భూమికి బలం.. పోషకాల యాజమాన్యం

22 Nov, 2014 03:38 IST|Sakshi

 జొన్న
 పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలయదున్నాలి.
 రబీలో సాగు చేసే జొన్నకు ఎకరానికి 32-40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి.
 నత్రజని ఎరువును రెండు సమభాగాలుగా అంటే విత్తేటప్పుడు , మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి.
 సిఫారసు చేసిన భాస్వరపు , పొటాష్ పూర్తి మోతాదును విత్తే సమయంలో వేయాలి.
 
మొక్కజొన్న
 నీటి పారుదల కింద సాగు చేసి మొక్కజొన్నకు ఎకరానికి 80-100 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వేయాలి.
 నత్రజనిని 4 సమ దఫాలుగా విభజించి వేయాలి.
 మొదటి దఫాను విత్తేటప్పుడు, రెండవ దఫాను విత్తిన 25-30 రోజులకు, మూడవ దఫాను 45-50 రోజులకు, నాలుగవ దఫాను 60-65 రోజుల మధ్య వేయాలి.
 సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలోనే వేయాలి.
 సిఫారసు చేసిన పొటాష్  ఎరువును రెండు దఫాలుగా వేసుకోవాలి. సగభాగం విత్తే సమయంలోను, మిగిలిన సగభాగాన్ని  విత్తిన నెలరోజులకు వేయాలి.
 భూమిలో జింక్ లోపముంటే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటును మూడు పంటలకు ఒకసారి వేయాలి.
 అదే జింకు లోప లక్షణాలు పంటపై కనిపించినట్లయితే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని(లీటరు నీటికి 2 గ్రా జింక్ సల్ఫేట్ ) వారానికి ఒకసారి చొప్పున 2,3 సార్లు పంటపై పిచికారి చేయాలి.
 
శనగ
 శనగ సాగులో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం , 16 కిలోల గంథకాన్ని ఇచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి.
 
పెసర
 పెసర సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేసి దుక్కిలో బాగా కలియదున్నాలి. తర్వాత విత్తనం వేసే ముందు దుక్కిలో ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి.
 వరి మాగాణుల్లో పెసర సాగు చేసేటప్పుడు ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
 
మినుము
 మినుము సాగులో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. విత్తటానికి ముందు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేసి గొల్లతో కలియదున్నాలి.
 వరి మాగాణుల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడనవసరం లేదు.
 
పొద్దుతిరుగుడు
 పొద్దుతిరుగుడు సాగులో ఎకరానికి 3 టన్నుల పశువుల ఎరువును విత్తటానికి 2-3 వారాల ముందు వేసుకోవాలి
 
నీటి పారుదల కింద హైబ్రిడ్‌లను సాగు చేసినట్లయితే ఎకరానికి నల్లరేగడి నేలల్లో 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌లను ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.
 నత్రజనిని 3 దఫాలుగా విభజించి వేయాలి. వేయాల్సిన నత్రజని మోతాదులో సగభాగాన్ని మొదటి దఫా గా విత్తేటప్పుడు, నాలుగో వంతును రెండవ దఫాగా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో.. మిగి లిన నాలుగో వంతును మూడవ దఫాగా విత్తిన 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో వేసుకోవాలి.
 సిఫారసు చేసిన భాస్వరపు, పొటాష్ పూర్తి మోతాదులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి.
 సూక్ష్మ పోషకాలలో పొద్దుతిరుగుడు సాగుకు బొరాన్ అత్యంత ఆవశ్యకమైనది.

 పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకొన్నప్పుడు 0.2 శాతం బొరాక్స్( లీటరు నీటికి 2 గ్రా బొరాక్స్)  మందు ద్రావణాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేసినట్లయితే గింజలు ఎక్కువగా తయారై, దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. లేదా ఆఖరి దుక్కలో ఎకరానికి  8 కిలోల బొరెక్ ఆమ్లాన్ని వేసుకోవాలి.
 గంధకం లోపించిన నేలల్లో ఎకరానికి 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే గింజలో నూనె శాతం పెరగడమే కాక అధిక దిగుబడులను సాధించవచ్చు( ఎకరానికి 55 కిలోల జిప్సం)

Read latest Vanta-panta News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు