అరటి సాగులో సస్యరక్షణ

27 Nov, 2014 23:46 IST|Sakshi

నులి పురుగు బెడద
  వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
  తేలికపాటి నేలల్లో ఉండే ఈ పురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
  వీటివల్ల వేర్లపై బుడిపెల వంటివి ఏర్పడుతాయి.  
  ఉధృతి అధికంగా ఉంటే అరటి ఆకులు వాలిపోతాయి. అంచుల చివర్లు నల్లగా మారి మాడిపోతాయి.  
   మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది.
  పంటనాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే పురుగును నివారించవచ్చు.
   నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ 2.5. మి.లీ మోనోక్రొటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి.
  మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి.
  అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను మొక్కల    దగ్గరగా వేయాలి.
   పంటల మార్పిడి వల్ల కూడా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.

  ఆకుమచ్చ తెగులు
  దీని ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. బూడిద రంగులో ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా మారుతాయి.
  ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారుతాయి.
   తెగులు నియంత్రణ కోసం తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలపి పిచికారీ చేయాలి.
  అలాగే ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా ప్రొపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి.

 కాయముచ్చిక కుళ్లు
 అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి.
 నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసి తెగులును అదుపు చేయవచ్చు.

మరిన్ని వార్తలు