మిరపకు వైరస్

21 Nov, 2014 03:30 IST|Sakshi
మిరపకు వైరస్

ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగు చేసిన మిరప తోటలకు వైరస్ తెగుళ్లు ఆశిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 25 వేల హెక్టార్లలో మిర్చిని సాగు చేశారు. భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాల్లో మిరప తోటలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలు పూత, కాత దశలో ఉన్నాయి. జిల్లాలో సాగు చేసిన మిర్చిని తెగుళ్లు ఆశించినట్లు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. మిర్చికి ఆశించిన తెగుళ్ల నివారణ చర్యలను డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ (99896 23813), శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.వెంకట్రాములు(89856 20346), డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు (8332951138) వివరించారు.

 ఆకుముడత తెగులు (జెమిని వైరస్)
 తెల్లదోమ ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించి మొక్కలు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చరంగు కలిగి ఉండి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి.

 కుకుంబర్ మొజాయిక్ వైరస్
 ఈ వైరస్ పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. నల్లని మసి లేదా బూజు ఆకులు, కాయలపై కనిపిస్తాయి. మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి, ఆకారం మారిపోయి కొనలు సాగి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. పూత, కాత ఉండదు. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

 మొవ్వకుళ్లు తెగులు (పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్)
 ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్లు సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వ లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణ చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నైక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి.

 నివారణ చర్యలు
 గట్లమీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి.
 పొలం చుట్టూ 2-3 వరుసల జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా వేసుకోవాలి.
 సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి.
 విత్తనం ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్ల నివారణకు ట్రైసోడియం ఆర్థోపాస్పేట్‌తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
 తెగుళ్లను వ్యాప్తిచేసే రసంపీల్చు పురుగులను సమర్థవంత ంగా నిర్మూలించాలి.
 వైరస్ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చి వేయాలి.
 గ్రీజు లేదా ఆయిల్ పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడ ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకొని కొంతవరకు వాటిని నివారించవచ్చు.
 పేనుబంక నివారణకు 2 గ్రాముల ఎసిఫేట్, లేదా 2 మి.లీ మిథైల్ డెమటాన్ లేదా 0.25 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 తామర పురుగు నివారణకు ఎసిఫేట్ 2 గ్రాములు లేదా 2 మి.లీ ప్రాపోనిల్ లేదా 0.25 మి.లీ స్పైనోసాడ్ లేదా 2 గ్రాముల డెపైన్‌థియోరాన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 తెల్లదోమ నివారణకు 5 శాతం వేప గింజల కషాయాన్ని లేదా ఎకరానికి 300 గ్రాముల ఎసిఫేట్ లేదా ట్రైజోఫాస్ 250 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 60 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 40 గ్రాముల మందులను మార్చి మార్చి 7-10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

మరిన్ని వార్తలు