సోయా.. గయా...

6 Oct, 2014 02:22 IST|Sakshi

వేల్పూర్ /బాల్కొండ : తీవ్ర వర్షాభావం, తెగుళ్లు వెరసి సోయాబీన్ పంటను దెబ్బతీశాయి. తక్కువ పెట్టుబడితో సాగుచేసే పంట కావడం వలన ఈ ఖరీఫ్‌లో సోయా సాగు వైపు రైతులు అధికంగా దృష్టిసారించారు. అయితే ఈసారి దిగుబడులు సగానికి తగ్గడంతో కష్టాలే మిగిలేలా ఉన్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు సుమారు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, 2 నుంచి 4 క్వింటాళ్లకు మించి రావడం లేదంటున్నారు. వేల్పూరు, బాల్కొండ మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు సోయాబీన్ పంటను సాగుచేశారు. వారం రోజుల నుంచి సోయా పంట నూర్పిళ్లు చురుగ్గా  చేపడుతున్నారు. కొందరు రైతులు నేరుగా హార్వేస్టర్‌తో నూర్పిడి చేపడుతుండగా, మరికొందరు కోత కోసి కుప్ప వేసి నూర్పిడి చేపడుతున్నారు. ఎకరానికి 2 నుంచి 4 క్వింటాళ్ల కంటే ఎక్కువ పంట దిగుబడి రావడం లేదని రైతులు తెలిపారు.

 విత్తనాల ఖర్చు తడిసి మోపెడు..
 సోయా పంటను జూన్ మాసం చివరలో విత్తుతారు. 100 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి ఎరువులు అవసరం లేకుండా, తక్కువ నీటితో పంటను సాగు చేయవచ్చు. కాని ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లతో దిగుబడి తగ్గి రైతులు కుదేలయ్యారు. తెగుళ్లు, చీడ పీడల వల్ల పెట్టుబడులు తడిసి మోపెడైనట్లు రైతులు తెలిపారు.ఆకుముడత, రసం పీల్చే తెగుళ్లతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి.

పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. మొదట్లో పంటవేసే సమయంలో వర ్షం లేక విత్తనాలు మొలకె త్తలేదు. దాంతో రైతులు రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసి మళ్లీ విత్తారు. రెండుసార్లు విత్తనాలు విత్తాల్సి రావడంతో ఆర్థికంగా వారిపై భారం పడింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితి నెలకొన్నప్పటికీ, అడపా దడపా కురిసిన వర్షాలకు పంట మంచిగానే మొలకెత్తింది. కాని తెగుళ్లు పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ పంటను తెగుళ్లు నాశనం చేశాయి. ఎకరాకు ఎంత లేదన్నా దాదాపు  15 వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు తెలిపారు. పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని వాపోతున్నారు.

 విత్తనాల మాయేనా..!
 సోయా దిగుబడి భారీగా తగ్గడంపై విత్తనాల మాయేనా అంటూ రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సబ్సిడీపై సోయా విత్తనాలు లేవని చివరి వరకు ప్రచారం చేసిన అధికారులు, చివరికి సబ్సిడీపై సోయా విత్తనాలను అందించారు. చివరికి అందించిన విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఒక్కో రైతు రెండు నుంచి మూడు సార్లు విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. వర్షాభావ పరిస్థితుల వల్ల విత్తనాలు మొలకెత్త లేదని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. నీరు పెట్టినా కూడా విత్తనాలు మొలకెత్త లేదని రైతులు అప్పుడే వాదించారు. కాని వారి మాట పట్టించుకునేవారు కరువయ్యారు. తీరా ఇప్పుడు దిగుబడులు తగ్గడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

 ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్..
 తమను ప్రభుత్వం ఆదుకోవాలని సోయా రైతులు డిమాండ్ చేస్తున్నారు. విత్తనాల కొనుగోలుకు ఎకరాకు రూ. 3 నుంచి 5 వేల వరకు ఖర్చు అయ్యిందని, తెగుళ్లు వ్యాపించడం వలన అధికంగా క్రిమిసంహారక మందులు వాడాల్సి వచ్చిందన్నారు.

 దీంతో పెట్టుబడులు పెరిగినట్లు చెప్పారు. కలుపు తీయడం, నీరు పెట్టడం, యంత్రాల ఖర్చు  మొత్తం కలిపితే ఎకరాకు 15 వేల పెట్టుబడి అయిందని రైతులు అంటున్నారు. కాని ప్రస్తుతం దిగుబడి చూస్తే పంట కోసిన యంత్రాలకు కిరాయి చెల్లించేంత డబ్బులు సైతం రాావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి  ఆదుకోవాలని సోయా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
 
 ప్రభుత్వం ఆదుకోవాలి..
 ఈ ఖరీఫ్‌లో సోయాబీన్ సాగు అన్నివిధాలుగా నష్టాలను మిగిల్చింది. పెట్టిన పెట్టుబడులు, రెక్కల కష్టం అంతా వృథా అయ్యింది.తెగుళ్లతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి. పంటకు మార్కెట్‌లో ఎక్కువ ధర లభించినా, పెట్టుబడి ఖర్చులైనా వచ్చేవి. ప్రభుత్వం సోయా రైతులను ఆదుకోవాలి. - బద్ధం హరికిషన్, రైతు వేల్పూర్
 

మరిన్ని వార్తలు