విద్యాశ్రమంలో సేంద్రియ పంటల సాగు!

29 Sep, 2015 07:51 IST|Sakshi
విద్యాశ్రమంలో సేంద్రియ పంటల సాగు!

ఆకట్టుకుంటున్న పొడుగు ఎర్ర బెండకాయలు
 
 పుస్తక జ్ఞానంతోపాటు సేంద్రియ సేద్యాన్నీ శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు హడ్డుబంగి (సీతంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా) గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు. చదువులతోపాటు సేంద్రియ ఇంటిపంటల సాగునూ వాళ్లు సీరియస్‌గా తీసుకున్నారు. తమకు అనుదినం అవసరమైన కూరగాయలు, ఆకుకూరల్లో 80% వరకు తమ పాఠశాల ఆవరణలోనే స్వయంగా పండించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి వరకు చదివే 604 మంది విద్యార్థినులున్నారు. సేద్యంపై ఆసక్తి ఉన్న విద్యార్థినులు బృందాలుగా ఏర్పడి తోట పనులు చేస్తున్నారు.

పాఠశాల ఆవరణలోని ఎకరా స్థలంలో ప్రధానోపాధ్యాయురాలు ఎ.లిల్లీరాణి మార్గదర్శకత్వంలో ఆకుకూరలు, వంగ, బెండ, ఆనప, కాకర, చిక్కుడు, పుదీన వంటి కూరగాయలను బోరు నీటితో పండిస్తున్నారు. పశువుల ఎరువు (గెత్తం) మాత్రమే వాడుతున్నారు. పండించిన కూరగాయలను పాఠశాల వార్డెన్‌కే విక్రయించి, ఆ డబ్బును పాఠశాల కోసం వినియోగిస్తున్నారు. ఇటీవల రూ. 16 వేలతో విద్యార్థినులు ఫర్నిచర్‌ను కొనుగోలు చేశారు. కేరళ నుంచి తెప్పించిన విత్తనాలతో సాగు చేసిన పొడవు ఎర్ర బెండకాయలు చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. మూర పొడవున్న ఈ బెండకాయలు మొక్కకు 40 నుంచి 60 వరకు కాస్తున్నాయని, కూర రుచిగా ఉందని ఎస్.పి.ఎల్. శిరీష తెలిపింది. పోషక విలువలతో కూడిన సేంద్రియ కూరగాయలను పండించుకోవడం ఆరోగ్యంతోపాటు సంతృప్తినీ ఇస్తోందని హెచ్. ఎం. లిల్లీరాణి (94411 59716) అన్నారు.
 - బోనుమద్ది కొండలరావు, సీతంపేట, శ్రీకాకుళం జిల్లా

Read latest Vanta-panta News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా