పచ్చగన్నేరు, కలబంద ద్రావణంతో చీడపీడలు అవుట్!

22 Sep, 2015 00:25 IST|Sakshi
పచ్చగన్నేరు, కలబంద ద్రావణంతో చీడపీడలు అవుట్!

ప్రకృతిలో లభించే ఔషధ మొక్కలే సేంద్రియ రైతులకు బాసటగా నిలుస్తున్నాయి. ద్రావణాలను స్వయంగా తయారు చేసుకొని పురుగుమందులకు బదులుగా వాడుతూ నాణ్యమైన పంట దిగుబడులు సాధిస్తున్న రైతులెందరో ఉన్నారు. పచ్చగన్నేరు, కలబంద మొక్కలతో తయారు చేసిన ద్రావణం వివిధ పంటల్లో చీడపీడలను అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేస్తున్నదని కడప జిల్లాకు చెందిన పలువురు సేంద్రియ రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆ వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..
 
 కడప జిల్లా వెంపల్లె మండలం టి. వెలమవారిపల్లెకు చెందిన ఆదర్శ సేంద్రియ రైతు కె. విజయ్‌కుమార్ పచ్చగన్నేరు, కలబందలతో తయారు చేసిన ద్రావణాన్ని పంటలపై చీడపీడల నివారణకు వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.  పచ్చ గన్నేరు, కలబంద దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ దొరికేవే. పొలాలు, చెరువు కట్టల వెంబడి విరివిగా కనిపిస్తాయి. వీటిని పశువులు మేయవు, చీడపీడలు ఆశించవు. అందుకే.. వీటితో ద్రావణం తయారు చేసి చీడపీడలను అరికట్టవచ్చన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి విజయకుమార్ సత్ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలను చూసి మరికొందరు రైతులూ తయారు చేసుకొని వాడుతున్నారు. వరి, మిర్చి, వేరుశనగ, వంగ, టొమాటో, బెండ, ఆకుకూరల పంటలతోపాటు నిమ్మ, బత్తాయి తోటల్లో దోమ, రెక్కల పురుగులు, అగ్గి తెగులు,  కాండం తొలిచే పురుగుల నివారణకు ఈ ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తోందని విజయకుమార్ తెలిపారు.
 
 ద్రావణం తయారీకి కావలసిన వస్తువులు :   
 పచ్చగన్నేరు కొమ్మలు (పూలు, కాయలతో) = 5 కిలోలు
 కలబంద కాడలు    = 5 కిలోలు
 
 ద్రావణం తయారీ విధానం..
 పచ్చ గన్నేరు కొమ్మలను రోలు లేదా గ్రైండర్‌తో మెత్తని ముద్దగా చేసుకోవాలి. బాగా కండ పట్టిన 5 కిలోల అలోవీరా (కలబంద) కాడలకు తొక్క తీసి నుజ్జుగా చేయాలి. ఈ రెంటిని కలిపి 200 లీటర్ల నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ము లేదా మట్టి లేదా సిమెంటు తొట్టెలో వేయాలి. ఇందులో 5 లీటర్ల పశువుల మూత్రం లేదా మనుషుల మూత్రం పోయాలి. గాడిద మూత్రం అయితే ఒక లీటరు సరిపోతుంది. వీటిన్నిటినీ వేసి కర్రతో బాగా కలపాలి. తరువాత 180 లీ. నీటిని పోయాలి. డ్రమ్ములో ఉన్న ద్రావణానికి గాలి, వెలుతురు తగిలేలా పైన పలుచటి గుడ్డ లేదా గోనె సంచిని కప్పాలి. వారం రోజుల పాటు ఈ ద్రావణాన్ని నీడలో నిల్వ ఉంచాలి. ఈ ద్రావణం 6 నెలల పాటు పనిచేస్తుంది.
 
 ఏ యే పంటకు ఎంత మోతాదు?
 ఈ ద్రావణాన్ని ఏ పంటపైనైనా పిచికారీ చేసుకోవచ్చు. ఉద్యాన, కూరగాయ పంటలపై మొదటిసారి పిచికారీ చేసేటప్పుడు.. 60 లీ. నీటికి ఒక లీటరు ద్రావణాన్ని, రెండో పిచికారీలో 80 లీ. నీటికి లీ. ద్రావణాన్ని, మూడో పిచికారీలో 100 లీ. నీటికి లీటరు ద్రావణాన్ని కలిపి చెట్లు మొదలు, ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుకూర పంటలపై లీ. ద్రావణాన్ని 60 లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మోతాదు మించకూడదు.
 
 ఈ ద్రావణాన్ని ఏడేళ్లుగా వాడుతున్నా..
 పచ్చగన్నేరు, కలబంద ద్రావణాన్ని బత్తాయి, చిన్న నిమ్మ, సపోట, వేరుశనగ పంటలపై గత ఏడేళ్లుగా పిచికారీ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామని విజయ్‌కుమార్ (98496 48498) తెలిపారు. ‘చిన్న నిమ్మలో ఆకుముడతను, సపోటలో కాయ తొలిచే పురుగును, వేరుశనగలో ఆకుముడత, దోమలను, వరిలో దోమను ఇది సమర్థవంతంగా నివారించింది. తీగజాతి కూరగాయ పంటల (బీర, చిక్కుడు, కాకర..)పై పూతరాక మునుపే రెండు నుంచి నాలుగు దఫాలు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వచ్చాయి. వంగ, టొమాటో, బెండ వంటి పంటలపై.. ముఖ్యంగా వంగలో  దోమ, కాండం తొలిచే పురుగును నివారించ గలిగాం. ఈ ద్రావణం కొద్దిగా జిగురుగా ఉంటుంది. కాబట్టి రెక్కల పురుగులను నివారించటంలో సమర్థవంతంగా పని చేసింద’ని ఆయన వివరించారు. ఎన్. రవీంద్రరెడ్డి (99597 00559), కె. ప్రతాప్ (81060 51130) తదితరులు ఈ ద్రావణాన్ని అనేక సంవత్సరాలుగా వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారు.
 - సాగుబడి డెస్క్
 
 ద్రావణం వాడకంలో మెలకువలు
 -    పంట పూత దశలో ద్రావణాన్ని పిచికారీ చేయకూడదు.
 -    పచ్చగన్నేరు కాయలు, రసం విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీన్ని తయారు చేసుకొనేటప్పుడు చేతులకు తగలకుండా జాగ్రత్తపడాలి. పచ్చగన్నేరు చెట్లు పూత, కాయలతో ఉన్నప్పుడు వాడితేనే ఫలితం బాగుంటుంది.
 -    తెల్లదోమ, పచ్చదోమను నివారించేందుకు ఈ ద్రావణాన్ని సాయంకాలం గాలి ఉధృతి తగ్గిన తరువాత గాలి వాటంగానే పిచికారీ చేయాలి. గాలి బాగా వీచేటప్పుడు దోమ లేచి పోతుంది. అప్పుడు ద్రావ ణాన్ని పిచికారీ చే స్తే ఫలితం ఉండదు. పిచికారీ చేసే వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకోవాలి.
 -    20 రోజుల పంటపై 8 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి.
 -    చల్లని వాతావరణంలోనే ద్రావణాన్ని తగు మోతాదులో పిచికారీ చేయాలి. మోతాదు ఎక్కువైతే పంట మాడిపోతుంది.
 -    ఆకుకూరలపై పిచికారీ చేస్తే.. కనీసం మూడు రోజుల తరువాతే వినియోగించాలి.

మరిన్ని వార్తలు