ప్రణాళికాబద్ధంగా సాగితే.. పౌల్ట్రీ లాభమే!

21 Nov, 2014 00:18 IST|Sakshi
ప్రణాళికాబద్ధంగా సాగితే.. పౌల్ట్రీ లాభమే!

మోమిన్‌పేట: కోళ్ల పెంపకం వైపు గ్రామీణ ప్రాంతాల్లోని యువరైతులు దృష్టి సారిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో 40 రోజుల్లోనే లాభాలు పొందవచ్చంటున్నారు. ప్రణాళిక ప్రకారం చేస్తే ఎంత లాభం వస్తుందో ప్రణాళిక లేకుండా పెంపకం చేపడితే అంత నష్టం వస్తుందంటున్నారు. కోడిపిల్లలు, మందులు, దాణాలను పలు కంపెనీలు రైతులకు అందజేస్తున్నాయి. కేవలం పెంపకం బాధ్యతలనే రైతులకు అప్పగిస్తున్నాయి.

వాటిపై కమీషన్ కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారు.మండల పరిధిలోని చీమల్‌దరి, టేకులపల్లి, ఏన్కతల, మల్‌రెడ్డిగూడెం, ఎన్కేపల్లి, కేసారం, మోమిన్‌పేట, దుర్గంచేర్వు, బూర్గుపల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే సుమారు 26 మంది యువ రైతులు కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. బ్యాంకులు రుణ సౌకర్యాన్ని కల్పిస్తే ఎక్కువ మొత్తంలో పెంపకాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 షెడ్ల నిర్మాణం..
 మూడు వేల బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి శాశ్వత షెడ్డు నిర్మాణానికి దాదాపు రూ.5.50 లక్షలు అవసరమవుతాయి. మరో రూ.లక్షతో నీటి తొట్లు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 కోడి పిల్లల కొనుగోలు
 మూడు వేల కోడి పిల్లల కొనుగోలుకు మార్కెట్‌ను బట్టి  రూ.90 వేలు అవసరమవుతాయి. ఒక్కో కోడిపిల్ల సగటున మూడు కిలోల నుంచి నాలుగు కిలోల దాణా తింటుంది. కిలో దాణా రూ.35. కాగా కోడి ఒక్కటి 40 రోజుల్లో రూ.180 నుంచి రూ.190 వరకు దాణా తింటుంది. మందులు, కూలీలు, విద్యుత్ బిల్లులతో పాటు ఒక్కో కోడికి 40 రోజులలో సగటున రూ.210 ఖర్చవుతాయని రైతులు పేర్కొంటున్నారు.

 మార్కెట్‌లో కిలో కోడి రూ.90కి అమ్ముడు పోతే మంచి లాభాలు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. 40 రోజులు దాటితే దాణా ఖర్చు పెరిగి నష్టాలు వస్తాయని రైతులు తెలిపారు. మార్కెటును దృష్టిలో పెట్టుకొని రైతులు వెంకటేశ్వర, సుగుణ కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. దాణా, మందులు, కోడిపిల్లలు కంపెనీ వారు ఇస్తే కూలీలు, విద్యుత్ బిల్లులను యజమాని భరించాల్సి ఉంటుంది. ఇలా ఇవ్వడం బాగానే ఉందని రైతులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు