సేంద్రియ సర్టిఫికేషన్ అవసరమా?

4 Feb, 2015 23:20 IST|Sakshi
సేంద్రియ సర్టిఫికేషన్ అవసరమా?

సేంద్రియ/ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రైతులంతా ఇవి సేంద్రియ పద్ధతుల్లో పండించినవేనన్న సర్టిఫికెట్ పొందితే బావుంటుందని కొందరు అంటున్నారు. అయితే, సేంద్రియ ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండటానికి కారణం ఈ సర్టిఫికేషన్ ప్రక్రియేనని.. అధిక శాతం చిన్న, సన్నకారు రైతులున్న మన దేశంలో ఇది అసాధ్యమని అంటున్నారు సరస్వతి కవుల.
 
సేంద్రియ పద్ధతుల్లో నేను పండించిన కూరగాయలను ఈ మధ్య  హైదరాబాద్‌లో ఒక సేంద్రియ సంతకు తీసుకెళ్లి అమ్మాను. కొంతమంది ఇవి నిజంగానే రసాయనాలు లేనివా? అని అడిగారు. ఎక్కడ పండించారు? ఎలా పండించారు? వంటి వివరాలు కనుక్కొని, కొన్నారు. ఒకాయన ఇవి నిజంగానే సేంద్రియ కూరలు.. ఎందుకంటే, మందులు వేసినవి చాలా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇవి కొంచెం డల్‌గా ఉన్నాయి. ఇవి కచ్చితంగా సేంద్రియమే అన్నారు. ఒకావిడ వంకాయలు కొంటూ ఇందులో పుచ్చులు చూస్తే ఆనందం వేస్తుంది. అక్కడక్కడా పుచ్చు వంకాయలున్నాయంటే కచ్చితంగా ఇవి మందులు లేకుండా పండించినవే అన్నారు. మా అంగడికి వచ్చినావిడ ఒకరు టమాటా నోట్లో వేసుకొని.. ‘ఇది ఒరిజినలే, రుచి చూస్తే తెలుస్తోంది’ అన్నారు.

సేంద్రియ పంటో కాదో తెలుసుకునేదెలా?

 ఈ మధ్య అనేక నగరాల్లో వినియోగదారులు సేంద్రియ పంటలను హెచ్చు ధరకైనా సరే కొంటున్నారు. కానీ, వారు కొనేవి నిజంగా సేంద్రియ పంటలా? కాదా? అని ఎలా తెలుసుకోవటం అనేది చర్చకి వస్తోంది. కొంతమంది సర్టిఫికేషన్ ఉంటే మంచిది, వినియోగదారులకు నిఖార్సయిన సేంద్రియ ఉత్పత్తులు కొంటున్నామన్న నమ్మకం కలుగుతుంది అంటున్నారు. కానీ, సర్టిఫికేషన్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని. అంతర్జాతీయంగా కూడా సేంద్రియ ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉండటానికి కారణం ఈ అంతర్జాతీయ సర్టిఫికేషన్ ప్రక్రియే. అయితే అధిక శాతం చిన్న, సన్నకారు రైతులున్న మన దేశంలో ఇది సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకొందరు పీజీఎస్(పీర్ గ్యారంటీ స్కీమ్) మంచిది అంటున్నారు. కొంతమంది రైతులు ఒక సంఘంగా ఏర్పడి ఒకరికొకరు సర్టిఫై చేసుకోవటం అన్నమాట. అయితే, ఇది ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ల మధ్య ఉండే సంబంధాలను బట్టి, నిబద్ధతను బట్టి, విలువలను బట్టి ఉంటుంది.  ఒక వేళ గ్రూప్‌లో వారికి గొడవలు వస్తే మరి సర్టిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగుతుందా? కొన్ని చోట్ల బాగానే చేస్తున్నారు. కానీ, నిజంగా రైతు పొలంలోకి వెళ్లి చూసి, అన్ని వేళలా నిఘా పెట్టాలంటే సాధ్యపడదు. పీజీఎస్ పద్ధతిని చాలా మటుకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉన్న రైతు సంఘాలు, మహిళా సంఘాలు పాటిస్తున్నాయి. కానీ అన్నిచోట్లా ఈ పద్ధతిని పాటించడం కుదరకపోవచ్చు.

సర్టిఫికెట్ నిజాయితీగా ఇస్తారా?

ఇక ఈ మధ్య ఇంకో ప్రతిపాదన వచ్చింది.. ప్రభుత్వం వారే సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు. కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే తీరు మనకు తెలియనిదేముంది? లంచం ఇస్తే ఏ పనైనా సాధ్యపడే మన వ్యవస్థలో నిక్కచ్చిగా, నిజాయితీగా సర్టిఫికెట్ ఇస్తారని ఎలా నమ్మగలం? లంచమివ్వనని మొండికేసే వారికి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగటమే అవుతుంది తప్ప సర్టిఫికెట్ వస్తుందా? ఇది కూడా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వారికి ఒక ఆదాయ వనరు అవుతుంది తప్ప నిజంగా వినియోగదారులకు మంచి జరుగుతుందా? అన్నది అనుమానమే. సేంద్రియ పంటల్లో జన్యుమార్పిడి విత్తనాలు వాడకూడదు. మరి మన ప్రభుత్వాలు మాత్రం జన్యుమార్పిడి ఆహార పంటలు తీసుకువస్తున్నాయి. రైతులు నష్టపోతున్నా సరే, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వచ్చినా సరే, సుప్రీంకోర్టు చెప్పినా సరే జన్యుమార్పిడి ఆహార పంటలను అనుమతిస్తున్న మన ప్రభుత్వాలు నిజంగా ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తాయా?

విలువలతో కూడిన సంబంధం..

అంతెందుకు, అమెరికాలోనే జన్యుమార్పిడి ఆహార ప్యాకెట్లపైన జన్యుమార్పిడి ఆహారం అని లేబుల్ వెయ్యాలని డిమాండ్ చేసి, మేం తినే ఆహారం విషతుల్యమా? కాదా? తెలుసుకునే హక్కు మాకు కావాలి అని అక్కడి ప్రజలు ఉద్యమాలు చేసినా సరే.. అక్కడి ప్రభుత్వం వినిపించుకోవటం లేదు. కానీ రైతులకు మాత్రం సేంద్రియ సర్టిఫికేషన్ కావాలి అని నియమాలు పెట్టారు. అక్కడి మియామీ నగరంలో ఒక సేంద్రియ రైతుల బజార్లో కొందరు రైతులతో మాట్లాడినప్పుడు ‘మీరు సర్టిఫికెట్ తీసుకున్నారా?’ అని అడిగాను. దానికాయన.. ‘లేదు. మేమిక్కడకి ప్రతి వారం వస్తాం. మా దగ్గర ఒకసారి కొన్న వినియోగదారులు మళ్లీ మళ్లీ మా దగ్గరికే వచ్చి కొంటారు. అది వారికి మా మీదున్న నమ్మకం’ అన్నారు. అక్కడే ఉన్న  వినియోగదారుడొకాయన అన్నారు. ఒకసారి రుచి చూస్తే తెలుస్తుంది, అది సేంద్రియ పంట అవునా? కాదా? అనేది! ఇది రైతులకు, వినియోగదారులకు మధ్య ఉన్న విలువలతో కూడిన సంబంధం. దీన్ని మించి ఏం సర్టిఫికెట్ కావాలి?

(వ్యాసకర్త సేంద్రియ రైతు. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి గ్రామం. మొబైల్: 98497 18364)
 
 

మరిన్ని వార్తలు