నట్టలతో జీవాలకు ఎంతో నష్టం

28 Jun, 2014 00:33 IST|Sakshi
నట్టలతో జీవాలకు ఎంతో నష్టం

పాడి-పంట: గొర్రె లేదా మేక శరీరంపై దాడి చేసే అంతర పరాన్నజీవుల్లో ఏలిక పాములు, బద్దె పురుగులు, జలగలు ప్రధానమైనవి. వీటివల్ల జీవాలకు పోషకాలు సరిగా అందక నీరసించి బక్కచిక్కిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటికీ సుమారు 95% జీవాలను విస్తృత లేదా సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఈ పద్ధతిలో జీవాలను బయళ్లు, అడవుల్లో తిప్పుతూ మేపుతుంటారు. అలా ఆరుబయట మేసే జీవాలకు తరచుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య నట్టల తాకిడి. ఇవి ఆశించడం సహజమే అయినప్పటికీ జీవాల శరీరంలో వాటి సంఖ్య ఎక్కువైతే అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. వీటివల్ల జీవాల పెంపకందారులు తమ ఆదాయంలో 30% వరకు కోల్పోవాల్సి వస్తోంది. ఎంత మేపినా జీవాలు బలం పుంజుకోవడం లేదని పెంపకందారులు కలవరపడుతుంటారు. ‘బలం’ మందు పేరుతో నట్టల నివారణ మందును తాగిస్తూ సమస్యను తాత్కాలికంగా అధిగమిస్తుంటారు.
 
 వీటివల్లే నష్టం ఎక్కువ
 తీగ పురుగులు, పేగు పురుగులు, నల్ల పారుడు పురుగులు, కొరడా పురుగులు... ఇవన్నీ ఏలిక పాములు. జలగల్లో పొట్టి జలగలు, కార్జ్యపు జలగలు, రక్తపు జలగలు అనే రకాలు ఉంటాయి. వీటితో పాటు బద్దె పురుగులు కూడా జీవాలను ఆశించి వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి.
 
 ఏం జరుగుతుంది?

 జీవాల కాలేయం, ఊపిరితిత్తులు, ప్రేవులు, జీర్ణాశయం, ఇతర అంతర్గత అవయవాల్లో నట్టలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి గొర్రెలు, మేకల్లోని పోషకాలను, రక్తాన్ని హరిస్తాయి. దీంతో జీవాలు రక్తహీనతకు గురవుతాయి. గొర్రెలు బరువు పెరగవు. ఎంత మేపినా చిక్కిపోతుంటాయి. మేత తినవు. పొట్ట లావుగా ఉంటుంది. దవడ కింద నీరు చేరుతుంది. విరేచనాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అజీర్ణం, అధిక దాహం, ముక్కు-నోటి నుంచి రక్తం కారడం, కడుపుబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. సాయంత్రం వేళ దవడ కింది భాగం వాస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది.
 
 ఎలా నివారించాలి?

 నట్టల నివారణకు మందుల వాడకం (డీవార్మింగ్) తప్పనిసరి. సంవత్సరానికి 3-4 సార్లు ఈ మందుల్ని క్రమపద్ధతిలో తాగిస్తే నట్టల్ని సమర్ధవంతంగా నిర్మూలించవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో, వర్షాకాలం మధ్యలో, వర్షాకాలం తర్వాత... ఈ మందుల్ని తాగించడం మంచిది. మందులు తాగించడానికి ముందు జీవాల పేడను పరీక్ష చేయించాలి. దీనివల్ల గొర్రె లేదా మేకను ఏ రకం నట్టలు ఆశించాయో తెలుస్తుంది. అప్పుడు ఆ నట్టలపై ప్రభావం చూపే మందుల్ని వాడాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకానీ సహచరులు వాడే మందునో లేదా మందుల షాపు వారు ఇచ్చిన దానినో లేదా పక్క గ్రామంలోని మందలకు వాడుతున్న మందునో తెచ్చి వినియోగించడం వల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
 
 సాధారణంగా ఏలిక పాముల నిర్మూలనకు ఫెన్‌బెండజోల్, లెవిమిసోల్, టెట్రామిసోల్ మందుల్ని వాడతారు. క్లొసంటాల్, ఆక్సిక్లొజనైడ్ మందులు జలగల్ని నిర్మూలిస్తాయి. బద్దె పురుగుల భరతం పట్టడానికి నిక్లోజమైడ్ వంటి మందుల్ని వాడాలి.
 
 ప్రయోజనాలెన్నో...
 జీవాలకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందును ఇస్తే మంద వేగంగా వృద్ధి చెందుతుంది. పెంపకందారులు మంచి ఆదాయం పొందుతారు. ఈ మందుల వల్ల జీవాలు ఆరోగ్యంగా, బలంగా, చురుకుగా ఉంటాయి. వాటిలో వ్యాధి నిరోధక శక్తి అధికమవుతుంది. పాలు, మాంసం, ఉన్ని దిగుబడి పెరుగుతుంది. వాటి నాణ్యత కూడా బాగుంటుంది. జీవాల బరువు సగటున 2-3 కిలోల చొప్పున పెరుగుతుంది. తద్వారా వాటి నుంచి మంచి రాబడి వస్తుంది. జీవాలు త్వరగా ఎదకు వచ్చి ఈనతాయి. ఎక్కువ సంఖ్యలో పిల్లలు పుడతాయి. వాటి బరువు కూడా అధికంగానే ఉంటుంది. గొర్రె పిల్లల్లో, పెద్ద జీవాల్లో మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది.
 
 ఈ జాగ్రత్తలు అవసరం
 జీవాల శరీర బరువును దృష్టిలో పెట్టుకొని, తగు మోతాదులో నట్టల నివారణ మందును తాగించాలి. మేకల్లో కంటే గొర్రెల్లో పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గొర్రెలకు ఓ క్రమ పద్ధతిలో మందు తాగించాలి. గ్రామంలోని గొర్రెలన్నింటికీ ఒకేసారి సామూహికంగా మందును తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. పెంపకందారులు తాము వినియోగించిన మందు పేరును రాసిపెట్టుకోవాలి. వైద్యుని సిఫార్సు మేరకే మందు వాడాలి కానీ విచక్షణారహితంగా వినియోగించకూడదు. అవసరం లేకపోయినా మందు తాగించినప్పుడు, తగిన మందును ఎంపిక చేయలేనప్పుడు అది సరిగా ప్రభావం చూపదు. కాబట్టి వైద్యుని సూచన మేరకు తగిన మందును ఎంపిక చేసుకోవాలి.
 - డాక్టర్ సిహెచ్.రమేష్, హైదరాబాద్
 
 ‘డీవార్మింగ్’ను మరవద్దు

 జీవాల పెంపకందారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం తెలంగాణలో ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు జీవాలకు ఉచితంగా, సామూహికంగా మందులు వేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జూలై 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మందులు అందిస్తారు. రెండు రాష్ట్రాలలోని జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ జీవాలకు మందులు వేయించి, అంతర పరాన్నజీవుల బారి నుంచి వాటిని రక్షించుకోవాలి.

Read latest Vanta-panta News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా