మూగ జీవాలకూ ‘తీపి’ మాత్రలు!

25 Aug, 2015 00:25 IST|Sakshi
మూగ జీవాలకూ ‘తీపి’ మాత్రలు!

మామిడి, మిరప తదితర పంటల్లో విశిష్టమైన వంగడాలకు రూపకల్పన చేసి ప్రఖ్యాతి పొందిన రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్. స్వీయ అధ్యయనం, అనుభవ జ్ఞానం, సృజనాత్మకతలను మేళవించి అద్భుతాలు సాధిస్తూ శాస్త్రవేత్తలను సైతం అబ్బుర పరుస్తున్నారు. అంతేకాదు.. మనుషులతోపాటు.. పశువులకూ స్వల్ప ఖర్చుతోనే హోమియో వైద్య సేవలు అందిస్తున్నారు. తన సేవలను మరింత విస్తృతం చేయడం కోసం హోమియో వెటర్నరీ కాలేజీని ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నారు. ఈ ఆరు పదుల రైతు శాస్త్రవేత్త సేవల వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం..
 
గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన కొంగర రమేష్‌ది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా ఎన్నికవడంతో 14 ఏళ్ల వయసులోనే (8వ తరగతి) చదువుకు స్వస్తి చెప్పి రమేష్ సేద్యం బాటపట్టారు. తమ పొలాలకు సమీపంలోనే ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాల అధ్యాపకులతో పరిచయాలు పెంచుకొని వ్యవసాయ పరిజ్ఞానం సంపాదించారు. కాలక్రమంలో ఆయన విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ సమీపంలోని నవనీత ఎవర్‌గ్రీన్స్‌లో స్థిరపడి.. వ్యవసాయంపై, హోమియోపై అనేక దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన ఆరోగ్యం ఉప్పల సత్యనారాయణ (గుంటూరు) అనే హోమియో వైద్యుడు ఇచ్చిన మందుతో కుదుటపడింది. దీంతో హోమియోపై ఆసక్తితో ఆ వైద్యంతో విస్తృతంగా అధ్యయనం చేశారు. సత్యనారాయణ ప్రోత్సాహంతో హోమియోపై పట్టు సాధించి మనుషులకు, పశువులకు మందులివ్వడం మొదలెట్టారు.
 
ఒక శాతం ఖర్చుతోనే హోమియో వైద్యం
మనుషులకు హోమియో మందుతో రోగం నయమవుతుంటే పశువులకెందుకు నయం కాదు? అన్న ఆలోచన కలిగింది రమేష్‌కి. దాదాపు 20 ఏళ్ల క్రితమే తన మదిలో మెదిలిన ఈ ఆలోచనకు పదును పెట్టారు. అప్పటికే హోమియో వైద్యంపై పట్టు సాధించిన ఆయన స్వయంగా హోమియో మందును తయారు చేసి వ్యాధిపీడిత పశువులకు ఇచ్చారు. అది సత్ఫలితాలివ్వడంతో ఉచిత వైద్యం కొనసాగిస్తున్నారు. పొదుగు వాపు, పారుడు, గాలికుంటు వ్యాధి, జ్వరం నివారణకు, పశువులు తేలికగా ఈనేందుకు, గాయాలకు కూడా మందిస్తారాయన.పశువులకు ప్రాణాంతకమైన బ్రూసిలోసిస్ వ్యాధికి తొలుత ఇంగ్లండ్ నుంచి మందు తెప్పించారు. తర్వాత తానే ఆ మందును తయారు చేసి ఈ వ్యాధిని నయం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ హోమియో సదస్సులో బ్రూసిలోసిస్ వ్యాధి నివారణపై తన వైద్యం గురించి రమేష్ వివరించారు. హోమియో వైద్యం చేయించడానికి పలువురు రైతులు తమ పశువులను రమేష్ వద్దకు తీసుకొస్తుంటారు. ఇప్పటిదాకా ఐదు వేల పశువులకు ఆయన వైద్యం చేశారు. అల్లోపతితో పోల్చుకుంటే ఒక శాతం ఖర్చుతోనే హోమియో వైద్యాన్ని అందించవచ్చంటున్నారు రమేష్.

