సూక్ష్మజీవరాశిని పెంపొందించే తోడును పంట భూమికి అందిస్తే చాలు, ఎటువంటి ఎరువులూ బయటి నుంచి తెచ్చి వేయాల్సిన అవసరమే లేదు.

కానీ, చివికిన పశువుల ఎరువు (దిబ్బ ఎరువు) ను, రసాయనిక ఎరువులను పంటలకు ఆహారంగా వాడాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. పంటలకు కావాల్సింది ఎరువు కాదు, భూమిలో ఇప్పటికే ఉన్న సకల పోషకాలను అందుబాటులోకి తేవడానికి సూక్ష్మజీవరాశిని పెంపొందించే తోడు (మైక్రోబియల్‌ కల్చర్‌)ను పొలాల్లో వేస్తే చాలు. ఈ తోడును తయారు చేయడానికి అవసరమైన సూక్ష్మజీవరాశి దేశీ ఆవు పేడ, మూత్రంలో పుష్కలంగా ఉన్నాయి. పది కిలోల దేశీ ఆవు పేడలో 30 లక్షల కోట్ల మేలుచేసే సూక్ష్మజీవులుంటాయి. దీనితో జీవామృతం కలిపితే అందులోని సూక్ష్మజీవులు 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటాయి. 48 గంటల్లో సూక్ష్మజీవుల సంఖ్య ఎంతకు పెరుగుతుందో చెప్పాలంటే సూపర్‌ కంప్యూటర్‌ కావాలి. జీవామృతం, ఘనజీవామృతం తయారు చేయించి వాడటంతో భూసారం పెరిగి, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. దేశంలో 50 లక్షల మంది రైతులు పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం చేస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.

పంట భూమిలో సూక్ష్మజీవరాశిని పెంపొందిస్తే చాలా?
కాదు, భూమిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతోపాటు.. భూమి పైన పొలంలో అనేక రకాల అంతర పంటలు సాగు చేయడం ద్వారా పంటల జీవవైవిధ్యాన్ని కూడా పెంపొందించాలి. నేను ఇదే చెబుతున్నా. ప్రధాన పంట మధ్యలో సుమారు 20 రకాల అంతర పంటలు వేయిస్తున్నా.

అన్ని ఎక్కువ రకాల అంతర పంటలు విధిగా సాగు చేయాల్సిన అవసరం ఏమిటి?
ఎందుకంటే, అనేక పంటలు ఉంటే అనేక రకాల మిత్ర పురుగులను ఆకర్షిస్తాయి. ఎన్ని రకాల అంతర పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల బాక్టీరియా, పక్షులు, మిత్రపురుగులను మన పంట పొలంలోకి ఆహ్వానించగలుగుతాము. మిత్రపురుగులు, పక్షులు వచ్చి శత్రుపురుగులను తినేస్తాయి. కాబట్టి పంటలకు చీడపీడల బెడద ఉండదు.

పగటి ఉష్ణోగ్రతతోపాటు పంట భూమిలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతోంది. పంటలు, తోటలు కూడా ఎండిపోతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ఏమైనా పరిష్కారం ఉందా?
పంటల దిగుబడి సజావుగా రావాలంటే పంట భూమిలో జీవనద్రవ్యం (హ్యూమస్‌) చాలినంత తయారు కావటం చాలా ముఖ్యం. పంట భూమిలో ఉష్ణోగ్రత బాగా పెరిగినప్పుడు జీవనద్రవ్యం తరిగిపోతుంది. రసాయనిక, సేంద్రియ సేద్యం చేసే భూముల్లో హ్యూమస్‌ ఏర్పడదు. ఇది కూడా కుట్రే. అయితే, ప్రకృతి వ్యవసాయంలో పంట వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదన (స్ట్రా మల్చింగ్‌) చేస్తాం కాబట్టి, ఉష్ణోగ్రత పెరిగినా హ్యూమస్‌ దెబ్బతినదు. పంటలు అధిక ఉష్ణోగ్రతకు తట్టుకుంటాయి.  

ప్రకృతి సేద్యం జరిగే తోటల్లో కూడా గడ్డీ గాదంతో ఆచ్ఛాదన అంతగా చేస్తున్నట్లు లేదు..?
పండ్ల తోటల్లో గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేయడం తప్పనిసరి. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే పప్పు ధాన్య (ద్విదళ) పంటలను అంతర పంటలు (లైవ్‌ మల్చింగ్‌)గా సాగు చేయాలి. వేసవిలో అంతర పంటలు కూడా ఉండవు. కాబట్టి.. పొలంలో పైపాటు చేయించాలి. 4.5 అంగుళాల కన్నా ఎక్కువ లోతుగా దున్నకూడదు. పైపొర మట్టి 4.5 అంగుళాల వరకే ప్రాణవాయువు అందుతుంది. సూక్ష్మజీవరాశి కూడా ఈ పైపొర మట్టిలోనే ఉంటుంది. అంతకన్నా కింద మట్టిని దున్నితే కార్బన్‌ డయాక్సయిడ్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది. భూతాపోన్నతికి ఇది కారణమవుతుంది. కాబట్టి, ఖాళీ భూముల్లో వేసవి దుక్కులుగా గానీ, పండ్ల తోటల్లో, వార్షిక పంటల్లో గానీ లోతు దుక్కి చేయడం ప్రమాదకరం. ప్రకృతి వ్యవసాయంలో ట్రాక్టర్‌ వాడకుండా అరక, గొర్రులతో పైపైన మట్టిని లేవదున్నాలి. అంతే తప్ప పైపొర 4.5 అంగుళాల మట్టి లోపలికి తిరగబడేలా ఎట్టిపరిస్థితుల్లోనూ లోతు లోతుగా దుక్కి చేయకూడదు. ప్రకృతి సేద్యం చేసే పొలాల్లో ఉండే వానపాములు నిరంతరం బొరియలు చేస్తుంటాయి. అందువల్ల వాన నీటి సంరక్షణ పూర్తిస్థాయిలో జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల్లోనూ పంట తట్టుకుంటుంది. దీన్ని రుజువు చేశాం.

హైడ్రోపోనిక్స్‌ సేద్యం గురించి మీ అభిప్రాయం?
ఇది పూర్తిగా పిచ్చి పని. దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల పంట భూములు ఖాళీగా ఉన్నాయి. మట్టి అవసరం లేని హైడ్రోపోనిక్స్‌ సేద్యం పేరిట.. ద్రవరూప రసాయనిక ఎరువులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. రైతుల సొమ్మును దోచుకోవడానికి ఇది మరో రకమైన కుట్ర. చలి దేశాల్లో 7 నెలలు మంచు కురుస్తుంది కాబట్టి వాళ్లు ఏడాదంతా పంటలు సాగు చేసుకోవడానికి పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్స్‌ అని మరొకటని వాళ్ల బాధలు వాళ్లు పడుతున్నారు. మనకు హైడ్రోపోనిక్స్‌ గానీ, పాలీహౌస్‌లు గానీ బొత్తిగా అవసరం లేదు. రైతులను భారీ అప్పుల ఊబిలోకి దింపడానికి బ్యాంకర్లు, దళారులు పన్నిన కుట్రే పాలీహౌస్‌ సేద్యం. గాలివానలకు, వడగళ్లవానలకు పాలీహౌస్‌లు నాశనమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో ఎండాకాలంలోనూ 10% నీటితో, 10% విద్యుత్‌తో పూలు, కూరగాయ పంటలు చక్కగా పండించి చూపిస్తున్నాం.. ఇవేవీ అవసరం లేదు.

జన్యుమార్పిడి ఆవాలు విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందన్న వార్తలు వినవస్తున్నాయి. ప్రకృతి సేద్యానికి జీఎం విత్తనాలు పనికొస్తాయా?
ప్రకృతి వ్యవసాయంలో దేశీ వంగడాలు అధిక దిగుబడినిస్తున్నాయి. దేశీ పత్తి వంగడాలే బీటీ పత్తి కన్నా అధిక దిగుబడినిస్తున్నాయి. చీడపీడలను తట్టుకుంటున్నాయి. బీటీ పత్తి వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆవాలతోపాటు ఏ పంటలోనూ జన్యుమార్పిడి విత్తనాల అవసరమే లేదు. అంతర్జాతీయ దోపిడీ వ్యవస్థ హరిత విప్లవం తర్వాత మార్కెట్‌లోకి తెచ్చిన మరో ముదనష్టపు టెక్నాలజీ ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎం పంటలకు అనుమతి ఇవ్వకూడదు.

రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మార్గం ఏమిటి?
రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలతోపాటు చీడపీడలు, వరదలు, కరువు కాటకాలు, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రుణాలు తీర్చలేక ఇప్పటికి 7 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది రైతులు ఈ దుస్థితి నుంచి విముక్తమయ్యారు. నాణ్యమైన, పోషక విలువలు, ఔషధ విలువలతో కూడిన సహజాహారాన్ని పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుంది. ప్రభుత్వాలు ఇందుకు దోహదపడేలా విధాన నిర్ణయాలు తీసుకోవాలి. రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలను నిషేధించాలి.
ఇంటర్వ్యూ :  పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

పశువుల ఎరువు పంట పొలాలకు బలం అని మన రైతులు అనాదిగా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా ప్రోత్సహిస్తున్నారు. కానీ, మీరు ఇది ప్రమాదకరం అంటున్నారు..?
దేశీ ఆవులు లేదా ఇతర పశువుల పేడతో తయారైన దిబ్బ ఎరువు గానీ, వర్మీ కంపోస్టు గానీ, బయోడైనమిక్‌ పద్ధతిలో తయారైన ఆవు కొమ్ము ఎరువు గానీ వాడటం అత్యంత ప్రమాదకరం. వీటిలో 46% సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని పంట పొలాల్లో చల్లినప్పుడు లేదా ఆ తర్వాత గానీ పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా పెరగగానే.. ఈ ఎరువుల్లోని కర్బనం విడుదలై వాతావరణంలో కలవడం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు పెరిగినప్పుడు కర్బనం పూర్తిగా విడుదలై, వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలిసి, కార్బన్‌ డయాక్సయిడ్‌గా మారుతుంది. కార్బన్‌ డయాక్సయిడ్, మిథేన్, నైట్రస్‌ ఆక్సయిడ్‌ వంటి హరిత గృహ వాయువుల వల్ల భూతాపం పెరిగిపోతున్న సంగతి మనకు తెలుసు.

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే.. చెట్లు, పంటలు 98% పోషకాలను సూర్యరశ్మి నుంచి, వాతావరణం నుంచే గ్రహిస్తాయి. ఎక్కడో తయారు చేసిన రసాయనిక/ సేంద్రియ ఎరువులను తెచ్చి వేయాల్సిన అగత్యమే లేదు. చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కూడా వీటి అవసరం లేదు. భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. ఉన్న పోషకాలను మొక్కల వేళ్లు ఉపయోగించుకునే రూపంలోకి మార్చేది సూక్ష్మజీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చి.. వీలైన పద్ధతిలో ఆచ్ఛాదన చేస్తే చాలు. ఇదే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి విశిష్టత.

మరిన్ని వార్తలు