ఉద్యాన పంటల సాగులో మెలకువలు

21 Aug, 2014 01:42 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్):  వర్షాభావ పరిస్థితులు జిల్లాలో ఉద్యాన పంటలను దెబ్బతీస్తున్నాయి. వాతావరణ మార్పులతో చీడపీడల ఉద్ధృతి ఎక్కువ కనిపిస్తోంది. ఆగస్టు నెలలో ఈ పంటలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ.. వెంకట్రామన్న గూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం శాస్త్రవేత్తలు ప్రత్యేక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక వివరాలను ఉద్యాన శాఖ కర్నూలు-1 ఏడీ సాజా నాయక్(8374449061) సాక్షికి తెలిపారు. వీటిని పాటిస్తే చీడ పీడలను సమర్థంగా నివారించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.

జిల్లాలో ఉల్లి, టమాట.. ఇతర కూరగాయల పంటలు వర్షాభావంతో బెట్టకు గురవుతున్నాయి. బెట్టను తట్టుకునేందుకు యూరియా లేదా డీఏపీ లేదా 19.19.19 లేదా 17.17.17 ఎరువును లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.

మామిడి పూత బాగా రావాలంటే ఈ నెలలో చెట్లకు నీరు పెట్టాలి. ఎండు కొమ్మలు ఉంటే వాటిని తీసివేసి బోరోపేస్ట్ మందును పూస్తే ఎండు కిందకు దిగదు.

అరటి తోటల్లో కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తల్లి మొక్క చుట్టూ ఉన్న పిలకలను ఎప్పటికప్పుడు కోసివేయాలి. ఆకు మచ్చ తెగులు గమనించినట్లయితే ప్రొపికొనజోల్ లీటరు నీటికి 1 ఎంఎల్, 0.5 ఎంఎల్ జిగురును కలిపి 20 రోజుల వ్యవధిలో 2 నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. తెల్ల చక్కరకేళి రకానికి రెండో దఫా ఎరువులు వేయాలి.

జిల్లాలో క్రిష్ణగిరి, తుగ్గలి, డోన్ ప్రాంతాల్లో నిమ్మ తోటలు అధికంగా ఉన్నాయి. వీటిలో అంతర పంటలుగా అలసంద, గోరు చిక్కుడు, మినుములు, పెసర వేసుకోవచ్చు. తోటల్లో ఎండు మొక్కలను కత్తరించి ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లేత ఆకులపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  పచ్చిరొట్ట పైర్లను 50 శాతం పూత దశలో భూమిలో కలియదున్నాలి. గానోడెర్మా తెగులు నివారణకు 2 ఎంఎల్ ట్రైడిమార్ఫ్ మందును ఒక లీటరు నీటికి కలిపి పాదులను తడపాలి. బంక తెగులు నివారణకు ఒక గ్రాము కార్బన్‌డజిమ్ మందును లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.

సపోటలో ఆకు గూడు, మొగ్గ తొలిచే, గింజ తొలిచే పురుగులు ఉన్నాయి. వీటి నివారణకు 2.5 ఎంఎల్ క్లోరోఫైరిపాస్ లేదా 2 ఎంఎల్ మోనోక్రోటోపాస్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

దానిమ్మ తోటల్లో అంతర కృషి చేయాలి. చెట్ల పాదుల్లో తవ్వకం చేసి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

మరిన్ని వార్తలు