తొలి దశ నుంచే దాడి చేస్తాయి

21 Jul, 2014 22:46 IST|Sakshi
తొలి దశ నుంచే దాడి చేస్తాయి

పాడి-పంట: జగిత్యాల అగ్రికల్చర్ (కరీంనగర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొక్కజొన్న పంటను వర్షాధారంగా, నీటి వనరుల కింద సాగు చేస్తున్నారు. అయితే ఈ పైరుపై తొలి దశ నుంచే చీడపీడలు దాడి చేసి నష్టపరుస్తున్నాయి. వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం పొందవచ్చునని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటయ్య. ఆ వివరాలు...
 
మొక్క మొలకెత్తిన తర్వాత...
ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న దిగుబడులను ప్రభావితం చేసే పురుగుల్లో ప్రధానమైనది మచ్చల కాండం తొలుచు పురుగు. ఈ పురుగు మొక్క మొలకెత్తిన 10-12 రోజుల నుంచే పైరును ఆశిస్తుంది. కాండానికి నష్టం కలిగిస్తుంది. రెక్కల పురుగులు ఒక దానిపై ఒకటిగా, గుంపులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన, కాడ దగ్గర గుడ్లు పెడతాయి. అవి చేప పొలుసు మాదిరిగా కన్పిస్తాయి. గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటికి వచ్చి ముందుగా ఆకుల పత్రహరితాన్ని తినేస్తాయి. ఆ తర్వాత కాండాన్ని తొలుస్తాయి. కాండం అడుగు భాగం నుంచి రంధ్రం చేసుకుంటూ లోపలికి ప్రవేశిస్తాయి. అక్కడ ఎదిగే అంకురాన్ని తింటాయి. దీనివల్ల మొవ్వులు చనిపోతాయి. లేకుంటే మొక్క మొదలు నుంచి నాలుగైదు పిలకలు వస్తాయి. అయితే వాటిలో ఏ ఒక్క పిలకకూ ఉపయోగపడే కంకులు రావు. పురుగు ఆశించిన మొక్క కాండాన్ని చీల్చి చూస్తే లోపల గుండ్రని లేదా ఇంగ్లీషు ‘ఎస్’ ఆకారంలో సొరంగాలు కన్పిస్తాయి.
 
 ఈ పురుగును నివారించాలంటే... ముందుగా పురుగు ఆశించిన మొక్కల అవశేషాలను కాల్చేయాలి. చేలో కలుపు మొక్కలు, చెత్తా చెదారం లేకుండా చూడాలి. పైరులో వరుసల మధ్య కంది/బొబ్బర్లు/సోయాచిక్కుడును అంతరపంటగా వేసుకుంటే కాండం తొలుచు పురుగుకు సహజ శత్రువులైన పురుగుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఈ పురుగు తాకిడి తగ్గుతుంది. ట్రైకోగ్రావూ ఖిలోనిస్ అనే పరాన్నజీవి గుడ్లను ఎకరానికి 2-3 ట్రైకోకార్డుల రూపంలో రెండు విడతలుగా... విత్తిన 12, 22 రోజులప్పుడు వేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 3 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఆకు సుడుల్లో వేయాలి.
 
రసాన్ని పీలుస్తాయి
 మొక్కజొన్న పైరును రసం పీల్చే పేనుబంక, నల్లి ఆశిస్తే మొక్కలు గిడసబారతాయి. వాటి ఎదుగుదల సరిగా ఉండదు. పేనుబంక పురుగు చాలా చిన్నదిగా, సూది మొన మాదిరిగా ఉంటుంది. ఆకుపచ్చ లేదా నీలి రంగులో ఉండే తల్లి, పిల్ల పురుగులు మొక్కల లేత ఆకులు, కాండాన్ని ఆశించి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు వాడినట్లుగా పసుపు రంగుకు వూరి వుుడుచుకుపోతారుు. మొక్క మొలిచిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు పైరుపై దాడి చేస్తుంది. ఇది విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం వల్ల కాండం, లేత ఆకులను శిలీంద్రాలు ఆశిస్తాయి. ఈ తీపి పదార్థం కోసం నల్ల చీమలు చేరతాయి. శిలీంద్రాల కారణంగా మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. మొక్కలకు పూత (జల్లు) రాక దిగుబడి తగ్గుతుంది.
 
సాధారణంగా అక్షింతల పురుగులు, స్పిరిడ్స్, లేస్ వింగ్ బగ్స్ వంటివి పేనుబంకను అదుపులో ఉంచుతాయి. కాబట్టి పురుగు తాకిడి తక్కువగా ఉన్నప్పుడు మందులు వాడకూడదు. ఒకవేళ పేనుబంక దాడి ఎక్కువగా ఉన్నట్లయితే అవసరాన్ని బట్టి లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
 
 నెల రోజుల దశను దాటిన మొక్కజొన్న పైరును నల్లి పురుగు ఆశిస్తుంది. తల్లి, పిల్ల నల్లులు ఆకుల కింది భాగంలో సావుూహికంగా లేదా విడివిడిగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులపై సన్నని, తెల్లని వుచ్చలు ఏర్పడతారుు. ఆగస్ట్-అక్టోబర్ మధ్యకాలంలో పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. నల్లులు ముందుగా పై ఆకులను ఆశించి, ఆ తర్వాత కింది ఆకులకు వ్యాపిస్తాయి. దీంతో మొక్క పాలిపోయి ఎండుతుంది. ఈ మొక్కను తాకిన మనుషులకు దురద పుడుతుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
 
ఎండు తెగులు సోకితే...
 మొక్కలు జల్లు దశకు వచ్చిన తర్వాత, కంకి దశలో ఉన్నప్పుడు మొక్కజొన్న పైరుకు ఎండు తెగులు సోకుతుంది. తెగులు సోకిన మొక్కలు పై నుంచి కిందికి వడలిపోతాయి. ఆకులు లేతాకుపచ్చ రంగుకు వూరి తర్వాత ఎండిపోతారుు. మొక్క కణుపులు సహజ రంగును కోల్పోరుు, ఎరుపుతో కూడిన గోధువు రంగుకు వూరి కుంచించుకుపోతారుు. ఆ తర్వాత మెత్తబడతాయి. చివరికి ఎండిపోయి బెండుగా తయారవుతాయి. తెగులు కారక శిలీంద్రాలు భూమిలో, పంట అవశేషాలలో, విత్తనాలలో జీవిస్తాయి. పైరు పూత దశకు వచ్చిన తర్వాత నీటి ఎద్దడి ఏర్పడితే తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.
 
 ఈ తెగులు నివారణకు పంట మార్పిడి చేయాలి. కిలో ట్రైకోడెర్మా విరిడెను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండిలో కలిపి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. చేలో పరిశుభ్రత పాటించాలి. విత్తడానికి ముందు కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ పట్టించి శుద్ధి చేయాలి. పుష్పించే దశ నుంచి పైరుకు నీటి ఎద్దడి కలగకుండా చూడాలి.

మరిన్ని వార్తలు