‘నీటి ఇంజెక్షన్’తో తీరును ఇక్కట్లు!

16 Apr, 2016 11:18 IST|Sakshi
‘నీటి ఇంజెక్షన్’తో తీరును ఇక్కట్లు!

మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షం కురిసే రోజులు తగ్గిపోవడమే కాకుండా తుపాన్ల వల్ల లేదా అకాలంగా వచ్చే కుండపోత వర్షాల సంఖ్య పెరుగుతోంది. కుండపోత వర్షాల సమయంలో ఆ నీటిని చప్పున భూగర్భంలోకి ఇంకింప జేసుకుంటే.. తదనంతరం కొన్ని నెలల పాటు సాగు నీటి కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు.

  పొలాల్లో వాలుకు అడ్డంగా ఖండిత కందకాలు (మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవు) తవ్వుకుంటే అదాటుగా పెద్ద వర్షాలు పడినప్పుడు కూడా వాన నీటిని పొలం నుంచి బయటకు పోకుండా చాలా వరకు భూమిలోకి ఇంకేలా చేయవచ్చని మనకు తెలుసు. నీటి వాలులో ఉన్న బోర్ల చుట్టూ ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకుంటే వాన నీటిని కొంతమేరకు ఇంకింపజేసుకోవచ్చనీ మనకు తెలుసు...

 అయినా, అదాటుగా వచ్చే కుండపోత వర్షాల నీరు ఎక్కువ శాతం పొలాల బయటకు కొట్టుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా కొట్టుకుపోయిన వాన నీరు పొలాల పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీటి మడుగులు ఏర్పడుతుంటాయి. అలా నీటి మడుగులోకి చేరిన నీటిని భూమిలోకి ఇంకింపజేసే (ఇంజెక్ట్ చేసే) ఏర్పాట్లు చేసుకుంటే.. రెండు పంటలకూ నీటి కొరతే ఉండదని బిప్లవ్ కేతన్ పాల్ చెబుతున్నారు. గుజరాత్‌కు చెందిన పాల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఇందుకు ఉపకరించే ఒక పద్ధతిని ఆవిష్కరించారు. దీనికి ‘భుంగ్రు’ అని పేరు పెట్టారు. గుజరాతీ భాషలో దీని అర్థం ‘నీటిని పీల్చుకునే గొట్టం’ అని అర్థం.

 అతి చిన్న కమతాలున్న ఐదుగురు మహిళా రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి.. బృందానికి ఒకటి చొప్పున ప్రభుత్వ ఆర్థిక సాయంతో వందలాది భుంగ్రులను నెలకొల్పారు. మడుగుల్లోకి చేరే వాన నీటిని లేదా వరద నీటిని పీవీసీ గొట్టం ద్వారా భూమికి తాపి (ఇంజెక్ట్ చేసి).. కరువు కాలంలో ఆ నీటిని మోటారు ద్వారా తోడుకొని నిక్షేపంగా రెండు పంటలు పండించుకొని అధిక నికరాదాయం పొందవచ్చని రుజువు చేశారు. ఒక్కో భుంగ్రు 15 ఎకరాలకు రెండు పంటలకు నీరందిస్తుంది. 18 వేలకు పైగా చిన్న కుటుంబాలు వీటి ద్వారా ఆహార భద్రతను సాధించి పేదరికాన్ని జయించాయని ఆయన చెబుతున్నారు.

 పొలాల్లో భూమి పైపొర వాన నీటిని ఇంకింపజేసుకోలేనంత గట్టిగా మారిన భూముల్లో కుండపోత వానలు లేదా వరదలు వచ్చినప్పుడు  ఈ పద్ధతి ద్వారా నీటిని భూమిలోకి ‘ఇంజెక్ట్’ చేసుకోవడం ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. భూమి చౌడు బారి, భూమి లోపలి పొరల్లో ఇసుక పాళ్లు ఎక్కువగా ఉన్న భూముల్లో కూడా ఈ పద్ధతిలో వాన నీటిని ఇంకింపజేసుకోవడం ప్రయోజనకరమని అంటున్నారు. భూమి అడుగు పొరల్లో ఉప్పు నీరు ఉన్నప్పటికీ.. పైపొర ఇసుక భూమిలో స్వచ్ఛమైన వాన నీరు నిల్వ ఉంటుందని, మోటారు ద్వారా ఈ నీటిని తోడినప్పుడు ఈ మంచినీరే అందుబాటులోకి వస్తుందని, ఆ విధంగా పంటలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తీర ప్రాంతాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ యే ప్రాంతాలకు నీటి ఇంజెక్షన్ పద్ధతి ఎంతవరకూ ఉపయోగమో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నిపుణులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వివరాలకు.. ‘భుంగ్రు’ ఆవిష్కర్త బిప్లవ్ కేతన్ పాల్‌ను 0091 98255 06900 లేదా ఛజీఞ్చఛజుఞఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు.
 - సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు