అడవి పందుల బారినుంచి పంటలను కాపాడుకోండిలా

3 Sep, 2014 05:51 IST|Sakshi

నిజామాబాద్ :  అడవి పందులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో ముఖ్యంగా మొక్కజొన్న, చెరుకు పంటలపై దాడి చేసి నష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటి బారినుంచి పంటలు కాపాడుకునేందుకు టపాసులు పేల్చడం, పొలం చుట్టూ వెంటుక్రలు చల్లడం వంటి చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

 పటాకులు పేల్చడం ద్వారా..
 కొబ్బరితాడును తీసుకుని, వాటి పురుల మధ్య అక్కడక్కడ పటాకులు పెట్టాలి. దానిని ఒక కొయ్యకు కట్టాలి. ఇలా పొలంలో నాలుగైదు కొయ్యలను పాతాలి. రాత్రి వేళల్లో కొబ్బరి తాడుకు నిప్పంటించాలి. కొబ్బరితాడు కాలుకుంటూ పోయిన కొద్దీ మధ్యలో ఉన్న పటాకలు పేలుతాయి. దీంతో అడవి పందులు పారిపోతాయి.

 పొలం చుట్టూ వెంటుక్రలు వేసి..
 అడవి పందులు పొలంలో ప్రవేశించే మార్గంలో తల వెంటుక్రలు వేయాలి. మట్టిని వాసన చూస్తూ పొలంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోకి వెంట్రుకలు ప్రవేశించి పందులను బాధిస్తాయి. దీనివల్ల అడవి పందులు పొలాల్లోకి రాకుండానే పారిపోతాయి.

 దీపం వెలిగించి..
 పొలంలో ఒక మూలన దిమ్మెను ఏర్పాటు చేసి దానిపై ఒక పెద్ద కిరోసిన్ దీపం పెట్టాలి. దానిపై చిల్లులు ఉన్న కంచుడు వంటి పాత్ర పెడితే దీపం ఆరిపోకుండా ఉంటుంది. దీపం నుంచి వచ్చే మంట, చిల్లుల పాత్ర నుంచి అన్ని వైపులకు కనిపిస్తుంది. అడవి పందులు ఇలాంటి దీపపు వెలుగులు చూసి భయపడతాయి. మినుకుమినుకుమనే లైట్లు అమర్చినా ఫలితం ఉంటుంది.

 బెలూన్‌లు ఎగరేయడం ద్వారా..
 పొలంలో అక్కడక్కడా పది అడుగుల ఎత్తులో కొయ్యలు పాతి, వాటికి బెలూన్‌లను వేలాడదీయాలి. వాటిని చూసి అడవి పందులు పంట దగ్గరికి కూడా రావు. తెల్ల గుడ్డలను కొయ్యలకు కట్టి వేలాడదీసినా.. వాటిని చూసి పందులు పారిపోతాయి.

 సోలార్ ఫెన్సింగ్‌తో..
 ఖర్చుతో కూడుకున్నదైనా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఉపయోగించుకుని పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి పశువులు తాకినా ప్రాణనష్టం ఉండదు. ఈ ఫెన్సింగ్ విధానంలో పశువులు కొద్దిపాటి షాక్‌కు మాత్రమే గురవుతాయి.

 దుర్వాసన వచ్చేలా..
 పొలం చుట్టూ రెండు అడుగుల ఎత్తులో 10 అడుగుల దూరానికి ఒక కొయ్య పాతాలి. వాటికి పంది చమురు లేదా చెడిపోయిన బ్యాటరీ వ్యర్థాలతో కూడిన పదార్థాన్ని పూయాలి. ఈ వాసనకు అడవి పందులు రావు.

 ఫోరేట్ గుళికల వాసనతో..
 10 గుడ్డ సంచులలో 100 గ్రాముల ఫోరేట్ గుళికలను మూటగట్టాలి. వర్షం కురిస్తే తడవకుండా ఉండేందుకు ఈ సంచులను ప్లాస్టిక్ కవర్లలో పెట్టాలి. వీటిని పొలంలో అక్కడక్కడ కొయ్యలకు వేలాడదీసి అప్పుడప్పుడు తడుపుతుండాలి. దీంతో ఫోరేట్ వాసన పొలమంతా వ్యాపిస్తుంది. ఈ వాసనకు అడవి పందులు రావు. అయితే గుడ్డ సంచులను తడిపినప్పుడు నీరు కింద పడకుండా చూసుకోవాలి. ఆ నీటిని తాగితే పశువులకు ప్రాణహాని ఉంటుంది.

మరిన్ని వార్తలు