ఆ ఇల్లు పంటల పెన్నిధి!

7 Jun, 2016 00:06 IST|Sakshi
ఆ ఇల్లు పంటల పెన్నిధి!

- నెలకు సరిపడా కూరగాయల సాగు.. పండ్లు కూడా..
- మేడపైనే నాటు కోళ్ల పెంపకం.. సేంద్రియ గుడ్ల ఉత్పత్తి
 
 ప్రకృతి వ్యవసాయం మనుషుల మనస్సుల్లో మానవీయ విలువలను ఇనుమడింపజేస్తుందని మనసా వాచా కర్మణా నమ్మిన వ్యక్తి ఆయన. పంట పొలాల్లో కాయకష్టం చేసే అన్నదాతలతో సహానుభూతి చెందుతూ.. తన ఇంటిపైనే సేంద్రియ పంటలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తుమ్మేటి రఘోత్తమ్‌రెడ్డి.
 
 రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం, నారపల్లి ఆయన స్వగ్రామం. నలుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను పూర్తిగా, నెలలో 10 రోజులకు సరిపడా పండ్లను ఇంటిపంటల ద్వారానే పొందుతుండటం విశేషం. గోదావరి ఖనిలో బొగ్గుగని కార్మికుడిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని 2009లో నారపల్లిలో స్వంత ఇంటిని నిర్మించుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇంటిపైనే 200కు పైగా కుండీల్లో టమాట, వంకాయ, క్యాబేజీ, ఉల్లి, దొండ, మిరప, మునగ, చేమగడ్డ వంటి కాయగూరలు.. కరివేపాకు, పుదీనా, తోటకూర, బచ్చలి, గంగవాయిలి,  కాలిఫ్లవర్ వంటి ఆకుకూరలు.. నేతిబీర, దోస, దొండ, బీర, కాకర వంటి తీగజాతి కూరలు... సీతాఫలం, రామా ఫలం, అల్లనేరేడు, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, పంపర, పనస, సపోటా, బొప్పాయి, మామిడి వంటి పండ్ల మొక్కలు.. ములకబంతి, నిత్యవరహాలు, చంద్రకాంతలు వంటి పలు రకాల పూల మొక్కలను  పెంచుతున్నారు.

 మట్టి, సిమెంటు కుండీలను, ప్లాస్టిక్ డబ్బాలను మొక్కలు పెంచేందుకు వాడుతున్నారు. రెండుపాళ్లు ఎర్రమన్ను, ఒక పాలు పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని మొక్కలను పెంచేందుకు వాడుతున్నారు. పశువులు, మేకలు, కోళ్ల పెంటను ఎరువులుగా వాడుతున్నారు. ఆర్నెల్లకోసారి మొక్కపాదుల్లో మూడంగుళాల లోతు మట్టిని తీసివేసి పిడికెడు పేడ ఎరువు, వేపపిండి వేస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరందిస్తారు. మొక్కలను ఆశించే వేరుపురుగు, తెల్లచీమలు వంటి  చీడపీడలను  తొలిదశలోనే గుర్తించి చేతితో ఏరిపారేస్తారు. ఉధృతి ఎక్కువగా ఉంటే  లీటరు నీటికి 5 ఎం. ఎల్. వేపనూనెను కలిపి మొక్కలపై పిచికారీ చేసి   నివారిస్తున్నారు. రఘోత్తమ్‌రెడ్డి ఇంటిపంటల నుంచే విత్తనాలను తయారు చేసుకుంటున్నారు. వీటితో పాటు ఆరు నాటు కోళ్లను పెంచుతూ.. నెలకు సరిపడా గుడ్లను పొందుతున్నారు. కోళ్ల పెంటను ఇంటిపంటల కు ఎరువుగా వాడుతున్నారు. వీటి మేత కోసం కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యపు పంటలను ఇంటిపంటల్లో పెంచుతుండటం విశేషం. ‘ఇంటిపంటల పెంపకం వల్ల శారీరక వ్యాయామంతో పాటు ప్రకృతి ఒడిలో జీవిస్తున్న భావన కలుగుతుంది. ఇది అనుభవిస్తేనే గానీ తెలియని ఆనందం’ అంటారు ప్రసిద్ధ రచయిత కూడా అయిన రఘోత్తమ్‌రెడ్డి.
 - డి. వి. రామకృష్ణారావు, వ్యవసాయ శాస్త్రవేత్త, హైదరాబాద్
 
 ఆరేళ్ల నుంచి కూరగాయలు కొనలేదు!
 ఆరేళ్ల క్రితం మేడపైన ఇంటిపంటల పెంపకం ప్రారంభించా. బీమ్‌ల పైనే ఎత్తు మడులను ఏర్పాటు చేశాను. మేడపై బరువు పెరుగుతుందన్న భయపడనక్కర్లేదు. కూరగాయల సాగులో రైతులు పురుగుమందులు విపరీతంగా వాడుతున్నారు. అందుకే పట్టుబట్టి టై గార్డెన్ ఏర్పాటు చేసుకున్నా. విష రహిత తాజా కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నా. గడచిన ఆరేళ్లలో కూరగాయలు కొనలేదు. ఇల్లున్న వారంతా ఇంటిపంటలు పండించుకోవాలి.    
 - తుమ్మేటి రఘోత్తమ్‌రెడ్డి (90001 84107), నారపల్లి, ఘట్‌కేసర్ మం., రంగారెడ్డి

మరిన్ని వార్తలు