ఆదాయం.. ఆత్మసంతృప్తి..!

8 Dec, 2015 00:33 IST|Sakshi
ఆదాయం.. ఆత్మసంతృప్తి..!

♦ ప్రకృతి సేద్యబాటన సాగుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
♦ తోటి రైతుల్లోనూ జీవితేచ్ఛను ఇనుమడింపజేస్తున్న వైనం
 
 వృత్తి జీవిత పరమార్థం కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదు.. ఆత్మసంతృప్తి కూడా! కానీ, దేశవిదేశాల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో అనుభవం గడించిన ఇంజినీర్లు కొందరు మాత్రం ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిసారిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండిస్తూ, వినియోగదారులకు నేరుగా అందిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ప్రకృతితో మమేకమవడం ద్వారా ఆరోగ్యం, ఆత్మసంతృప్తితో పాటు.. సాఫ్ట్‌వేర్ రంగానికి తీసిపోనిఆదాయం కూడా పొందవచ్చని రుజువు చేస్తున్నారు. రసాయన రహిత సేద్యంతో పంట భూములను పరిరక్షించుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితోనే అధిక నికరాదాయం పొందే ప్రకృతి సేద్య మార్గాన్ని పరిచయం చేస్తూ తమ ప్రాంతంలోని అన్నదాతల్లో జీవితేచ్ఛను ఇనుమడింపజేస్తున్నారు. తెలంగాణ జిల్లాలకు చెందిన అటువంటి వారిలో రూ. 8 లక్షల వార్షికాదాయాన్ని వదిలి సేద్యపుబాట పట్టిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఒకరు. ఇదే మాదిరిగా ప్రకృతి సేద్యం    ఒడిలోకి చేరిన మరో ముగ్గురి అనుభవాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..  
 
 తలకంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెబ్బేరులో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఎంటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూ ఏటా రూ. 8 లక్షల ఆదాయం పొందేవారు. వారాంతపు సెలవుల్లో కర్ణాటకలోని కులార్, మాంద్ర జిల్లాల్లో ప్రకృతి సేద్య క్షేత్రాల సందర్శనకు వెళ్లేవారు. కొందరు రైతులు ఎకరానికి రూ.1-2 లక్షల ఆదాయం పొందడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భూమికి, మనిషికి, వాతావరణానికి మేలు చేసే పంటలు పండించి ఆత్మసంతృప్తితో జీవిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్న వాస్తవం ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆలోచనలో పడేసింది.   

 కుటుంబం ప్రోత్సాహంతో..
 తండ్రి సత్యనారాయణరెడ్డి అనారోగ్యం పాలవడంతో జూరాల ప్రాజెక్టు ఆయకట్టులోని తమ 15 ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చారు. కౌలు సరిగ్గా చేతికి రాకపోగా రసాయనిక వ్యవసాయంతో భూములు గుల్లవుతున్న పరిస్థితి. దాంతో ప్రకృతి వ్యవసాయం సొంతంగానే ఎందుకు చేపట్టకూడదన్న ఆలోచన వచ్చింది. అంతే.. 2013లో తమ పొలాన్ని కౌలుకు ఇవ్వకుండా మనుషులను నియమించి ప్రకృతి సేద్యం ప్రారంభించారు. నివాసం బెంగళూరులో.. సేద్యం స్వగ్రామంలో.. కుంటి నడకన సాగింది. పనిఒత్తిడి వల్ల స్వయంగా వెళ్లి రావడం కష్టంగా మారింది. దీంతో  ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి 2014లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో స్వగ్రామానికి తిరిగొచ్చి.. ప్రకృతి వ్యవసాయదారుడిగా మారిపోయారు. వేపనూనె, ఆముదం పిండి, కషాయాలు, జీవామృతం తదితరాలతో పంటలు సాగు చేస్తున్నారు.

 పాలమూరు రైస్..
 ఏడెకరాల్లో బత్తాయి తోట నాటి ఏడేళ్లయినా తగిన ఆదాయం రాకపోతుండడంతో దాన్ని నరికేసి మామిడి మొక్కలు నాటాలని తండ్రి ఆలోచిస్తుండగా ప్రవీణ్ కుమార్‌రెడ్డి అడ్డుపడ్డారు. 22 అడుగులకో బత్తాయి చెట్టుంది. వాటి మధ్యలో మామిడి మొక్కలు నాటించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. పంట కాలువ పక్కనే బోరు వేసి 12 ఎకరాల్లో పంటలకు డ్రిప్ ద్వారా నీరందిస్తున్నారు. తొలి ఏడాది(2014) ఖరీఫ్‌లో 2.5 ఎకరాల్లో వరి, మిగతా పొలంలో వేరుశనగ, అలసంద, గోగు, సజ్జలు మిశ్రమ సాగు చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో  బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకాలను సాగు చేశారు.

రెండున్నర ఎకరాలకు రూ. 39 వేల ఖర్చయింది. ఎకరానికి 22 బస్తాలు పండాయి. రూ. 79 వేల నికరాదాయం వచ్చింది. వేరుశనగ సాగుకు ఎకరాకు రూ. 55 వేల నికరాదాయం వచ్చింది. ధాన్యం మర పట్టించి కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 25 కిలోల చొప్పున  ‘పాలమూరు రైస్’ పేరిట ప్యాక్ చేసి.. నేరుగా వినియోగదారులకు అమ్మారు. స్థానిక ఉద్యోగులకు, మధ్యతరగతి వినియోగదారులకు తొలుత కిలో ప్యాకెట్ల శాంపిల్స్ ఇచ్చారు. ప్రకృతి ఆహారం రుచి చూసిన వారిలో 85 శాతం మంది వినియోగదారులుగా మారారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

 కరువు దెబ్బ..
 ఈ ఏడాది కరువు వల్ల కాలువ నీరు 2 నెలలు ఆలశ్యం కావడంతో ఖరీఫ్‌లో వరి సాగు చేయలేదు. ఎకరంన్నరలో బంతి పూలు, గోరుచిక్కుడు, చిక్కుడు సాగు చేసి మంచి ఆదాయం పొందారు. అయితే, బెండ, కాకర సాగులో ఆశించిన ఫలితాలు రాలేదు. మార్కెట్‌లో గిరాకీ ఉండే సీజన్‌లో పూల దిగుబడి వచ్చేలా.. 25 రోజులకో అరెకరంలో మూడు దఫాలుగా బంతి పూల సాగు ప్రారంభించడంతో మంచి ఆదాయం వచ్చింది.

 మార్పు దిశగా..
 తన పొలంలో ప్రకృతి సేద్యం చూసి పరిసరాల్లోని నలుగురు సాధారణ రైతులు ఈ పద్ధతిలోకి మారారని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదాయం పోతుందేమోనన్న భయంతో క్రమంగా రసాయనిక ఎరువులు తగ్గించుకుంటూ ప్రకృతి సేద్యంలోకి వస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. సాక్షి దినపత్రికలో ‘ఇంటిపంట’ కాలమ్ స్ఫూర్తితో బెంగళూరులో ఉన్నప్పటి నుంచే ఇంటిపంటలు సాగు చేసే అలవాటుందన్నారు. ప్రకృతి సేద్య పద్ధతిలో ఇంటిపంటల సాగులో మహిళా బృందాలకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు.
 - ఆడెం ఆంజనేయులు యాదవ్, పెబ్బేరు, మహబూబ్‌నగర్ జిల్లా
 
 ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది..
 రసాయనిక అవశేషాల్లేని ఆహారానికి చాలా డిమాండ్ ఉంది. స్థానికంగా, హైదరాబాద్‌లో, ఆన్‌లైన్‌లో ఇతర ప్రాంతాల్లోనూ ప్రకృతి ఆహారానికి  మార్కెట్ ఉంది. మా బియ్యాన్ని 40 ఏళ్లు దాటిన వాళ్లు అడిగి మరీ కొనుక్కెళ్తున్నారు. ప్రకృతి సేద్యం మొదలుపెట్టిన రెండేళ్లలో సంతృప్తికరమైన దిగుబడులు, నికరాదాయం పొందాను. ఏటేటా పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతోంది. రానున్న కాలంలో మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి అమ్మబోతున్నాం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి దీటుగా ఆదాయం తీస్తానన్న నమ్మకం ఉంది. అన్నిటికీ మించి మేం తినేదంతా ప్రకృతి ఆహారమే. నా పొలం వల్ల నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆత్మానందంతోపాటు ఆదాయం కూడా బాగానే ఉంది.
 - తలకంటి ప్రవీణ్‌కుమార్ రెడ్డి (96762 45533), పెబ్బేరు, మహబూబ్‌నగర్ జిల్లా
 
 ప్రకృతి సేద్యంలో సంతృప్తి ఉంది..
 ఆస్ట్రేలియాలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నాలుగేళ్లు పనిచేశాను. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొద్ది నెలల క్రితం పాలేకర్ శిక్షణా శిబిరాల్లో పాల్గొని.. బత్తాయి తోట సాగు చేస్తున్నాను. ఎంత సంపాదిస్తున్నాం అన్నదొకటే కాకుండా.. జాతికి ఎటువంటి ఆహారాన్ని అందిస్తున్నామన్నది ముఖ్యమని గ్రహించాను. పాలేకర్ సేద్య పద్ధతి సులభంగా ఉంది. పదేళ్ల ఉద్యోగంలో పొందలేని సంతృప్తి సేద్యంలో లభించింది.
 - విద్యావాహిని, బండకొత్తపల్లి, గుండాల, నల్లగొండ జిల్లా
 
 సింగపూర్‌కు ఎగుమతి చేస్తా..
 సింగపూర్‌లో శాప్ కన్సల్టెంట్‌గా ఎనిమిదిన్నరేళ్లు పనిచేసి తిరిగి వచ్చేశా. పుష్కలంగా డబ్బు సంపాదన ఉన్నప్పటికీ.. వ్యవసాయం గురించి.. ముఖ్యంగా ప్రకృతి సేద్యం గురించి ఆలోచిస్తుండేవాడిని. స్వదేశం వచ్చాక తొలుత ఉద్యోగం కొనసాగిస్తూనే వారాంతపు విరామంలో ప్రకృతి సేద్యం చేశాను. ఇప్పుడు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో సేద్యంపైనే దృష్టిపెడుతున్నా. మా గ్రామంలో మూడున్నర ఎకరాలలో, ఆదిలాబాద్ జిల్లా అచ్చలపూర్‌లో 22 ఎకరాల్లో సేద్యం ప్రారంభించాం. మునగ, కంది, బూడిదగుమ్మడి, మామిడి పండిస్తున్నాం.  ప్రకృతి ఆహారోత్పత్తుల్ని స్థానికంగా అమ్మడంతోపాటు సింగపూర్‌కు కూడా ఎగుమతి చేయాలనుకుంటున్నాం..
 - ఎం. ప్రదీప్ రెడ్డి, (93955 33000), లక్ష్మీపూర్, రామడుగు, కరీంనగర్ జిల్లా
 
 రెండు రోజులైనా నీరివ్వాలి..
 అమెరికా, భారత్‌లలో 15 ఏళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాక.. రెండేళ్ల క్రితం వచ్చేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, మామిడి, బత్తాయి సాగు ప్రారంభించాను. చిన్న రైతులు ప్రకృతి సేద్యం చేయాలంటే ఆవులను అందుబాటులోకి తేవాలి. మండల స్థాయిలో, పెద్ద గ్రామాల్లో గోశాలలు నెలకొల్పాలి. ప్రభుత్వం బీమా ప్రాజెక్టుకు వారానికి రెండు రోజులైనా నీరిస్తే మా పంటలు నిలుస్తాయి..
 - కె. వెంకట్రామ్ రెడ్డి (95817 49636), కంచిరావు పల్లి, పెబ్బేరు, మహబూబ్‌నగర్ జిల్లా

మరిన్ని వార్తలు