ఆకుపచ్చని సేద్య సౌధం!

15 Aug, 2016 22:49 IST|Sakshi
ఆకుపచ్చని సేద్య సౌధం!

నీటి వనరులు బాగా తక్కువగా ఉన్న చోట అందుకు తగిన చిరుధాన్య పంటలు పండించడం.. రసాయనిక సేద్యానికి బదులు ప్రకృతి వ్యవసాయం చేయడం.. పండించిన చిరుధాన్యాలను అలాగే అమ్మేకంటే అటుకులు చేయించి అమ్మడం.. ఇవన్నీ ఆరుగాలం చెమటను చిందించే రైతన్నకున్న విజ్ఞతకు నిదర్శనాలు. అటువంటి విజ్ఞత కలిగిన రైతు దంపతులు తలమంచి నరసారెడ్డి, శారద. పంట పొలంతో పశువులకు అనుసంధానం చేయడం ద్వారా తమ వ్యవసాయ క్షేత్రాన్ని  కరువు కాలాల్లోనూ సస్యశ్యామలంగా మార్చుకున్న మార్గదర్శకులు ఈ ఆదర్శ రైతు దంపతులు..
 
మామిడి తోటలో చిరుధాన్యాల సాగు..
చిరుధాన్యాల కన్నా అటుకులు తినడం సులభం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో తలమంచి నరసారెడ్డి, శారద దంపతులు 21 ఎకరాల్లో ఆకుపచ్చని ఆశాసౌధాన్ని నిర్మించుకున్నారు. కాంట్రాక్టులు, వివిధ వ్యాపారాల్లో ఆటుపోట్లను చవిచూసిన నరసారెడ్డి పదిహేనేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లోనే నాలుగు ఆవులు, దూడలను తెచ్చి పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు వాటి సంఖ్య ఏభైకి చేరింది. ఆరు ఎద్దులు ఉన్నాయి. సొంత అరకలతోనే దుక్కి పనులు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న దగ్గరి నుంచి వీరి క్షేత్రం పచ్చగా మారిపోయింది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న నరసారెడ్డి, శారద మక్కువతో ప్రకృతి సేద్య జీవనం సాగిస్తున్నారు.  
 
12 ఎకరాల్లో 18 ఏళ్ల నాటి సుమారు 500 మామిడి చెట్లున్నాయి. వాటి మధ్య చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల మిశ్రమ సేద్యం చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదన ద్వారా భూమిని సారవంతం చేస్తున్నారు. కొర్రలు, ఆరికలు, ఒరగలు, వివిధ రకాల జొన్నలు, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని అందిస్తున్నారు. సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని జీవామృతం తయారు చేసి.. మినీ ట్రాక్టర్ ద్వారా పంటలకు అందిస్తున్నారు.
 
ఎకరంలో ఆర్‌ఎన్‌ఆర్15048, మరో ఎకరంలో సోనా మసూరితోపాటు ఇంకో అరెకరంలో నవర రకం సంప్రదాయ వరి వంగడాన్ని సాగు చేస్తున్నారు. సోనామసూరి నాట్లు వేశారు. మిగతా రెండు వరి వంగడాలను వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఏ యే పంటల పెరుగుదల తీరు, దిగుబడి తీరుతెన్నులను నిశితంగా పరిశీలించే నరసారెడ్డి ప్రయోగశీలి. రాగులు ఒక మడిలో ఏక పంటగా సాగు చేస్తూనే, మరో మడిలో నాట్లు వేసే పద్ధతిలో వేశారు.
 
చిరుధాన్య పంటల సాగులో రాలిన విత్తనాలు మొలకెత్తుతుండటంతో వరుసగా 2-3 పంటలు తీస్తున్నారు. ఉదాహరణకు.. 2015 ఖరీఫ్‌లో 2 కిలోల కొర్రలు చల్లారు. అక్టోబర్‌లో పంట నూర్చారు. అదే పొలంలో విత్తనాలు చల్లకుండానే రాలిన కొర్రలే మళ్లీ మొలిచాయి. 2016 జనవరిలో కొర్ర పంట కోశారు. అదే భూమిలో ఏప్రిల్‌లో మళ్లీ కొర్ర పంటను కోశారు. బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేశారు. రోజుకు 40 కిలోల పేడ నీటిని పోస్తూ ఉంటారు. గ్యాస్‌ను వంటకు వాడుకోవడంతోపాటు 25 హెచ్‌పి డీజిల్ ఇంజిన్‌ను పాక్షికంగా గోబర్ గ్యాస్‌తో నడుపుతున్నారు.

భూగర్భ జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతం అది. వర్షాలు కూడా తక్కువే. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం జియాలజిస్టును తీసుకొచ్చి బోర్లు ఎక్కడ వేయాలో చెప్పమన్నారు. ఆయన పొలమంతా కలియదిరిగి ఇక్కడ బోరు వేసినా నీటి చుక్క పడదు. సాగు మానెయ్యడం మేలని చెప్పి వచ్చిన దారినే వెళ్లిపోయాడు.
 అయితే, నరసారెడ్డి పొలం మధ్యలో నుంచి వెళ్తున్న చిన్న వాగుపై చెక్ డ్యాం నిర్మించి.. వాననీటిని ఒడిసిపడుతున్నారు. చెక్‌డ్యాం వద్దే బోరు వేశారు.

ఒక బోరు రెండించుల నీరు పోస్తోంది. మరోచోట కూడా బోరు వేస్తే కొద్దిగా నీరు వస్తోంది. పరిమిత నీటి వనరులతోనే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం.
 అనేక అవరోధాలను అధిగమించి సాగు చేసే చిరుధాన్యాలను హైదరాబాద్‌లో మిల్లుకు తీసుకెళ్లి అటుకులు పట్టించి, ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నారు. చిరుధాన్యాలు తినడం అలవాటు లేని వారు సైతం ఈ అటుకులను సులభంగా తినగలుగుతున్నారని, తమకు మంచి ఆదాయంతో పాటు చిరుధాన్యాల వాడకాన్ని పెంచుతున్నందుకు ఆనందంగా ఉందని నరసారెడ్డి, శారద తెలిపారు.

తాము కూడా చిరుధాన్యాల అటుకులు, రాగి ముద్ద తింటున్నామన్నారు. ధాన్యాన్ని ముడిబియ్యం పట్టించి అమ్ముతున్నారు. తద్వారా రెట్టింపు ఆదాయం పొందుతున్నామని తెలిపారు. ఆవులతోపాటు కొన్ని గొర్రెలు, మేకలు, కోళ్లను సైతం పెంచుతున్నారు. పశువుల పేడ, మూత్రాన్ని వ్యవసాయానికి వాడుకుంటూనే అధికాదాయం పొందుతున్నారు. అన్నిటికన్నా మిన్నగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకుని తింటూ.. నలుగురికీ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తున్న నరసారెడ్డి, శారద (98480 25089) దంపతుల కృషి ప్రశంసనీయం.
- సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు