ఎలుకల పని పట్టండిలా..

25 Sep, 2014 02:43 IST|Sakshi

 సిమెంటు, మైదాపిండిలను సమ భాగాలుగా కలిపి పొట్లాలు కట్టి ఎలుకల బొరియల వద్ద ఉంచాలి. వాటిని తిన్న తర్వాత ఎలుకలు నీరు తాగడం వల్ల నోటి భాగాలు పిడుచకట్టుకుపోతాయి. కడుపులో సిమెంట్ గడ్డకడుతుంది. దీంతో ఎలుకలు చనిపోతాయి.
 
బొరియల్లో తడిగడ్డితో నింపిన కుండల ద్వారా పొగబెడితే రంధ్రాల్లో ఉన్న ఎలుకలు చనిపోతాయి.
     
పొలం గట్లపై జిల్లేడు, ఆముదం మొక్కలు పెంచితే ఎలుకలు పొలం గట్లపై బొరియలు పెట్టే అవకాశం ఉండదు.
     
ఐరన్ బుట్టలను అమర్చి ఎలుకలను పట్టుకోవచ్చు.
     
ఎలాస్టిక్ తాళ్లతో పెట్టే బుట్టల ద్వారా కూడా ఎలుకలను నిర్మూలించవచ్చు. ఎకరా పొలంలో సుమారు 20 వరకు బుట్టలు ఉంచాలి. ఈ బుట్టల్లో బియ్యాన్ని ఎరగా వాడాలి. ఇందులోకి ఎలుక రాగానే దీనిలో ఉన్న ఎలాస్టిక్ వల్ల పీక నొక్కకుపోయి మరణిస్తుంది.
 
రసాయనాల ద్వారా..
 చాలామంది రైతులు జింక్ ఫాస్ఫైట్ వినియోగిస్తుంటారు. ఈ మందుతో ఒకసారి ఎలుకలను నిర్మూలించినా.. రెండో దఫా మందు పెట్టినప్పడు ఎలుకలు గుర్తించి తప్పించుకుంటాయి.
     
{బోమోడైల్ మందు ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చు. 480 గ్రాముల నూకలకు పది గ్రాముల నూనె పట్టించి మరో 10 గ్రాముల బ్రొమోడైల్ మందు కలిపి ఎరను తయారు చేసుకోవాలి. ఆ ఎరను బొరియల వద్ద ఉంచాలి. దీనిని తిని ఎలుకలు చనిపోతాయి.
     
అయితే పొలంగట్లపై కనిపించిన ప్రతి బొరియ వద్ద ఎర పెట్టడం వల్ల ఫలితం ఉండదు. ముందుగా బొరియలను గుర్తించి వాటిని మట్టితో మూసేయాలి. తర్వాతి రోజు గమనించాలి. తెరుచుకున్న బొరియల్లో ఎలుకలు ఉంటున్నట్లు అర్థం. వాటి వద్ద మందు పెడితే ఉపయోగం ఉంటుంది. వారం తర్వాత మరోసారి ఇలాగే చేయాలి.
     
రైతులు విడివిడిగా ఎలుకలు నివారించేకంటే ఒక ఆయకట్టు రైతులంతా ఒకేసారి ఈ విధానాన్ని అవలంబిస్తే ఎలుకలను శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది.
 కొబ్బరి చిప్పల్లో పెడితే మేలు..
     
పంట పొలాల్లో, బొరియల వద్ద పెట్టే మందును కొబ్బరి చిప్పల్లో ఉంచడం ద్వారా రైతులు మరింత ప్రయోజనం పొందవచ్చు. మందు పొట్లాల్లో ఉంచితే వర్షాలకు కరిగిపోవడంతోపాటు కాకులు, పక్షులు తినే అవకాశం ఉంటుంది.
     
కొబ్బరి చిప్పలో మందు ఉంచి పైన మరో చిప్పను ఉంచాలి. చిప్పల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం నుంచి ఎలుకలు అందులోకి ప్రవేశించి మందును తింటాయి.
     
పంట పొలాల్లో నీరు ఉన్న ఎత్తులో చిప్పలను కర్రలకు కట్టి ఎరలు ఏర్పాటు చేయాలి. పొలం మధ్యలోకి ఈదుకుంటూ వచ్చే ఎలుకలు చిప్పల్లోకి ప్రవేశించి మందును తిని చనిపోతాయి.

మరిన్ని వార్తలు