ఇంటిపట్టునే సేంద్రియ కూరగాయలు, చేపల సాగు!

19 Sep, 2016 23:35 IST|Sakshi
ఇంటిపట్టునే సేంద్రియ కూరగాయలు, చేపల సాగు!

- చేపల విసర్జితాలతో కూడిన నీటితోనే పంటల సాగు
- మట్టి లేకుండా బేబీ చిప్స్‌లో పంటల సాగు
 
 గుప్పెడు మట్టి లేకుండా.. చిటికెడు ఎరువు వే యకుండా, పురుగు మందులను పిచికారీ చేయకుండా ఒకేచోట.. సేంద్రియ పద్ధతుల్లో అటు చేపలు, ఇటు ఆకుకూరలు, కూరగాయలను పండించడాన్ని ‘ఆక్వాపోనిక్స్’ అంటారు. ట్యాంకులో చేపలు, పక్కనే కుండీల్లో కూరగాయ పంటలు పండిస్తూ.. చేపల విసర్జితాలతో కూడిన పోషక జలాన్ని కుండీల్లో మొక్కలకు అందిస్తే.. వేరే ఎరువులు అవసరం లేకుండానే పంటలూ పండుతాయి. ఇదే ఆక్వాపోనిక్స్ పద్ధతి. ఈ పద్ధతిలో ఇంటిపట్టునే సేంద్రియ చేపలు, సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తున్నాడో వికలాంగ యువకుడు..

 అందె జాన్ రాబర్ట్‌సన్ పోలియో బాధితుడు. చిన్నతనంలోనే పోలియోసోకి  ఎడమకాలు చచ్బుబడినా చేతి కర్రలే ఊతంగా నడవడమే కాకుండా.. ఆత్మవిశ్వాసంతో ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సేంద్రియ ఇంటిపంటలు పండిస్తున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం ఆయన స్వగ్రామం. రాబర్ట్‌సన్ 2014 నవంబర్‌లో ఆక్వాపోనిక్స్ సాగుకు శ్రీకారం చుట్టారు.

 తొలుత 5 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు గల ప్లాస్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసి నీటితో నింపారు. అందులో తిలాపియా, జలలు, మట్టగుడిసె, చేదుపక్కెలు వంటి 150 చేపపిల్లలను ఈ ట్యాంక్‌లో వదిలారు. వీటి విసర్జితాల ద్వారా ట్యాంకులో నీరు పోషక జలంగా మారుతుంది. ఈ నీటిని మోటార్ ద్వారా నిలువుగా సగానికి కోసిన ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సాగవుతున్న కూరగాయలు, పండ్ల మొక్కలకు అందిస్తున్నారు. చేపల విసర్జితాల ద్వారా విడుదలైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలతోనే ఈ పంటలు పండుతున్నాయి.

 మట్టికి బదులు బేబీ చిప్స్..
 ఈ విధానంలో ఇంటిపంటల సాగులో మట్టిని వాడరు. మొక్కల పెంపకానికి 250 లీటర్ల నీరుపట్టే ప్లాస్టిక్ డ్రమ్ములను వాడుతున్నారు. ఒక్కో డ్రమ్మును నిలువుగా రెండు చీలికలు చేసి.. క్రషర్ నుంచి తెచ్చిన సన్న కంకర (బేబీ చిప్స్)తో నింపారు. కంకరలో రెండు అంగుళాల లోతులో నారు లేదా విత్తనాలు నాటుతారు. చేపల ట్యాంక్ నుంచి మొక్కలకు నీటిని అందించేందుకు ప్లాస్టిక్ పైపులను అమర్చారు. నీరు మొక్కలను పెంచే డబ్బాల్లోకి వచ్చేందుకు, తిరిగి చేపల తొట్టెలోకి వెళ్లేందుకు ప్లాస్టిక్ పైపులను అమర్చారు. ఇంటిపంటలకు వీటి ద్వారా రోజూ 10 గంటల పాటు పోషక జలం నిరంతరాయంగా సరఫరా అవుతుంది. నీటిని సరఫరా చేసేందుకు మోటార్‌ను, విద్యుత్ కోసం సౌరఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆక్వాపోనిక్స్ సాగు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ. 2 లక్షల ఖర్చయిందని, తన సోదరుడు, స్నేహితుల తోడ్పాటుతో ఏర్పాటు చేశానని రాబర్ట్‌సన్ తెలిపారు.

 కుటుంబానికి సరిపడా కూరగాయలు, చేపల సాగు
 గోంగూర, తోటకూర, పుదీనా వంటి ఆకుకూరలను, బీర, సొర, కాక ర, బెండ, వంగ వంటి కాయగూరలను, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను రాబర్ట్‌సన్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. చేపలను తమ ఇంటి అవసరాలకు విడతకు పట్టుబడి చేస్తారు. ఏడాదిన్నరలో విడతకు 15 కిలోల చొప్పున 5 సార్లు చేపల దిగుబడి వచ్చింది. ప్రతి రెండు నెలలకోసారి చేపల తొట్టెను ఖాళీ చేసి, కొత్త నీటితో నింపుతారు. చేపలకు, మొక్కలకు ప్రత్యేకంగా ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడాల్సిన అవసరం లేదని రాబర్ట్‌సన్ చెబుతున్నాడు.  

 ఎలాంటి రసాయనాలు వేయకుండా పండిస్తున్న ఉత్పత్తులు కావటంతో తమకూ కావాలని కొందరు అడుగుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే.. దీన్ని మరింత విస్తరించి ఉపాధి మార్గంగా మార్చుకుంటానని రాబర్ట్‌సన్ (99497 19220) అంటున్నారు. వినూత్నమైన స్వయం ఉపాధి మార్గాన్ని ఎంపిక చేసుకున్న రాబర్ట్‌సన్‌కు జేజేలు!
 - గుర్నాధం, సాక్షి, చీరాల టౌన్, ప్రకాశం జిల్లా

మరిన్ని వార్తలు