చదువుల తల్లి ఒడిలో ఇంటిపంటల కొలువు!

17 Dec, 2014 22:51 IST|Sakshi
చదువుల తల్లి ఒడిలో ఇంటిపంటల కొలువు!

ఏడాది పొడవునా ఇంటిపంటలతోనే కూరలు... వెయ్యి చదరపు గజాల
కిచెన్ గార్డెన్‌తో 3 కుటుంబాలకు పూర్తిస్థాయిలో కూరగాయలు
ఇంటి నుంచి బడికి పాకిన ఇంటిపంటలు.. స్కూలు విద్యార్థులకూ శిక్షణ

 
పచ్చని ఆకుకూరలు, కూరగాయ మొక్కలు నిండుగా కొలువుదీరిన ఇంటిపంటల దర్బారు ఆ రెండంతస్తుల మేడ పైకప్పు. ఆకుపచ్చని జీవన శైలిని నెత్తికెత్తుకున్న ఆ కుటుంబం ఏడాది పొడవునా స్వచ్ఛమైన, తాజా ఇంటిపంట దిగుబడులపైనే ఆధారపడుతూ నగరవాసులకు ఆదర్శంగా నిలుస్తోంది. ముచ్చటగొలిపే ఇంటిపంటల సాగును స్కూలు విద్యార్థులకూ నేర్పిస్తుండడం విశేషం. ‘రసాయనాలతో విషతుల్యం కాని సహజ ఇంటిపంటలను ఇక మీరూ పండించుకోండ’ంటూ వారి కిచెన్ గార్డెన్ చూపరుల మదిలో ఆకుపచ్చని ఆలోచనను మొలకెత్తిస్తున్నాయి!
 
ఆరోగ్యదాయకమైన జీవనశైలికి సేంద్రియ ఇంటిపంటల సాగును జోడించినప్పుడే పరిపూర్ణత చేకూరుతుందని ఆచరణాత్మకంగా చాటి చెబుతోంది హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు చెందిన దుబ్బాక దయాకర్‌రెడ్డి కుటుంబం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరెడలో పుట్టిన దయాకర్‌రెడ్డి నగరానికి వచ్చిన కొత్తల్లో ఆల్విన్‌లో కొంతకాలం పనిచేశారు. ప్రగతినగర్ రూపశిల్పుల్లో ఒకరైన ఆయన స్థానిక ఎంపీటీసీగా, ప్రగతి సెంట్రల్ స్కూల్‌కు కరస్పాండెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.   

దృఢమైన సంకల్పం, ఆరోగ్యంపై శ్రద్ధ మెండుగా ఉంటే.. మహానగరంలో నివాసం ఉంటూ కూడా.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా ఇంటిపట్టునే పండించుకోవచ్చని దయాకర్‌రెడ్డి కుటుంబం రుజువు చేస్తోంది. మేడపైన వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇంటిపంటలు పండిస్తున్నారు. ఇటుకలతో నిర్మించిన 8 బెడ్స్, గుండ్రటి సిల్పాలిన్ బెడ్లు పది, వందకుపైగా పెయింట్ డబ్బాలూ వాడుతున్నారు. 8 రకాల ఆకుకూరలు, 6 రకాల కూరగాయలు, బీర, సొర, కీరతోపాటు బీట్‌రూట్, క్యారట్ కూడా పండిస్తున్నారు. టై మొత్తానికీ 8 అడుగుల ఎత్తులో అమర్చిన ఇనుప ఫ్రేమ్‌కు సొర, బీర తీగలను పాకిస్తున్నారు. ఎండాకాలంలో షేడ్‌నెట్ వేయడానికి, కోతుల నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతోంది. ఎర్రమట్టి 40% + కొబ్బరి పొట్టు 40% + పశువుల ఎరువు 20% కలిపిన మట్టిమిశ్రమాన్ని వాడుతున్నారు. తగినంత నీరు పోయడం తప్ప వేటినీ పిచికారీ చేయడం లేదని, జీవామృతం వాడదామని అనుకుంటున్నామని దయాకర్‌రెడ్డి తెలిపారు. దయాకర్‌రెడ్డి భార్య అరుణ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కుమారుడు డా. రాహుల్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నారు. తీరిక వేళల్లో ఇంటిపంటల పనులతో రిలాక్స్ అవడం కుటుంబ సభ్యులందరికీ ఎంతిష్టమో మొక్కల పచ్చదనమే చాటిచెబుతోంది.  
 
 - పంతంగి రాంబాబు
 ఫొటోలు: మిరియాల వీరాంజనేయులు
 
ఏడాది పొడవునా ఇంటి కూరలే!

మా టై కిచెన్ గార్డెన్‌లో అన్ని కాలాల్లోనూ పూర్తిగా ఆధారపడదగిన రీతిలో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం. 3 చిన్న కుటుంబాలకు పూర్తిస్థాయిలో, మరో కుటుంబానికి పాక్షికంగా సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు అందుతున్నాయి. ఎండాకాలంలోనూ 2 కుటుంబాలకు అందాయి. చాలా మంది బంధుమిత్రులు చూసి వెళ్తున్నారు. నలుగురైదుగురు తమ ఇళ్లపైన సాగు చేస్తున్నారు. ఇటుకలతో పక్కా బెడ్స్ నిర్మించటం కన్నా.. అటూ ఇటూ మార్చుకోవడానికి వీలయ్యే సిల్పాలిన్ బెడ్సే ఉపయోగకరం. ఆరోగ్యదాయకమైన ఇంటిపంటల సాగును మా స్కూల్ విద్యార్థులకూ నేర్పిస్తున్నాం.
 - దుబ్బాక దయాకర్‌రెడ్డి (93910 08248), ప్రగతినగర్, హైదరాబాద్
 

>
మరిన్ని వార్తలు