‘అన్నపూర్ణ’ బాటలో..ఏరువాక సాగారో..!

4 Jun, 2014 22:18 IST|Sakshi
‘అన్నపూర్ణ’ బాటలో..ఏరువాక సాగారో..!

చిన్న కమతం.. పెద్ద భరోసాఅరెకరంలో ప్రకృతి వ్యవసాయంతో

చిన్న రైతులకు అనుదినం ఆహార భద్రత
3 రోజులపాటు స్వచ్ఛంద సంస్థల ఉచిత శిక్షణ
కాల్‌సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు
  ‘జట్టు’ తోడ్పాటు.. ‘సాగుబడి’ చోదోడు..

 
 నేల తల్లిని నిత్యం చెమట చుక్కలతో ముద్దాడే రైతన్నే జాతికి వెన్నెముక. కానీ, రెండెకరాల సొంత భూమి ఉన్న రైతు కుటుంబాలకు కూడా మూడు పూటలా కడుపు నిండే పరిస్థితి లేదు. రసాయనిక వ్యవసాయ పద్ధతిని అనుసరించడంతో సాగు వ్యయం తడిసి మోపెడవుతుంటే.. ఇక రైతుకు మిగిలేదేముంది రెక్కల కష్టం తప్ప! అరెకరంలో ప్రకృతి వ్యవసా యం తో ఈ సంక్షోభాన్ని పారదోలవచ్చని బడుగు రైతులు రుజువు చేస్తున్నారు. ‘అన్నపూర్ణ’ పంటల నమూనా ద్వారా జట్టు ట్రస్టు వీరికి  వెలుగుబాట చూపుతోంది. పలువురు ప్రకృతి వ్యవసాయ దిగ్గజాల బోధనలను రంగరించి, సులభసాధ్యమయ్యేలా, వాతావరణ మార్పులను తట్టుకునేలా ఈ పంటల నమూనాను రూపొందించడం విశేషం.  
 
 అన్నపూర్ణ పంటల నమూనా అనుసరించే రైతులు.. అరెకరం స్థలంలోనే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, ధాన్యాలు, పండ్ల చెట్లను కలిపి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయవచ్చు. ఆ కుటుంబానికి ఏడాది పొడవునా సంపూర్ణ ఆహార భద్రతతోపాటు రసాయనిక అవశేషాల్లేని సహజాహారం లభిస్తుంది.
 
 ప్రకృతి వ్యవసాయానికి ‘సాగుబడి’ తోడ్పాటు
 ఈ భూమిపుత్రుల విజయగాథను ‘అరెకరం అక్షయపాత్ర’ శీర్షికన ‘సాక్షి’(ఫిబ్రవరి 3, 2014, ‘సాగుబడి’) ఎలుగెత్తి చాటింది. అప్పటి నుంచీ ఈ చిన్న రైతుల పొలాలకు సందర్శకులు పోటెత్తుతున్నారు. రైతులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం ఈ పంటలను సందర్శిస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికే శిక్షణ పొంది, ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రకృతి సేద్యానికి ఉపక్రమి స్తుండడం శుభపరిణామం.

కొన్ని ఎకరాల భూమి ఉండి, అందులో వాణిజ్య దృష్టితో ఏకపంటలు పండించే రైతులు కూడా.. తొలుత తమ కుటుంబ అవసరాల కోసం ఈ నమూనాను అనుసరించి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించ వచ్చు. సేద్యమనే మహా యజ్ఞంలో ఈ వెలుగుబాటను ఎంచుకునే రైతులకు ‘సాగుబడి’ చేదోడుగా ఉంటుంది. నిపుణులు, రైతులకు మధ్య వారధిగా ఉంటూ.. ఎప్పటికప్పుడు మెలకువలను అందిస్తుంది. ఆలస్యమెందుకు..? మీరూ కొత్తదారి తొక్కండి.
 
 ప్రకృతి వ్యవసాయంపై 3 రోజుల ఉచిత శిక్షణ
 ‘అన్నపూర్ణ’ పంటల నమూనాలో ప్రకృతి వ్యవసాయంపై జట్టు స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం జిల్లా తోటపల్లిలో రైతులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తోంది.

స్వయంగా తోటపల్లి వస్తే పెద్ద రైతులైనా, పేద రైతులైనా 3 రోజుల ఉచిత శిక్షణ  పొందవచ్చు. ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

అయితే, రైతులు తమ గ్రామంలోనే సామూహిక శిక్షణ పొందవచ్చు. ఏ జిల్లాకు చెందిన రైతులెవరైనా కనీసం 20-30 మంది ఒక బృందంగా ఏర్పడితే వారి ఊళ్లోనే ‘అన్నపూర్ణ’ పంటల నమూనాపై ఉచితంగా శిక్షణ పొందవచ్చు.  జట్టు సంస్థ సిబ్బంది వారి ఊరికెళ్లి 3 రోజులపాటు శిక్షణ ఇస్తారు. తర్వాత కాలంలో రైతుల సందేహాలను ఫోన్ ద్వారా నివృత్తి చేస్తారు.
 
విశాఖపట్నం జిల్లాకు చెందిన (ఎకరం లోపు సొంత భూమి ఉన్న) పేద రైతులకు ఉచితంగానే భోజన వసతులు కూడా కల్పించి తోటపల్లిలో జట్టు సంస్థ శిక్షణ ఇస్తున్నది. ఆసక్తి కలిగిన ఇతర జిల్లాలకు చెందిన పేద, గిరిజన రైతులకు కూడా ఆయా జిల్లాల్లో శిక్షణతోపాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు సమకూర్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, రంపచోడవరం, చిత్తూరు, పాడేరు ప్రాంతాల్లో గిరిజనులకు కోవెల్ ఫౌండేషన్ (వి. కృష్ణారావు- 9440976848), సీసీఎన్ సంస్థ (లాఖీ -9848049528) కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నాయి.

రైతులు సంప్రదించాల్సిన చిరునామా: జట్టు ఆశ్రమం, తోటపల్లి పోస్టు, రావివలస (ఎస్.ఓ.), పార్వతీపురం వయా, విజయనగరం జిల్లా-535525. కాల్‌సెంటర్: ఫోన్: 08963 227228   (ఉ. 9 గం. నుంచి రాత్రి 8 గం.). నూకంనాయుడు(ప్రాజెక్టు మేనేజర్)- 94400 94384.  

 Email: jattutrust1@gmail.com              
- ‘సాగుబడి’ డెస్క్
 
 ఇదీ ‘అన్నపూర్ణ’ ఆవశ్యకత!
 రెండెకరాల భూమి కలిగిన రైతులు కేవలం ఆ భూమిపై ఆధారపడి బతకడం అసాధ్యమనే పరిస్థితి నెలకొంది. తన కాయకష్టంతో పది మందికి అన్నం పంచిన రైతు కనీసం తన  కుటుంబం ఆకలి తీర్చలేని దీనావస్థలో ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడడంతో వ్యవసాయ ఖర్చులు భారీగా పెరగడమే. వాతావరణంలో మార్పుతో అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, తుపాన్లు వస్తున్నాయి. వీటి తాకిడికి పంటలు తుడిచిపెట్టుకుపోయిన అనుభవాలు మనకున్నాయి. ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ డంతోపాటు తక్కువ ఖర్చుతో, సుస్థిర దిగుబడినివ్వగల పంటల నమూనా అవసరమైంది. ఈ లక్షణాలన్నిటి తోపాటు రసాయనాల అవశేషాలు లేని సహజాహారాన్ని అందించే పంటల నమూనా ‘అన్నపూర్ణ’.
 
 శిక్షణ పొంది సాగు చేయండి

 అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయ నమూనాలో ఏదో ఒక పంట కాకుండా అనేక పంటలు కలిపి పండిస్తాం. ఈ ఖరీఫ్‌లో ఈ నమూనాలో సాగు చేపట్టే రైతులు పేర్లు నమోదు చేయించుకొని వర్షాలకు ముందే శిక్షణ పొందాలి. వర్షాధార సాగుకు జూన్ 15లోగా విత్తనాలు వేసుకోవాలి. పండ్ల మొక్కలు నాటుకోవాలి. నీటి వసతి ఉన్న రైతులు ఇంకొన్నాళ్లు ఆలస్యంగానైనా ప్రారంభించవచ్చు.  
 - డి. పారినాయుడు(9440164289), ‘అన్నపూర్ణ’ పంటల నమూనా రూపకర్త,జట్టు ట్రస్టు వ్యవస్థాపకులు, తోటపల్లి.

మరిన్ని వార్తలు