పంటల వైవిధ్యమే ప్రాణదాయిని!

9 Feb, 2016 01:11 IST|Sakshi
పంటల వైవిధ్యమే ప్రాణదాయిని!

- డా. వందనా శివతో ఇష్టాగోష్టి
భూమి పైన పంటల వైవిధ్యం.. భూమి లోపల వానపాములు, సూక్ష్మజీవరాశిని పెంపొందింప జేసుకునే సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారానే కరువు కాటకాలను దీటుగా తట్టుకొని నిలిచే జీవశక్తి, భద్రత ఇటు పంటలకు, అటు సమాజానికి సమకూరుతాయని ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, దేశీ విత్తనోద్యమ నేత డాక్టర్ వందనా శివ స్పష్టం చేశారు. కార్పొరేట్ సామ్రాజ్యవాదం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో రూపు దిద్దుకునే వ్యవసాయక ప్రత్యామ్నాయ పద్ధతులే ఆరోగ్యవంతమైన సమాజాలకు కేంద్రబిందువులుగా మారతాయన్నారు.

హైదరాబాద్‌లో ఈ నెల 5-7 తేదీల్లో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ అధ్యక్షుడు కొప్పుల నరసన్న నిర్వహించిన శాశ్వత వ్యవసాయం(పర్మాకల్చర్)పై జాతీయ సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ సాగుబడికి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు మీ కోసం.

 
* సిక్కిం పూర్తి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా మారింది. మొత్తం ఈ ప్రక్రియలో లో మీ ‘నవధాన్య’ సంస్థ నిర్వహించిన పాత్ర ఏమిటి?
మేం 20 ఏళ్లుగా సిక్కింలో పనిచేస్తున్నాం. ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆహారం పండించడంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం..
     
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతాంగం వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి ఎటువంటి వ్యవసాయ నమూనాను మీరు సూచిస్తారు..?
తెలంగాణ కరువు పీడిత ప్రాంతం. కాబట్టి, కరువును తట్టుకోవడమే ముఖ్యం. అందుకు అనువైన పద్ధతి జీవవైవిధ్య పరిరక్షణే..! భూమిపైన జీవవైవిధ్యాన్ని, భూమి లోపల జీవవైవిధ్యాన్ని పునరుజ్జీవింప జేయడం ద్వారా వ్యవసాయాన్ని కరువు నుంచి కాపాడుకోవాలి. దీని అర్థం ఏమిటంటే.. ఒకే పొలంలో అనేక పంటలను కలిపి పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించడం ద్వారా భూమి పైన జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి.

అదేవిధంగా, నేలలో వానపాములు, సూక్ష్మజీవులను పెంపొందించే సేద్య పద్ధతులను పాటించడం ద్వారా భూమి లోపల జీవవైవిధ్యాన్ని పెంపొందించుకోవాలి. భూమిలో జీవవైవిధ్యం బాగుంటే సేంద్రియ పదార్థం బాగుంటుంది. పొలంలో నేల ఎండబారిన పడకుండా పూర్తిగా కప్పి ఉంచేందుకు తగిన పంటలు సాగు చేయాలి. తద్వారా భూమిలో తేమను పెంపొందించుకోవాలి. ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయం గానీ, శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) పద్ధతులు గానీ చెబుతున్నదీ ఇదే. 0.5 శాతం సేంద్రియ పదార్థంతో హెక్టారుకు 80 వేల లీటర్ల నీటి తేమను వాతావరణం నుంచి పొదివి పట్టుకోవచ్చు. కరువును అధిగమించడానికి ఇది ఉపకరిస్తుంది. పంట భూములు నిర్జీవమై వైఫల్యం వైపు నెడుతూ ఉన్నప్పుడు.. కేవలం ఆర్థికపరమైన బీమా కల్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు.
     
