ఈ వారం వ్యవసాయ సూచనలు

10 Aug, 2014 23:21 IST|Sakshi
ఈ వారం వ్యవసాయ సూచనలు

సూక్ష్మధాతు లోపాలను సవరించడమెలా?
ఆశ్లేష కార్తె (ఆగస్టు 16 వరకు)
మఘ కార్తె (ఆగస్టు 17 నుంచి)


పంటల దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో చీడపీడలతోపాటు సూక్ష్మధాతు లోపాలు కూడా ప్రధానమైనవి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని చాలా భూముల్లో సూక్ష్మధాతు లోపాలున్నట్లు నిర్ధారణైంది.  వివిధ పంటల ఎదుగుదల దశ, కొత్త చిగుర్ల దశల్లో జింకు, ఇనుపధాతు లోపాలు ఎక్కువగా పంటలను నష్టపరుస్తున్నాయి. నాణ్యమైన దిగుబడుల కోసం ధాతు లోపాలను ముందుగానే సవరించుకోవాలి. వరిలో నారుమడులు, పొలాల్లో జింకు, ఇనుపధాతు లోపాలను గుర్తించాం. జింకు ధాతువు లోపాన్ని సవరించడానికి లీటరు నీటిలో 2 గ్రా. జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుప ధాతులోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 20 గ్రా. అన్నభేది, 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పొలంలో నాట్లు వేయడానికి ముందుగానే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి.

మెగ్నీషియం లోపంతో పత్తి ఆకులు ఎర్రబడుతుంటాయి. దీని నివారణకు 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ను పైరు వేసిన 45, 75 రోజుల తర్వాత రెండుసార్లు పిచికారీ చేయాలి. బోరాన్ లోపం ఉన్నప్పుడు చిన్న కాయలు రాలిపోతాయి. మొక్కలు గిడసబారతాయి. కాయపైన పగుళ్లు ఏర్పడతాయి. నివారణకు 60, 90 రోజుల వయసులో లీటరు నీటికి 1.5 గ్రా. బోరాక్స్‌ను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. చీనీ, నిమ్మ పంటల్లో కొత్త చిగురు వస్తున్న సమయంలో సూక్ష్మధాతు లోపాలను గమనిస్తే ముందు జాగ్రత్తగా పల్లాకు వ్యాధి నివారణకు లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 5 గ్రా. + మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. + ఫై సల్ఫేట్ 2 గ్రా.+ మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా.+ బొరాక్స్ 1 గ్రా. + సున్నం 6 గ్రా. + యూరియా 10 గ్రా. కలిపిన మిశ్రమాన్ని సంవత్సరానికి 4సార్లు పిచికారీ చేయాలి. విప్పారిన లేత ఆకుల మీద, పిందెలు బఠాణి పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.

 మామిడి, జామ, సపోటా, బత్తాయి, ద్రాక్ష తోటల్లో జింకు లోపం నివారణకు చెట్టుకు 100-200 గ్రా. జింకు సల్ఫేట్‌ను చెట్ల పాదుల్లో వేసి మట్టితో కలపాలి. పంటలపైన లోపం ఉంటే 0.2 శాతం జింకు సల్ఫేట్ పిచికారీ చేయాలి. అరటిలో పొటాష్ లోపం వల్ల ఆకు మొత్తం పండిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు మొక్కకు 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను నలభై రోజుల వ్యవధితో 4 దఫాలు వేసుకోవాలి. లోపం కనిపించినట్టైతే ఆకులపై 5 గ్రా. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ ధాతులోపం వలన ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా ఉండి, ఆకులు బిరుసుగా, పెళుసుగాను ఉంటాయి. దీని నివారణకు 0.1 శాతం బొరాక్స్ మందును ఆకులపై 10 రోజుల తేడాతో రెండుసార్లు పిచికారీ చేయాలి.
 - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,  హైదరాబాద్
శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు :
ఆంధ్రప్రదేశ్ : 1100, 1800 425 4440
తెలంగాణ : 1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551

మరిన్ని వార్తలు