హోమియో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు యోచన..
హోమియో పశువైద్యంపై పట్టు సాధించిన రమేష్ హోమియో వెటర్నరీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు. ఇందుకు తోడ్పాటునందించడానికి ‘ఆయుష్’ శాఖ సుముఖత వ్యక్తం చేసిందన్నారు. నవనీత ఎవర్‌గ్రీన్స్ ఆవరణలో ఈ కాలేజీ ఏర్పాటుకు నవనీత చైర్మన్, ఎండీ అనుమతించారన్నారు. బీహెచ్‌ఎంఎస్ పూర్తిచేసిన రమేష్ కుమార్తె ప్రతిభ హోమియో వెటర్నరీ (ఇంగ్లండ్) కరస్పాండెన్స్ కోర్సు చదవాలనుకుంటున్నారు.
 
హోమియో సేద్యంపైనా దృష్టి
రసాయన ఎరువుల అవసరం లేకుండా బ్రెజిల్ తదితర దేశాల్లో మాదిరిగా హోమియో సేద్యంపైన కూడా ఆయన దృష్టిసారించారు. పురుగులను పారదోలే హోమియో మందు తయారీపై పరిశోధనలు సాగిస్తున్నారు. హోమియో సేద్యం వల్ల అధిక దిగుబడులతో పాటు ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చంటారు రమేష్. హోమియో సేద్యంపై ప్రయోగాలు మరో ఏడాదిలో తుది ఫలితాలనిస్తాయన్నారు.
 
అబ్బుర పరచే వంగడాలెన్నో..
మిరప, మామిడిలో అనేక విశిష్టమైన వంగడాలను రూపొందించిన రైతు శాస్త్రవేత్తగా రమేష్‌కు మంచి గుర్తింపుంది. ఏడాదంతా కాసే రెడ్‌టాప్-365 (పాండవ్), ‘అర్జున్’ మిరప వంగడాలను రూపొందించారు. మామిడి సీజన్‌కన్నా నెల ముందే కాపునిచ్చే ‘స్వాగతం’, అతి తియ్యని ‘అమృతం’ వంగడాలు ప్రసిద్ధి పొందాయి. ప్రీజర్‌లో ఉంచిన ఈ అమృతం రకం మామిడిపండునే ఐస్ ఫ్రూట్ మ్యాంగోగా మార్కెట్లోకి తెచ్చారు.

అల్ఫెన్సాను రసాలతో సంకరం చేసి మరో వంగడాన్ని సృష్టించే పనిలో ఉన్నారు. మొక్కల్లో పోషకాల లోపాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే టిష్యూ కిట్‌ను ఆయన రూపొందించారు. కేవలం రూ. 10 ఖర్చుతో పావుగంటలోనే లోపాన్ని తెలుసుకోవచ్చు. ఆయన సృజనాత్మక కృషి మరిన్ని కొత్తపుంతలు తొక్కి రైతాంగానికి మరింతగా ఉపయోగపడాలని ఆశిద్దాం.
 - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం
ఫోటోలు: మహంతి శివాజీ, ఆనందపురం

హోమియో పశువైద్యం నేర్పిస్తా..

నేను కన్న కలలు నా పిల్లలు, నాతో కలిసి చేస్తున్న వాలంటీర్ల ద్వారా నిజం కావాలని ఆకాంక్షిస్తున్నాను. పెద్దమ్మాయి హరిత ఎమ్మెస్సీ హార్టికల్చర్ చేసింది. ఉద్యోగం వచ్చినా చేరకుండా నాతో కలిసి పరిశోధనలు చేస్తోంది. చిన్నమ్మాయి ప్రతిభ బీహెచ్‌ఎంఎస్ చదివింది. వారంలో రెండ్రోజులు నాతోపాటే హోమియో వైద్య సేవలందిస్తోంది. నా స్నేహితుని కొడుకు ప్రకాష్ బయోటెక్నాలజీ పూర్తి చేసి నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. వీరంతా నా కలల సాకారానికి కృషి చేస్తున్నారు. ఈ పరిశోధనలు నాకు ఎంతో సంతృప్తినిస్తున్నాయి. నా వద్ద శిక్షణ పొందిన సుమారు 40 మంది హోమియో పశువైద్యం చేస్తున్నారు. జీవితాంతం ప్రయోగాలు కొనసాగిస్తా. ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తా.  
- కొంగర రమేష్ (98492 78889), తర్లువాడ, ఆనందపురం మండలం, విశాఖ జిల్లా

 

మరిన్ని వార్తలు