* కరువు నుంచి కాపాడటానికి అత్యాధునిక సాంకేతికతతో కూడిన బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇదికూడా రైతులను కాపాడలేదంటారా?
లేదు. ఎందుకంటే ఈ పథాకాన్ని అమెరికాలో రూపొందించి, వాషింగ్టన్‌లో రాయబార కార్యాలయం ద్వారా ఢిల్లీకి పంపారు. మోన్‌శాంటో వంటి బహుళజాతి కంపెనీలు న్యూ డేటా మేనేజ్‌మెంట్ అవతారం ఎత్తబోతున్నాయి. మన భూములకు సంబంధించిన సమాచారం మనకన్నా ముందు వాళ్లకు తెలుస్తుంది. వ్యవసాయిక యంత్రాల్లో పైకి తెలియకుండా నిఘా పరికరాలను అమర్చి మన పంట భూముల సమాచారాన్ని కంపెనీలు కొల్లగొట్టబోతున్నాయి. మన దగ్గర నుంచి సేకరించిన ఆ సమాచారాన్నే తిరిగి మనకే అమ్మి సొమ్ము చేసుకుంటారు.

మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై పరిపూర్ణమైన నియంత్రణ కోసం.. రైతులను వెర్రిబాగుల వాళ్లుగా చిత్రీకరించి వారి జ్ఞానాన్ని, నిర్ణయాధికారాన్ని, స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని గంపగుత్తగా హరించేందుకు బహుళజాతి కంపెనీలు చేస్తున్న బ్రహ్మప్రయత్నంలో భాగమే ఇదంతా. భూముల గణాంకాలను, వాతావరణ సమాచారాన్ని సేకరించే అతి పెద్ద సంస్థలు మోన్‌శాంటో చేతుల్లో ఉన్నాయి. రసాయనిక కంపెనీలు విత్తనాలను చేజిక్కించుకున్నాయి. ఇప్పుడు సమస్త సమాచారాన్నీ నియంత్రించేందుకు ఉపక్రమిస్తున్నాయి. అయితే, గతంలో కూడా బీమా పథకాలు రైతులకు కొరగాకుండా పోవడం తెలియందేమీ కాదు. విషాదకరమేమిటంటే.. కరువు నుంచి రైతులను రక్షించడానికని చెబుతూ అంటగడుతున్న కొత్త బీమా పథకం.. నిజానికి వారిని అసలైన బీమా నుంచి దూరం చేస్తుంది..
     
* ఎలా? రైతులకు ఉపకరించే అసలైన బీమా ఏది..?
కరువు కాటకాలను తట్టుకునేలా భూమికి తగిన రక్షణ కల్పించడంలో అసలైన బీమా ఉంది. పొలంలోను, భూమి లోపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి అసలైన బీమా ఉంది. దీంతోపాటు సంఘపరమైన మద్దతును కలిగించడంలోనూ రైతుకు బీమా లభిస్తుంది. ఉదాహరణకు వేసిన విత్తనాలు మొలవనప్పుడు.. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ద్వారా విత్తనం ఉంటే.. నష్టం నుంచి కోలుకోవచ్చు. అటువంటి అసలైన బీమా రక్షణ కల్పించే ప్రకృతి వ్యవస్థను మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వ్యవస్థలో భూమి, మొక్కలు, సూక్ష్మజీవులు.. అన్నీ అంతస్సంబంధం కలిగిన బుద్ధిశాలులే. ప్రకృతిలో అంతర్భాగమైన సహజీవన సంబంధాన్ని ప్రజలు గుర్తెరిగినప్పుడే సమాజం, భూమి, పర్యావరణం ఆరోగ్యవంతంగా ఉంటాయి.
     
* ఈ వాస్తవాన్ని గుర్తించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయని మీ అభిప్రాయం..?
అది చాలా స్పష్టం. ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయిక వ్యవస్థను నిర్మించాలంటే.. ప్రకృతితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. విత్తనాలు, విజ్ఞానం, భూమికి సంబంధించి రైతులను సార్వభౌమాధికారంతో నిర్ణయాలు తీసుకోనివ్వాల్సి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో దేన్నీ రైతులు బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన పని ఉండదు.

జన్యుమార్పిడి / హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పాటు బీమాను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఇటువంటి పద్ధతులు బహుళజాతి కంపెనీలకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం భారతీయ వ్యవసాయ రంగాన్ని అమెరికాలోని బహుళజాతి కంపెనీలు శాసిస్తున్నాయి. వాళ్లకు ఇష్టం లేని పనులు చేయడానికి ఇక్కడి ప్రభుత్వాలకు ఆసక్తి ఉండదు.

ఒకవేళ ఆ కంపెనీలు కోరితే ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. అయితే, దానికి సంబంధించి కూడా ఆ కంపెనీలు విదేశాల్లో చేసిన నిర్ణయాలను ఇక్కడ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. విత్తన సార్వభౌమత్వాన్ని మళ్లీ నిర్మించాల్సి వస్తుంది. 1995 నాటికి 80 శాతం విత్తనాలు రైతుల చేతుల్లో ఉంటే, ఇప్పుడు 80 శాతం విత్తనాలు కంపెనీల చేతుల్లో ఉన్నాయి.
     
* మీరు ఎన్ని దేశీ విత్తన బ్యాంకులు నిర్మించారు?
దేశీ విత్తనాలను సేకరిస్తూ 120 సామాజిక విత్తన బ్యాంకులను నెలకొల్పాం. వీటి వల్ల ఉపయోగం ఏమిటంటే.. సునామీ వచ్చినప్పుడు చెన్నైకి ఉప్పు నీటిలోనూ పండే వరి వంగడాలను తీసుకెళ్లి అక్కడి రైతులకు పంచాం. అయితే, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం వచ్చి గతంలో మన స్వాతంత్య్రాన్ని హరించి వేస్తే.. ఇప్పుడు బహుళజాతి కంపెనీలు మన ప్రభుత్వాలను అవినీతితో లోబరచుకొని మన స్వాతంత్య్రాన్ని కొల్లగొడుతున్నాయి.

మన ఆహారాన్ని జన్యుమార్పిడి ఆహారోత్పత్తులు, నూనెలతో కలుషితం చేస్తున్నారు... ఇప్పుడు మనకు కావాల్సింది.. బీజ్ స్వరాజ్, అన్న స్వరాజ్, భూస్వరాజ్, జలస్వరాజ్, జ్ఞాన్ స్వరాజ్! గాంధీ మార్గంలోనే పోరాడి సార్వభౌమత్వాన్ని మళ్లీ మనం సాధించుకోవాలి.
     
* ప్రజలందరికీ ఆరోగ్యదాయకమైన ఆహారాన్నందించడం ప్రభుత్వ విధి. అయితే, ప్రకృతి సేద్యం వైపు ప్రభుత్వాలను మళ్లించడం ఎలా?
అదెలాగో చేసి చూపించడం ద్వారా మాత్రమే ఈ పని చేయగలం. రైతుల ప్రాణాలను బలిగొంటున్న బీటీ పత్తి వద్దని చెప్పడానికి మనం శక్తినంతా కూడదీసుకొని దేశీ పత్తి వంగడాలను పండించి చూపించాలి. నేచర్ పవర్, పీపుల్స్ పవర్ ఏమిటో రుజువు చేయాలి. జన్యుమార్పిడి వంట నూనెలను అరికట్టడానికి గాంధీ మార్గంలో గానుగలను పునరుద్ధరించాలి. అయితే, పర్యావరణపరంగా, సామాజికపరంగా.. అన్ని విధాలా విచ్ఛిన్నమైపోయిన మన సమాజంలో గొప్ప శక్తితో విజృంభించి ఆరోగ్యదాయకమైన ఆహారం కోసం, స్వతంత్ర జీవనం కోసం కదలాలి.

హైదరాబాద్‌లో జరుగుతున్న శాశ్వత వ్యవసాయ సదస్సు వంటి సమ్మేళనాలు ఇందుకు స్ఫూర్తినిస్తాయి. ఒక లబ్ధిని ఆశించి కంపెనీల ప్రయోజనాలు కాపాడడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వానికి 30 రకాల తలనొప్పులు తయారవుతున్నాయి. ఉదాహరణకు.. బీటీ పత్తి వల్ల రైతులు లక్షాధికారులయ్యారని బుకాయించిన రాష్ట్ర ప్రభుత్వాలే ఇప్పుడు బీటీ పత్తి వల్ల నష్టం జరిగిందంటూ కోర్టుకెళ్తున్నాయి. అందువల్ల.. సత్యం ఎప్పటికైనా పైచేయి సాధించి తీరుతుంది.

ఈ లోగా మనం ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవడానికి శక్తివంచన లేకుండా పని చేయాలి. కార్పొరేట్ సామ్రాజ్యవాదం చేత చిక్కి  దారి    తప్పిన ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసే లైట్‌హౌస్‌ల వంటి ప్రత్యామ్నాయాలను ప్రజలే గాంధీజీ స్ఫూర్తితో నిర్మించుకోవాలి.
- ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు