ప్రతి నెలా ‘పట్టు’బడే!

16 Jun, 2015 04:46 IST|Sakshi
ప్రతి నెలా ‘పట్టు’బడే!

ఉద్యోగం మానేసి పట్టు పురుగుల పెంపకం చేపట్టిన యువకుడు
పూర్తిస్థాయిలో శిక్షణ పొంది.. ప్రణాళికాబద్ధంగా ముందడుగు..
నెలకు రూ. 30 వేల నికరాదాయం పొందుతున్న వైనం
 
వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకుండా పోతున్న ఈ రోజుల్లో కన్నీటి సేద్యం చేయడం కన్నా.. పట్నంలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటే మేలన్నది గ్రామీణ యువతను ఇప్పటికీ బలంగా ఆకర్షిస్తున్న భావన. అయితే, పొరుగూళ్లో చిన్నాచితకా ఉద్యోగాల కన్నా సొంతూళ్లో ప్రణాళికాబద్ధమైన సేద్యం ఎంతో మేలని మూతి మీద మీసం కూడా ఇంకా సరిగ్గా మొలవని ఈ లేత కుర్రాడు తన చేతల ద్వారా చాటిచెబుతున్నాడు.  శిక్షణ పొంది పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి భళా అనిపించుకుంటున్నాడు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు...
 
 సొంతూళ్లో పట్టు పురుగుల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జించాలి అనే కోరికతో  ఉద్యోగం మానేసి సొంతూరు చేరుకున్నాడు. చదువుకొని ఉద్యోగం చేసుకోక ఇవన్నీ ఎందుకని ఇంట్లో వాళ్ల నుంచి, స్నేహితులు, ఇరుగుపొరుగు నుంచి విమర్శలు వచ్చినా సహించాడు. తల్లిదండ్రులను ఒప్పించి పెట్టు బడి సమకూర్చుకున్నాడు. కష్టం ఫలించి తొమ్మిది నెలల తరువాత తను ఊహించిన లాభాలు ఒళ్లో వాలాయి. వెక్కిరించిన నొసళ్లే ప్రశంసాపూర్వకంగా చూశాయి. మేమూ నీదా రిలోనేనంటూ మరికొంత మంది యువకులు ముందుకు వచ్చారు. ఇంతా సాధించిన ఆ యువకుడి పేరు పొట్టవర్తిని భార్గవ్.  కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని కన్నాపూర్ ఆయన స్వగ్రామం.
 భార్గవ్ జగిత్యాలలో ఇంటర్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివాడు. డిప్లామా పూర్తి చేసి ఒక సెవెన్ స్టార్ హోటల్‌లో నెలకు రూ. 8 వేల జీతంతో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం భార్గవ్‌కు తృప్తినివ్వలేదు. ఇప్పుడు బాగానే ఉన్నా తరువాత పరిస్థితి ఏమిటి? అనిపించేది. తను అద్దెకున్న ఇంటి యజమాని నాయక్ సెరి కల్చర్ డిపార్ట్‌మెంట్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తుండేవారు. ఆయనతో పరిచయం పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తిని పెంచింది. బాగా ఆలోచించి స్వంత ఊళ్లో పట్టు పురుగుల పెంపకంతో ఉపాధి పొందడమే సరైన మార్గమని నిశ్చయిం చుకున్నాడు.
 
 అనుకున్నదే తడవుగా నాయక్ సలహాతో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో కేంద్ర పట్టు పురుగుల పెంపకం పరిశోధన, శిక్షణ కేంద్రంలో 2 నెలలు, హిందూపూర్‌లో 15 రోజులు శిక్షణ తీసుకున్నాడు. రూ. 5 లక్షలతో పట్టు పురుగుల పెంపకానికి ఓ షెడ్డు వేశారు. పట్టు పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించగా వారు షెడ్డు నిర్మాణానికి లక్ష రూపాయలు, స్టాండ్లు, ట్రేలు, చంద్రికలు నెట్‌లు కట్టుకోవటానికి రూ. 38 వేలు అందజేశారు.  మేత కోసం రాజమండ్రి నుంచి మల్బరీ మొక్కలను తెప్పించి ఎకరంలో మల్బరీ తోటను పెంచారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా మల్బరీ తోటకు కూలీల ఖర్చు కోసం ఏడాదికి రూ. 53 వేలు కేటాయించగా రూ. 13 వేలతో మొక్కలు నాటించి, కలుపు తీయించటం వంటి పనులు పూర్తి చేశారు. ఏడాదికి మూడుసార్లు పేడ ఎరువును వేయటం, నీరు కట్టటం తప్ప మల్బరీ తోట పెంచేందుకు ఖర్చులేవీ లేవు. మల్బరీ తోట 15 ఏళ్ల వరకు దిగుబడినిస్తుంది. తోట ఆరు నెలలు వయసుకొచ్చాక ఆకు సమృద్ధిగా లభిస్తుండటంతో వంద గుడ్లతో పట్టు పురుగుల పెంపకం ప్రారంభించారు. 2013 అక్టోబర్‌లో మొదటి బ్యాచ్ వచ్చింది.
 
 ఖర్చుకు 8 రెట్లు ఆదాయం..
 సుమారు రూ. 30 వేల వరకు నికరాదాయం పొందాడు. మొదటి బ్యాచ్‌తోనే తాను అనుకున్న ఫలితాన్ని సాధించాడు భార్గవ్. వంద గుడ్లు కొనుగోలు ఖర్చు రూ.  650, షెడ్‌ను రసాయనాలతో కడిగేందుకు రూ. 500, నాలుగో దశలో  ఆకు కోసేందుకు రూ. వెయ్యి, చంద్రికలు నుంచి గూళ్లను తొలగించేందుకు ముగ్గురు కూలీలకు రూ. 450 ఖర్చు కాగా, మార్కెట్‌కు తరలించేందుకు మరో రూ. వెయ్యి ఖర్చయ్యాయి.
 
 మొత్తం రూ. 3,600 ఖర్చు కాగా.. 89 కేజీల పట్టుగూళ్ల దిగుబడి వచ్చింది.  కిలోకు రూ. 360 ధర లభించటంతో రూ. 32,040 ఆదాయం లభించింది. జల్లి (మెత్తపడ్డ) గూళ్లు ఎనిమిది కిలోలు రాగా కిలోకు రూ. 50 ధర లభించింది. మొత్తం రూ. 32,440 ఆదాయానికి గానూ.. ఖర్చులు పోను రూ.  28,800 నికరాదాయం వచ్చింది.  ఇది ఒక్క బాచ్ (29 -32 రోజులు) ఆదాయం మాత్రమే.  ఇప్పటివరకూ 9 బ్యాచ్‌లు వచ్చాయి. ప్రతి బ్యాచ్‌లోనూ రూ. 29 - 32 వేల వరకు ఆదాయంతో  మొత్తం రూ. 2.50 లక్షల వర కూ నికరాదాయం వచ్చింది.
 
 ముందు జాగ్రత్తలతో మేలు
 పట్టు పురుగుల పెంపకంలో ముందు జాగ్రత్త  చర్యలు తీసుకుంటే అంతా సవ్యంగా జరుగుతుందంటున్నారు భార్గవ్. పురుగులు కుబుసం విడిచినప్పుడు, రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు ఫార్మనిక్ పౌడర్ చల్లాలి. విసర్జకాల నుంచి వైరస్ రాకుండా పొడి వాతావరణం కోసం కాల్చిన సున్నం చల్లాలి. పట్టు పురుగులను ప్రతి పూటా నిశితంగా పరిశీలించటం, అంటురోగాలు వ్యాప్తి చెందకుండా షెడ్‌ను రసాయనాలతో కడగటం ద్వారా 90 శాతం నష్టాలను నివారించవచ్చునని చెపుతున్నారు. రోజూ స్వయంగా మేత కోసి వేస్తూ,  పట్టు పురుగులను పరిరక్షిస్తూ, సకాలంలో చర్యలు తీసుకోవటంతో పెద్ద ఇబ్బందులేమీ రాలేదంటున్నారు భార్గవ్.
 
 తామంతా అసాధ్యం అన్నదాన్ని భాస్కర్ తమ కళ్లముందే సాధించటంతో మరికొందరు రైతులు పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టేందుకు ముందుకొస్తున్నా రు. భార్గవ్ స్వంత గ్రామంలో ఆరుగురు, చుట్టు పక్కల గ్రామాల్లో 15 మంది రైతులు వచ్చే తొలకరి నుంచి మల్బరీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు సిద్ధమ వుతున్నారు. వీరందరికీ మల్బరీ మొక్కలు అందించేందుకు భార్గవ్ రెండెకరాల్లో నర్సరీని పెంచుతున్నారు.
 - పన్నాల కమలాకర్ రెడ్డి,
 జగిత్యాల, కరీంనగర్ జిల్లా
 
 పంటల సాగు కన్నా పట్టుపురుగుల పెంపకం మేలు
 ప్రారంభంలోనే షెడ్‌ల నిర్మాణం కోసం పెద్ద మొత్తం ఖర్చు చేయాలి. తర్వాత తక్కువ ఖర్చుతోనే మంచి ఆదాయం పొందవచ్చు. మరో రెండెకరాల్లో మల్బరీ తోటను పెంచి, పట్టు గుడ్ల సంఖ్యను 300కు పెంచటం ద్వారా నెలకు రూ. లక్ష సంపాదించాలనేది ప్రస్తుతం నా లక్ష్యం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పంటల సాగు కన్నా పట్టు పురుగుల పెంపకం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు.  ఉద్యోగం కన్నా పట్టుపురుగుల పెంపకం నాకు ఎక్కువ సంతృప్తినిస్తున్నది. శిక్షణ తీసుకుంటే సత్ఫలితాలు సాధించడం సులభం.
 - పొట్టవర్తిని భార్గవ్(89789 92613), యువ రైతు,
 కన్నాపూర్, జగిత్యాల మండలం, కరీంనగర్ జిల్లా

మరిన్ని వార్తలు