ప్రకృతి సేద్యంలో మా‘స్టారు’!

15 Nov, 2016 03:44 IST|Sakshi
ప్రకృతి సేద్యంలో మా‘స్టారు’!

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ప్రకృతి సేద్యం  ఐదెకరాల్లో వరి సాగు
 ఆయనో స్కూల్ మాస్టార్. బడిలో పాఠాలతో పాటు సేద్యంపై ఉన్న ప్రేమ ఆయన్ను పొలం బాట పట్టేలా చేసింది. బస్తాల కొద్దీ రసాయన ఎరువులు, డబ్బాల కొద్ది పురుగుమందులతో చేసిన సేద్యం చివరకు అప్పులనే మిగిల్చింది. శ్రమే తప్ప రూపాయి ఆదాయం వచ్చింది లేదు. ఇంక వ్యవసాయం మానేద్దామని నిశ్చయించుకున్న  పరిస్థితుల్లో సుభాష్ పాలేకర్ శిక్షణకు హాజరవ్వటంతో ఆయన పంట పండింది. ఆ స్కూల్ మాస్టార్ వేముల ప్రభాకర్ రెడ్డి(98667 87125). జగిత్యాల జిల్లా  ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామం.

ప్రభాకర్ రెడ్డి బీఏ, బీఈడీ చదివారు. వ్యవసాయంపై ఉన్న శ్రద్దతో డిగ్రీ చదివే వయస్సులోనే కౌలు సేద్యం చేసేవారు. 1998లో టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వ్యవసాయంపై ఆసక్తి తగ్గలేదు.  వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమిలో మామిడి తోట సాగు చేసేవారు. గుట్టలు, రాళ్లతో ఉన్న మరో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దారు. పది ఎకరాల్లో వరి పొలం సాగు చేసేవారు. రసాయన సేద్యంలో ఎన్ని మందుకట్టలేసినా పంట దిగుబడి అంతంతమాత్రంగా ఉండేది.  ఏనాడూ పెద్దగా లాభపడింది లేదు. ఖర్చులు తిరిగిరాక పోగా జీతం డబ్బులు ఖర్చయ్యేవి. దీనికి తోడు, సక్కగా టీచర్ ఉద్యోగం చేసుకోక, వ్యవసాయం చేస్తున్నవా..అని గ్రామంలోని రైతులు దెప్పిపొడిచేవారు.

‘సాగుబడి’ కథనాల స్ఫూర్తితో...
ఇక వ్యవసాయం లాభం లేదనుకుని మానేద్దామనుకున్న తరుణంలో సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, శిక్షణకు హాజరయ్యారు.  దీనికి తోడు సాక్షి దినపత్రిక ‘సాగుబడి’లో వచ్చే కథనాలను చదవడం ప్రారంభించారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రకృతి సేద్యంలో ఐదెకరాల్లో జై శ్రీరాం రకాన్ని సాగు చేశారు. బీజామృతంతో విత్తన శుద్ది చేశారు. చివరి దుక్కిలో ఎకరానికి రెండు క్వింటాళ్ల ఘన జీవామృతాన్ని వేశారు. నీటిద్వారా పదిరోజులకోసారి జీవామృతాన్ని అందించారు. నెల రోజులకు క్వింటా ఘన జీవామృతాన్ని పొలంలో చల్లారు.

చీడపీడల నివారణకు ముందు జాగ్రత్తగా దశపత్ర కషాయాన్ని లీటరుకు 10 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేశారు. నాట్లు, జీవామృతం తయారీ, కలుపు కూలీలకు ఎకరాకు రూ. 9 వేలు మాత్రమే ఖర్చయింది. మరో 15 రోజుల్లో పంట నూర్పిడి చేయనున్నారు. 22-23 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని ప్రభాకర్ రెడ్డి ఆశిస్తున్నారు. - పన్నాల కమలాకర్‌రెడ్డి, జగిత్యాల, సాక్షి
 
రైతుదే పైచేయి కావాలి..!
రసాయన ఎరువులు, పురుగుమందులు లేని ఉత్పత్తులను పండించాలనేది నా ఆశయం. అలాగే పంట కొనేందుకు వినియోగదారులు, వ్యాపారులు రైతు దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలి. రైతుదే పైచేయి కావాలి. అది ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. పండించిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మార్చి నేరుగా వినియోగదారులకే విక్రయిస్తా.
 - వేముల ప్రభాకర్‌రెడ్డి (98667 87125), తీగల ధర్మారం, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా
 
20న ప్రకృతి వ్యవసాయంలో పత్తి, మిరప సస్యరక్షణపై శిక్షణ

ప్రకృతి వ్యవసాయంలో పత్తి, మిరప పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణ పద్ధతులపై రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 20న శిక్షణ కార్యక్రమం జరగనుంది. మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రకృతి వ్యవసాయదారులు లావణ్య రెడ్డి, నార్నె హనుమంతరావు రైతులకు శిక్షణ ఇస్తారు. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర గల కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రంలో ఉదయం 9:30 నుంచి శిక్షణ ఉంటుంది. పేర్ల నమోదు కోసం 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు