ఆత్మహత్యలను ఆపేది ప్రకృతి సేద్యమే!

25 Feb, 2015 22:57 IST|Sakshi
ఆత్మహత్యలను ఆపేది ప్రకృతి సేద్యమే!

పరిహారం పెంపుకంటే అప్పులపాలు కాకుండా చూడటం ముఖ్యం
‘సాక్షి’తో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్

 
ఆరుగాలం కష్టించి.. చెమట ధారలతో నేలను తడిపి.. సమాజం ఆకలి తీర్చుతున్న అన్నదాతలు అసలైతే సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అయితే,  వాస్తవం మరోలా ఉంది. ఎడతెగని అప్పుల ఊబిలో కూరుకుపోయి  దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యల  పాలవుతున్నారు. ప్రభుత్వ పథకాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు,  అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు.. ఇవేవీ రైతు ప్రాణాలను నిలబెట్టలేకపోతున్నాయి.. సకల వృత్తులకు తల్లి అయిన సంక్షుభిత  వ్యవసాయానికి కాయకల్ప చికిత్స చేసి.. రైతులోకానికి తిరిగి జవజీవాలనివ్వటం అసలు సాధ్యమేనా? విష రసాయనిక అవశేషాలతో, పర్యావరణ కాలుష్యంతో జాతి యావత్తునూ రోగగ్రస్తంగా మార్చిన పారిశ్రామిక సేద్య పద్ధతిని ఉన్నట్టుండి మార్చడం సాధ్యమేనా?? సాధ్యమైతే ఎలా??? ఈ ప్రశ్నలన్నిటికీ ఉన్న ఏకైక శాశ్వత పరిష్కారం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో తప్ప మరెక్కడా లేదంటున్నారు సుభాష్ పాలేకర్. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడైన పాలేకర్ ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
మహారాష్ట్ర కరువు ప్రాంతం విదర్భలో రైతు కుటుంబంలో పుట్టిన పాలేకర్ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నారు. రసాయనిక సేద్యం కొనసాగించే క్రమంలో ఎదురుదెబ్బలు తిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్- జెడ్‌బీఎన్‌ఎఫ్) పద్ధతిని రూపొందించి.. 16 ఏళ్లుగా దేశాటన చేస్తూ రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కర్నూలులో ఈ నెల 25న(ఎస్‌ఎల్‌ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు) ప్రారంభమయ్యే 5 రోజుల రైతు శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వెళ్తూ హైదరాబాద్ వచ్చిన పాలేకర్‌తో ముఖాముఖిలో ముఖ్యాంశాలు...

{పకృతి సేద్యం అవసరమేమిటి?

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రసాయనిక వ్యవసాయ విధానం వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, శిలీంద్ర నాశనులు.. అన్నిటినీ అధిక ధరలకు కొనుగోలు చేసి పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. మార్కెట్ మాయాజాలంలో బలిపశువు అవుతున్న రైతు ఎడాపెడా దోపిడీకి గురవుతూ నిరంతరం అప్పుల పాలవుతున్నారు. దారీతెన్నూ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 7 లక్షల మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలే రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి. కేన్సర్, మధుమేహం వంటి అనేక దారుణమైన వ్యాధులు విజృంభించడానికీ రసాయనిక వ్యవసాయమే మూలకారణం.

అదెలా?

రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు, నైట్రేట్లు పోగుపడిన ఆహారోత్పత్తులను తిన్న మనుషులు రోగగ్రస్తులవుతున్నారు. ఈ ఆహారంలో సూక్ష్మపోషకాలతోపాటు ఔషధ విలువలు లోపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ఆహారంలో పోషకాలతోపాటు ఔషధ విలువలు ఉంటాయి. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంతో ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నాయి. గతంలో ఎరుగని స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి మొండి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. గత మూడేళ్లుగా రుతుపవనాల టైమ్‌టేబుల్ మారటం వల్ల ఖరీఫ్, రబీ పంటల సాగు నెల రోజులు ఆలస్యమవుతోంది. కరువు ప్రాంతాల్లో అధిక వర్షం, వర్షాలు బాగా పడే చోట కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనంతటికీ పరిశ్రమలతోపాటు రసాయనిక సేద్యంతో ఏర్పడే వాయుకాలుష్యమే కారణం. రైతును దోపిడీ నుంచి, వినియోగదారులను విషతుల్యమైన ఆహారం నుంచి రక్షించాలంటే ప్రకృతి సేద్యమే పరిష్కారం.

ప్రకృతి సేద్యంలో మొదటి ఏడాది సరైన దిగుబడి రాదన్న ప్రచారం ఉంది..?

ఇది కొంతమంది చేస్తున్న దుష్ర్పచారం. వెయిటింగ్ పీరియడ్ లేదు. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలన్నిటినీ పూర్తిగా పాటిస్తే మొదటి ఏడాది కూడా దిగుబడి అంతకుముందుకన్నా ఏమాత్రం తగ్గదు.  

వేలాది మంది రైతులకు శిక్షణ ఇస్తున్నారు కదా.. రైతుల స్పందన ఎలా ఉంది?

1998 నుంచి దక్షిణాదిలో, మూడేళ్లుగా ఉత్తరాదిలోనూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై రైతులకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాం. దేశంలో 40 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ విషపూరితం కాని అమృతాహారాన్ని ప్రజలకు అందిస్తూ సంతోషంగా ఉన్నారు. వీరిలో శిక్షణ పొందిన వారు కొందరే. పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్నవారు కొందరు, పక్కరైతుల పొలాలను చూసి నేర్చుకుని ప్రకృతి సేద్యం చేస్తున్న వారు మరికొందరు. ఆధ్యాత్మిక స్వభావం కలిగిన రైతులు వెంటనే ఈ పద్ధతిలోకి మారుతున్నారు. శిబిరాలకు యువ రైతులు ఎక్కువగా వస్తున్నారు. వీరిలో కనీసం సగం మంది ప్రకృతి సేద్యం చేపడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపిస్తోంది కదా..?

అవును. తెలంగాణ వ్యవసాయ మంత్రి, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకుడు తదితర శాస్త్రవేత్తలు ఒకరోజు శిబిరంలో పాల్గొన్నారు. ప్రశ్నలడిగారు. ఈ పద్ధతిలో సాగవుతున్న పంటలు చూశారు. కానీ, తర్వాత మళ్లీ ఎటువంటి స్పందనా లేదు.

{పకృతి సేద్యాన్ని ప్రభుత్వ విధానంగా ప్రకటిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా?

తప్పకుండా. రైతులు విత్తనాలు, ఎరువుల దగ్గర్నుంచీ అన్నీ కొంటున్నారు. తీరా పంట అమ్మబోతే ధర గిట్టుబాటు కావటం లేదు. ప్రకృతి వ్యవసాయంలో దేన్నీ కొనే పని లేదు. ఒక దేశీ ఆవుతో 30 ఎకరాల్లో సేద్యం అన్ని రకాల దోపిడీల నుంచి రైతులను పూర్తిగా రక్షించడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతుల్లో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోకపోవటమే ఇందుకు నిదర్శనం. పోషకాలు, ఔషధ విలువలతో కూడిన అమృతాహారాన్ని పండిస్తున్న ఈరైతులకు వినియోగదారులు సంతోషంగా రెట్టింపు ధర ఇస్తున్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు మార్కెటింగ్ సమస్య లేదు. అప్పుల అవసరం లేదు కాబట్టి పంటను తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ధర వచ్చినప్పుడే అమ్ముకుంటారు. జన్యుమార్పిడి విత్తనాల అవసరం లేదు. స్థానిక విత్తనాలతోనే అధిక దిగుబడి వస్తోంది. అవి కొనాల్సిన ఖర్చుండదు.  వరకట్నాలు, ఆర్భాటపు పెళ్లిళ్లకు మేం దూరంగా ఉంటాం. మా ఇద్దరు అబ్బాయిల పెళ్లి సందర్భంగా మేం డబ్బు, బంగారం కూడా తీసుకోలేదు. కాబట్టి అప్పులు చేయాల్సిన పని లేదు. వలస పోవాల్సిన అగత్యం లేదు. ప్రకృతి వ్యవసాయంలో 10 శాతం విద్యుత్, 10 శాతం నీరు సరిపోతాయి. ప్రకృతి వనరుల విధ్వంసం ఆగి భూతాపం తగ్గుతుంది.

సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కదా?

సేంద్రియ సేద్యం రసాయనిక సేద్యం కన్నా ప్రమాదకరం. కంపోస్టు, వర్మీకంపోస్టు, పశువుల ఎరువులో 46% సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని పొలంలో వేసిన తర్వాత 28 డిగ్రీల సెల్షియస్‌కన్నా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సేంద్రియ కర్బనం విడుదలై.. కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. సేంద్రియ రైతులకు రసాయనిక సేద్యంలో కన్నా ఎక్కువ ఖర్చవుతోంది. ప్రకృతి వ్యవసాయంలో ఈ సమస్యల్లేవు. సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి రుజువు చేసి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. మీ అభిప్రాయం?

ఇది చాలా ప్రమాదకరం. రైతుల అప్పుల బాధను ఈ చర్య శాశ్వతంగా తీర్చలేదు. అప్పుల్లో కూరుకుపోయిన రైతుల మదిలో అలాగైనా పిల్ల పెళ్లి అవుతుందన్న భావన కలిగించే ప్రమాదం ఉంది. అంతిమంగా ఈ చర్య ఆత్మహత్యలకు దోహదం చేసే ప్రమాదం ఉంది. అప్పులు అవసరం లేని ప్రకృతి సేద్యపద్ధతిని అలవాటు చేయడమే వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం.    
 
సంక్షోభాన్ని పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు  పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా.
 

మరిన్ని వార్తలు