ప్రకృతి సేద్యం.. వర్షానికీ ఇష్టమే!

11 Dec, 2014 00:22 IST|Sakshi
ప్రకృతి సేద్యం.. వర్షానికీ ఇష్టమే!

వర్షం కురిసే అవకాశాలను భూమిలోని జీవనద్రవ్యం (హ్యూమస్) 160% పెంపొందిస్తుంది
తన పరిమాణానికి 4 రెట్లు నీటిని పట్టి ఉంచే గుణం జీవనద్రవ్యానికి ఉంది
 సామూహిక ప్రకృతి సేద్యంతోనే సత్ఫలితాలని అమెరికా పరిశోధన లో వెల్లడి

 
కోరినప్పుడు వాన కురిస్తే... అబ్బో ఆశ... అసలే అడగొద్దంటే  కోరి కొసరు పెట్టమన్నట్లుంది అనుకుంటున్నారా? నిజమే కానీ నేలకు నింగికి ఉన్న సంబంధం తెలుసుకుంటే ఈ చిక్కుముడి వీడిపోతుందంటున్నారు పలువురు ప్రకృతి వ్యవసాయ నిపుణులు. శాస్త్రవేత్తలు ఎందరో ఇదే విషయమై అన్వేషణ సాగిస్తున్నారు. నేలలో ఉన్న జీవనద్రవ్యం(హ్యూమస్) కదిలిపోయే కారు మేఘాలను ఆకర్షించి పిలిచి కురిపిస్తుందంటున్నారు అమెరికాకు చెందిన గ్లేన్ మోరిస్. ‘మన నేలలోని జీవనద్రవ్యం జీవ ప్రపంచ నిలయం. ఇటీవల అమెరికాలో జరిగిన శాస్త్రపరిశోధనలు నేలలోని జీవనద్రవ్యం  వర్షం కురిసే అవకాశాలను 160 శాతం పెంచుతుందని వెల్లడిస్తున్నాయి. వర్షం కురవడానికి అనువైన పరిస్థితిని ఏర్పర్చడానికి ఈ జీవావరణం ఉపయోగపడుతుందని ఆ ఫలితాల సారాంశం’ అంటున్నారు గ్లేన్ మోరీస్.  ఇది ఒక రకంగా కృత్రిమంగా వర్షం కురిపించడమే. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ‘క్లౌడ్ సీడింగ్’.
 
ఇక మోరీస్ విషయానికి వస్తే ఈయన సేంద్రియ పశుమాంస ఉత్పత్తిదారుడు. గత సంవత్సరం అమెరికా ప్రభుత్వం నుంచి భూ సంరక్షణ అవార్డును అందుకున్నవాడు. నేలలోని జీవనద్రవ్యం (హ్యూమస్)- వర్షాన్ని ఆకర్షించే వృక్ష సంబంధ జీవుల మధ్య గల సంబంధంపై స్నాతకోత్తర పరిశోధన కొనసాగిస్తున్నాడు. ఒక దశాబ్దం కిందట ఈయనకున్న భూములు బీడువారి, నెర్రెలు బాసి నోరు తెరిచిన స్థితిలో ఉండేవి. వాతావరణం ప్రతికూలమై జల చక్రం గాడితప్పిన పరిస్థితి. అసలు తేమనేదే లేకుండా భూమి పొడారిపోయింది. నేలలో జీవనద్రవ్యం, సేంద్రియ కర్బనం అడుగంటిపోవడంతో కురిసిన చినుకు తడిని బొత్తిగా నిలుపుకోలేని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇదే విషయమై మోరీస్ పరిశోధన జరిపాడు. జీవనద్రవ్యం, సేంద్రియ పదార్ధాలను పెంపొందించడం వలన భూమిలో ఏ మేరకు నీటిని నిలువరించవచ్చో లెక్కతీశాడు. రెండేళ్ల అనంతరం ఆయన పరిశోధన కొలిక్కొచ్చింది. నేలలో జీవనద్రవ్యం పరిమాణానికి నీటిని పట్టి ఉంచే శక్తి 1:4 పాళ్లలో ఉంటుందని తేల్చాడు. అంటే నేలలో ఒక శాతం జీవనద్రవ్యం పెరిగితే 1,60,000 లీటర్ల నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుందని తేల్చాడు. మోరీస్ ఇంకా ఇలా అన్నాడు: ‘మన గడ్డి బీళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ముఖ్యంగా గడ్డి కోతకు వచ్చే ముందు, తిరిగి విత్తే ముందు విశ్రాంతి అవసరం. గడ్డిభూమి కోల్పోయిన శక్తిని తిరిగి సమీకరించుకొని జీవనద్రవ్యాన్ని పెంపొందించుకుంటుంది. తద్వారా నేల పునరుజ్జీవన చర్యలు చేపట్టవచ్చు. దీనితో కొంతమార్పు వస్తుంది. అయితే చుట్టుపక్కల రైతులందరూ ఇదే విధానం కొనసాగిస్తే ఆ ప్రాంతంలో సహజ ‘క్లౌడ్ సీడింగ్’కు బీజాలు వేసినట్లే’.

సిడ్నీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ లచ్లాన్ ఇంగ్రామ్ స్పందిస్తూ.. ‘నేలలో ఉన్న సేంద్రియ పదార్థం నిల్వలకు నీటిని పట్టి ఉంచే శక్తికి మధ్య బలమైన సంబంధం ఉంది. నేలలో ఉన్న జీవన ద్రవ్యం సూక్ష్మనీటి బిందువుల సమూహాన్ని విడుదల చేస్తుంది. అవి మేఘాలను ఆకర్షిస్తాయి. వర్షం కురవడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయనే విషయంలో సందేహం లేదు. ఒక క్షేత్రంలో ఇవి విడుదలయినా గాలి ప్రభావంతో అవి సుదూర ప్రాంతానికి కొట్టుకుపోయి అక్కడ వర్షం కురవడానికి కారణం కావచ్చు’ అని వివరించారు. ప్రకృతి సేద్య విధానం అవలంబించడం ద్వారా గతి తప్పిన రుతుచక్రాన్ని సరిదిద్దగలుగుతుందనేది ఈ పరిశోధన వెల్లడించిన నిర్ధారిత నిజం.  అందుకే  ప్రకృతి వ్యవసాయమే  నేటి ఆచరణీయ కార్యాచరణ. భూగోళం అమితంగా వేడెక్కడానికి  కాయకల్ప చికిత్స అనేది కాదనలేని సత్యం.
 
 - జిట్టా బాల్‌రెడ్డి
 
 

మరిన్ని వార్తలు