ఇప్పుడు మొక్కల సాంద్రత పెంచాలి

25 Jul, 2014 00:11 IST|Sakshi
ఇప్పుడు మొక్కల సాంద్రత పెంచాలి

పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేసే పప్పు జాతి పంటల్లో కంది ముఖ్యమైనది. అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కంది సాగుపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ కో-ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ) డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సంప్రదించవచ్చు) అందిస్తున్న సూచనలు...
 
 ఎప్పుడు-ఎలా వేయాలి?
 కందిని తొలకరిలో జూన్, జూలై నెలల్లో విత్తుకోవాలి. అయితే వర్షాలు ఆలస్యంగా కురిస్తే ఆగస్టులో కూడా విత్తనాలు వేసుకోవచ్చు. అప్పుడు వరుసల మధ్య దూరాన్ని తగ్గించుకొని, మొక్కల సాంద్రత పెంచాలి. కంది సాగుకు మురుగు నీటి పారుదల సౌకర్యం కలిగిన నేలలు అనువుగా ఉంటాయి. ఖరీఫ్‌లో వేసుకునేందుకు ఎల్‌ఆర్‌జీ-41, 30, 38, ఐసీపీయల్-85063 (లక్ష్మి), 332 (అభయ), 87119 (ఆశ), 84031 (దుర్గ), డబ్ల్యూఆర్‌జీ-27 రకాలు అనువైనవి.
 
 కందిని నాగలి వెంబడి లేదా సాళ్లలో గొర్రుతో విత్తుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో వరుసల మధ్య 150/180 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. ఎర్ర నేలల్లో వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు వేయడానికి ముందు ఎకరానికి 3 కిలోల విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. విత్తిన 24 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1-1.25 లీటర్ల పెండిమిధాలిన్ కలిపి పిచికారీ చేసుకుంటే ప్రధాన పంటలో, అంతరపంటలో నెల రోజుల వరకూ కలుపు సమస్య ఉండదు. పైరు 100 రోజుల దశకు చేరుకునే లోపు మొక్కల పైన ఉండే కొమ్మలను తుంచితే పక్క కొమ్మలు విస్తారంగా వస్తాయి. దిగుబడులు బాగుంటాయి.
 
 పోటీ పడకూడదు
 కందితో పోటీపడే స్వభావమున్న పైరును అంతరపంటగా ఎంచుకోకూడదు. కంది వేర్లు భూమి లోపలికి వెళతాయి. కాబట్టి వేర్లు తక్కువ లోతు వెళ్లే పైరును అంతరపంటగా వేసుకోవాలి. కందిలో జొన్న, మొక్కజొన్న (ఆహార ధాన్యపు పంటలు), పెసర, మినుము, సోయాచిక్కుడు (పప్పు ధాన్యపు పంటలు), వేరుశనగ (నూనె గింజల పంట), రాగి, సజ్జ, కొర్ర (చిరు ధాన్యపు పంటలు) పైర్లను అంతరపంటగా వేసుకోవచ్చు. కందిలో పెసర, మినుము, వేరుశనగను 1:7 నిష్పత్తిలోనూ, చిరు ధాన్యపు పంటలను 1:8 నిష్పత్తిలోనూ వేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట మొక్కజొన్న, గోరుచిక్కుడు వంటి పంటలను కందిలో 1:2 నిష్పత్తిలో వేయాలి.
 
 కంది పైరు 100 రోజుల వరకూ నిదానంగా పెరుగుతుంది. మనం వేసే అంతరపంట 110 రోజుల లోపే చేతికి వస్తుంది. కాబట్టి అది కంది పంటకు ఏ విధమైన పోటీ కాదు. కంది కొమ్మలు 100 రోజుల వరకూ పక్కకు వ్యాపించవు కనుక అంతరపంటకు గాలి, వెలుతురు బాగా తగిలి మంచి దిగుబడి వస్తుంది. అంతరపంటను కోయగానే గొర్రు/గుంటకతో ఒకసారి కంది వరుసల మధ్య అంతరకృషి చేయాలి. దీనివల్ల అంతరపంట ఆకులు భూమిలో కలిసి, పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా పంట చేలో ఏర్పడిన పగుళ్లు కలిసిపోతాయి. కంది పైరు బెట్టకు గురికాదు. కలుపు మొక్కల బెడద కూడా తగ్గుతుంది.
 
 ఎరువుల యాజమాన్యం
కంది పైరుకు చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల భాస్వరాన్ని అందించే ఎరువు వేయాలి. ఎనిమిది కిలోల నత్రజనిని అందించే ఎరువును 3 సమాన భాగాలుగా చేసుకొని దుక్కిలో, పైరు 100 రోజుల దశలో, 140 రోజుల దశలో ఉన్నప్పుడు వేయాలి.భూమిలో తేమ ఉన్నప్పుడు రసాయన ఎరువులు వేసుకుంటే మొక్కలకు పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో అందుతాయి. అంతరపంట వేసినప్పుడు పైరును బట్టి ఎరువుల మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు, అంతరపంటకు వేర్వేరుగా ఎరువులు వేసుకోవాలి.
 
దిగుబడులు ఎందుకు తగ్గుతున్నాయి?
 కంది దీర్ఘకాలిక పంట. కాబట్టి పూత, కాయ దశల్లో ఈ పైరులో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మరుకా మచ్చల పురుగు, ఎండు తెగులు, వెర్రి తెగులు వంటి చీడపీడలు దాడి చేస్తాయి. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. మొక్కలు సరైన సాంద్రతలో లేకపోయినా దిగుబడులు తగ్గుతాయి. అలాగే సకాలంలో, సరైన మోతాదులో ఎరువులు వేయకపోవడం వల్ల దిగుబడులు దెబ్బతింటాయి. చాలా మంది రైతులు కందిని సహ పంటగా, మిశ్రమ పంటగా వేస్తుంటారు. అయితే ప్రధాన పంటను కోసిన తర్వాత కందిని అశ్రద్ధ చేస్తుంటారు. దీనివల్ల దిగుబడులు ఆశించిన మేరకు లభించవు. పైరు చివరి దశలో బెట్టకు గురైనప్పుడు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు