ఆకుపచ్చని బంగారం మన మాగాణం!

9 Oct, 2014 01:19 IST|Sakshi
ఆకుపచ్చని బంగారం మన మాగాణం!

* వరి సాగుతో పర్యావరణానికి కీడు లేదు.. మేలే!
* భూతాపోన్నతికి దోహదపడే కర్బన ఉద్గారాలను పీల్చుకుంటున్న మాగాణి భూములు
* సీఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైన వాస్తవం

 
 అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. మన దేశంలోనే కాదు.. దక్షిణాసియా దేశాల ప్రజలకు వరి అన్నమే అత్యంత ముఖ్యమైన ఆహారం. మనకు ఇంత ముఖ్యమైన వరి పంటను  80% మేరకు నీటిని నిల్వగట్టే పద్ధతిలో, 20% విస్తీర్ణంలో ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల పర్యావరణానికి తీరని హాని కలుగుతున్నదన్న నింద ఎప్పటి నుంచో ఉంది. మనిషి చేసే పనుల వల్ల అత్యంత ప్రమాదకరమైన మిథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలవుతున్నది. ఇది 11% మేరకు చైనా, భారత్ తదితర దేశాల్లో వరి పొలాల నుంచే వెలువడుతోందని చెబుతున్నారు. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చల్లో ఇది తరచూ ప్రస్తావనకొస్తుంటుంది. వరి పొలాల వల్ల జరుగుతున్నదని భావిస్తున్న పర్యావరణ నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనన్న డిమాండ్ ముందుకొస్తున్నది. అయితే, తాజా పరిశోధన తేల్చిందేమంటే.. వరి పొలాల వల్ల పర్యావరణానికి జరుగుతున్నది హాని కాదు.. మేలని! సంప్రదాయ వరి పొలాలు వాతావరణంలోని కర్బన ఉద్గారాలను పీల్చుకుంటూ కాలుష్యాన్ని, భూతాపాన్ని తగ్గిస్తున్నాయని ఈ పరిశోధన తేల్చింది.
 
 పచ్చని తివాచీలా విస్తారంగా పరచుకున్న వరి మాగాణులు భూతాపాన్ని పెంచకపోగా.. తగ్గించేందుకు దోహదపడు తున్నాయని తేల్చిన ఈ అపూర్వ పరిశోధనకు కటక్ (ఒడిశా)లోని ప్రతిష్టాత్మక కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ(సీఆర్‌ఆర్‌ఐ) వేదికైంది. దేశంలోనే అతిముఖ్యమైన వరి పరిశోధనా సంస్థ సీఆర్‌ఆర్‌ఐ. 2009 అక్టోబర్ నుంచి అక్కడి శాస్త్రవేత్తలు ఈ పరిశోధనపై దృష్టి పెట్టారు. రెండున్నర ఎకరాల మాగాణి పొలం చుట్టూ పకడ్బందీగా ఇనుప తీగల కంచె వేసి.. నడి మధ్యన ఒక యంత్ర పరికరాన్ని ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యమైన ఆహార పంటయిన వరిని మడుల్లో నీటిని నిల్వగట్టి సాగు చేయడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న కీడేమిటో, మేలేమిటో కొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి ఈ విశేష పరిశోధన ఎంతగానో దోహదపడుతోంది.
 
  ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మన్నన పొందిన  అధునాతన ఎడ్డీ కొవారియన్స్(ఈసీ) సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి ఈ పరిశోధన జరిపారు. నేల - వాతావరణం మధ్య వివిధ పర్యావరణ వ్యవస్థల్లో బొగ్గుపులుసు వాయువు, నీటి ఆవిరి, మిథేన్, అనేక ఇతర వాయువుల మార్పిడి తీరు ఎలా ఉందో కచ్చితంగా లెక్కగట్టడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా ఈసీ వ్యవస్థపైనే ఆధారపడుతున్నారు. సీఆర్‌ఆర్‌ఐలో సీనియర్ క్రాప్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రతాప్ భట్టాచార్య కూడా ఈసీ టెక్నిక్‌నే ఉపయోగించారు. వరి పొలాల వల్ల భూతాపం పెరిగిపోతోందనడం శుద్ధ తప్పని, నిజానికి వరి పొలాలు కర్బన ఉద్గారాలను పీల్చుకొని భూతాపాన్ని తగ్గిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. 2012-13 సంవత్సరంలో ఏడాది పొడవునా డా. ప్రతాప్ భట్టాచార్య, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఏకే నాయక్‌లతో కూడిన బృందం పూర్తిస్థాయి పరిశోధన చేసింది.
 
  నీటిని నిల్వగట్టి వరి సాగైన మాగాణి భూముల్లో బొగ్గుపులుసు వాయువు(సీవో2), మిథేన్(సీహెచ్4)ల నిల్వలు తగ్గుతున్నట్లు వారు గుర్తించారు. ఈ పొలాల్లో నేలకు భూతాపోన్నతికి దోహదపడుతున్న ఈ రెండు వాయువులను భూస్థాపితం చేస్తూ, భూ ఉపరితల వాతావరణం అమితంగా వేడెక్కకుండా అడ్డుకుంటున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. హెక్టారు(సుమారు రెండున్నర ఎకరాల) మాగాణి భూమి వర్షాకాలంలో 910 కిలోలు, ఇతర కాలాల్లో 590 కిలోల కర్బనాన్ని వాతావరణం నుంచి పీల్చుకుంటున్నదని ఈ బృందం గుర్తించింది. అయితే, ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు చెందిన డా. రీనర్ వాస్‌మన్ విభేది స్తున్నారు. డా. భట్టాచార్య బృందం మిథేన్‌ను పట్టించుకోలేదన్నారు. డా. భట్టాచార్య స్పందిస్తూ, (మిథేన్ సహా) కర్బనాన్ని మాగాణి భూములు పీల్చుకుంటున్నాయని గుర్తించామని.. విడిగా మిథేన్‌ను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.            
 - లతా జిష్ణు (‘డౌన్ టు ఎర్త్’ సౌజన్యంతో..)
 
 మాగాణులతో మేలు..
 వరి మాగాణుల నుంచి వెలువడే ఉద్గారాల కంటే అవి వాతావరణంలో నుంచి పీల్చుకుంటున్నవే ఎక్కువన్న నిర్ణయానికొచ్చాం. ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం. మాగాణులు సాధారణంగా కోస్తా తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. వరి కుంటలకు చుట్టూ 50 నుంచి 100 సెం.మీ.ల ఎత్తున కట్టలు వేస్తుంటారు. ఈ కుంటల్లో వరిసాగు చేస్తూ ఎక్కువ రోజులు నీటిని నిల్వగట్టడం వల్ల నీటి సంరక్షణ జరిగి భూగర్భ జలమట్టం పెరుగుతోంది. కోస్తా ప్రాంతాల్లో భూగర్భంలోకి సముద్రపు నీరు చొచ్చుకురావడాన్ని కూడా ఇవి అడ్డుకుంటున్నాయి.  పర్యావరణం, పంటల సాగు వ్యవస్థల ప్రాతిపదికన కర్బన ఉద్గారాలపై జాతీయస్థాయి డేటాబ్యాంక్‌ను రూపొందించడం మన దేశానికి ఉపయుక్తంగా ఉంటుంది.
 - డా. ప్రతాప్ భట్టాచార్య,
 కేంద్రీయ వరి పరిశోధనా సంస్థ, కటక్, ఒడిశా

మరిన్ని వార్తలు