నీటి యోధుడికి జేజేలు!

25 Aug, 2015 00:05 IST|Sakshi
నీటి యోధుడికి జేజేలు!

నీటి కరువు బాధ అందరికన్నా రైతులకే ఎక్కువ తెలుసు. రైతులకు అంతకుమించిన జీవన్మరణ సమస్య. మంచి నీరు 70% వ్యవసాయం కోసమే ఖర్చవుతోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే 95% నీరు వ్యవసాయానికే ఖర్చవుతోంది (ఎఫ్.ఎ.ఓ.). అందుకే ఆయుర్వేద వైద్యంలో పట్టా పుచ్చుకున్న రాజేంద్రసింగ్ వైద్యశాలలు తెరవడానికి 35 ఏళ్ల క్రితం ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో మారుమూల పల్లెలకు వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను కోరిందేమిటంటే.. అయ్యా మాకు వైద్యం కన్నా ముందు కావాల్సింది నీరు.

తాగు నీటి కోసం, సాగు నీటి కోసం ఏదైనా చేసి పుణ్యం కట్టుకోండని బతిమాలారు. అప్పటి నుంచి రాజేంద్రసింగ్, ఆయన మిత్రబృందం నీటి భద్రత సాధనే ధ్యేయంగా పెట్టుకొని స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. రైతులు, గ్రామీణులను కూడగట్ట గలిగితే ఎడారి ప్రాంతంలో ఎండిపోయిన నదులను కూడా నిక్షేపంగా పునరుజ్జీవింపజేసుకొని పంటకు, ఇంటికి నీటి కరువు లేకుండా చేయొచ్చని లోకానికి నిరూపించారు. తరుణ్ భారత్ సంఘ్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. సంప్రదాయక మట్టి ఆనకట్టలు (జొహాద్‌లు) కట్టించడానికి విశేష కృషి చేశారు.

పారే వాన నీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింపజేయడానికి 8,600 జొహాద్‌లను నిర్మించారు. రాజస్థాన్‌లో కొద్ది సంవత్సరాల్లోనే వెయ్యి గ్రామాలకు జల కళ తిరిగి వచ్చింది. ఈ కృషి వల్ల రాజస్థాన్‌లో పూర్తిగా ఎండిపోయిన అనేక నదులు మళ్లీ నీటి పారుదలను కళ్ల జూశాయి. చెట్టు చేమ పచ్చబడింది. అడవి విస్తరించింది. తాగడానికే నీరు దొరకని ఆ గ్రామాల్లో ఇప్పుడు సేద్యానికి కూడా సంపూర్ణ నీటి భద్రత చేకూరింది. అందుకే ‘భారతీయ నీటి యోధుడు’గా రాజేంద్రసింగ్ ప్రపంచ ప్రసిద్ధుడయ్యారు. ‘స్టాక్‌హోం వాటర్ ప్రైజ్-2015’ ఆయనను వరించింది.

ప్రపంచ నీటి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా రేపు (ఆగస్టు 26న) రాజేంద్రసింగ్ ఈ అంతర్జాతీయంగా  ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోనున్నారు. ‘వాన నీటిని చెక్‌డామ్‌లు, కందకాల ద్వారా ఒడిసిపట్టుకొని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింపజేసుకుంటే నీటి భద్రత కలుగుతుంది. ప్రతి గ్రామంలోనూ ఈ పని చేస్తే ప్రపంచవ్యాప్తంగా కరువు, వరద బాధలు ఉండవ’ని రాజేంద్ర సింగ్ అన్నారు. నీటి యోధుడికి జేజేలు!

>
మరిన్ని వార్తలు