కందకాలతో కరువు నుంచి రక్షణ!

10 May, 2016 00:08 IST|Sakshi
కందకాలతో కరువు నుంచి రక్షణ!

♦ ‘సాక్షి’ స్ఫూర్తితో గత ఏడాది కందకాలు తవ్వించా..
♦ కందకాలు నిండేలా వర్షం పడింది ఒక్కసారే
♦ 30 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి కరువు వచ్చింది
♦ అయినా, కందకాల వల్లే మా తోట పచ్చగా నిలబడింది..
♦ సీనియర్ ఉద్యాన రైతు మల్లికార్జునరావు
 
 పండ్ల తోటల సాగులో వై.కె.డి. మల్లికార్జునరావుకు 30 ఏళ్ల అనుభవం ఉంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెద్దివేడు గ్రామంలో 50 ఎకరాల్లో మామిడి, జామ, ఉసిరి, సపోట తోటలతోపాటు 2 ఎకరాల్లో మలబారు వేపను సాగు చేస్తున్నారు. గత ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న దశలో చేనుకిందే చెరువు పేరిట ‘సాక్షి’ మీడియా గ్రూప్, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన కందకాల ఉద్యమంతో స్ఫూర్తి పొందారు. వేదిక నేతలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డిలను సంప్రదించి, స్వయంగా తీసుకెళ్లి తోటను చూపించారు. వారి సూచనల మేరకు తోటలోని సుమారు 20 ఎకరాలలో అక్కడక్కడా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున 25 మీటర్ల పొడవున వాలుకు అడ్డంగా గత ఏడాది సెప్టెంబర్‌లో కందకాలు తవ్వించారు.  కందకాలు తవ్విన  పది రోజుల్లో పెద్ద వర్షం కురిసింది. పొలంలో పారిన నీరు కందకాల్లోకి నిండుగా చేరి, భూమిలోకి ఇంకాయి.

 అయితే, ఆ తర్వాత గత ఏడాదంతా వర్షం లేదు. మళ్లీ 2016 మే 8వ తేదీ రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసే వరకు.. చుక్క వాన పడలేదు. తమ తోటలో ఉన్న 5 బోర్లలో 3 బోర్లు ఎండిపోయాయని మల్లికార్జునరావు తెలిపారు. రెండు బోర్లూ కలిపి రెండించుల నీరు పోస్తున్నాయన్నారు. 500 అడుగుల లోతు తవ్విన బోర్లు ఎండిపోయినా.. మామిడి తోటలో కందకాలకు దగ్గరగా ఉన్న 200 అడుగుల బోరు కొంచెంగానైనా నీరు పోస్తుండడం విశేషం అన్నారాయన. గత ఏడాది మేలుకొని కందకాలు తవ్వడం వల్లనే తన తోటలో చెట్లు పచ్చగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

 మామిడికి అధిక ఉష్ణోగ్రత దెబ్బ
 మల్లికార్జునరావుతోటలో మామిడి దిగుబడి ఈ ఏడాది 20% మేరకే వచ్చింది. గత డిసెంబర్‌లో వచ్చిన పూత నిలబడిందని, జనవరి ఆఖరులో పూత బాగా వచ్చిందని, ఆ పూత అధిక ఉష్ణోగ్రత వల్ల రాలిపోయిందని తెలిపారు. గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆయన అంటున్నారు. వాతావరణ మార్పుల దుష్ర్పభావం వల్లనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారిందన్నారు. కందకాలు తవ్వుకోవడం ద్వారా వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారానే కరువును ఎదుర్కోవడం సాధ్యపడుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.

 కందకాలు.. జీవామృతం..
 కరువును తట్టుకోవాలంటే.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడంతోపాటు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం తప్ప మరో మార్గం లేదని మల్లికార్జునరావు అంటున్నారు. ఆయన గత ఐదేళ్లుగా పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి వాడుతున్నారు. మామిడి తోటకు రెండేళ్లుగా జీవామృతాన్ని నెలకోసారి పిచికారీ చేస్తున్నారు. 15 రోజులకోసారి డ్రిప్పర్‌కు లీటరు చొప్పున జీవామృతం చెట్ల వద్ద పోస్తున్నారు. ఈ ఏడాది ఘన జీవామృతం తయారు చేయించి నిల్వ చేశారు. వర్షాలు పడినప్పుడు డ్రిప్పర్ల కింద పెడతామన్నారు.

 12 x 12 దూరంలో మామిడి సాగు మేలు
 మల్లికార్జునరావు తన మామిడి తోటలో 12x12, 26x26, 20x20 దూరాల్లో మామిడి మొక్కలు పాతికేళ్ల నాడు నాటారు. వీటిలో 12ఁ12 దూరంలో నాటిన మామిడి తోట మంచి దిగుబడులనిస్తున్నదని ఆయన అంటున్నారు. చెట్లు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల గాలులకు కాయ రాలకుండా ఉంటుందన్నారు. ప్రతి ఏటా పంట పూర్తవగానే ప్రూనింగ్ చేస్తున్నారు. 25 ఏళ్లు గడిచిన తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో 3 అడుగుల ఎత్తున కొమ్మలు నరికించారు. దీన్నే డీహెడింగ్ అంటున్నారు. ఈ తోటలో వచ్చే ఏడాదికి పూర్తిస్థాయి దిగుబడి మళ్లీ ప్రారంభమవుతుందని, మరో పాతికేళ్లు ఢోకా ఉండదని ఆయన ధీమాగా ఉన్నారు.

 ప్రతి ఏటా వర్షాలు ప్రారంభం కాగానే బొబ్బర, ఉలవ, జనుము వంటి పచ్చి రొట్ట ఎరువులను విధిగా చల్లి, 45 రోజులకు భూమిలో కలియదున్నడం వల్ల భూమి సారవంతంగా ఉన్నదన్నారు. జీవామృతం వాడిన తర్వాత కాయ బలంగా ఊరుతోందని ఆయన తన అనుభవంగా చెబుతున్నారు.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 ఫొటోలు: పోల్కంపల్లి నాగరాజు, సాక్షి ఫొటోగ్రాఫర్

 
 కందకాల వల్లనే తోట పచ్చగా ఉంది..!
 ‘సాక్షి’ అందించిన స్ఫూర్తితో గత ఏడాది 20 ఎకరాల్లో మాత్రమే కందకాలు తవ్వించాను. ఒకటే వర్షం పడింది. అయినా, రెండు బోర్లు ఎండిపోకుండా ఉండడానికి, తోట పచ్చగా ఉండడానికి ఈ కందకాలు ఉపయోగపడ్డాయనుకుంటున్నాను. ఈ ఏడాది మంచి వర్షాలు పడే సూచనలున్నాయి. మా తోట అంతటా పూర్తి స్థాయిలో కందకాలు తవ్వించాలనుకుంటున్నాను. కందకాలు తవ్వుకోవడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడమే కరువును ఎదుర్కోవడానికి మేలైన మార్గమని నమ్ముతున్నాను. పొలంలో కురిసిన ఒక్క చినుకును కూడా బయటకుపోకుండా కందకాలు తవ్వుకోమని పాలేకర్ కూడా చెప్పారు.
 - వై.కె.డి. మల్లికార్జునరావు (94904 64498), పెద్దివేడు, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా

మరిన్ని వార్తలు