పూతను కాపాడితేనే కాత

8 Nov, 2014 03:40 IST|Sakshi
పూతను కాపాడితేనే కాత

ఖమ్మం వ్యవసాయం : భారతదేశంలో పండించే ఫలాల్లో మామిడిని ‘రారాజు’గా అభివర్ణిస్తారు. జిల్లాలో 43,391 హెక్టార్లలో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, పాల్వంచ, ముల్కలపల్లి, చండ్రుగొండ, కొత్తగూడెం, జూలూరుపాడు తదితర మండలాల్లో పండిస్తున్నారు.

మామిడి సాగుకు తెలంగాణ రాష్ట్ర వాతావరణం అనుకూలంగా ఉంటుందని, మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా  పూత ఆలస్యంగా రావడం, పలు దఫాలుగా రావడం, పిందెలు ఆలస్యంగా కట్టడం వల్ల పంట సకాలంలో (మే నెలలో) కోతకు రావటం లేదు. ఈ మారుతున్న వాతావరణ ప్రభావాలను అధిగమించాలంటే రైతులు తగిన  యాజమాన్య పద్ధతులు పాటించాలని ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు-2  కె.సూర్యనారాయణ తెలిపారు.

 పూత, పిందె సకాలంలో వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 జూన్, జూలై నెలల్లో మామిడి కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ముఖ్యంగా ఎండు పుల్లలను మొత్తం తీసివేయటం ద్వారా చెట్టంతా శుభ్రంగా ఉంటుంది.
ఆగస్టులో చిలేటెడ్ జింక్ 1 గ్రాము లీటరు నీటికి, బోరాన్ (19 శాతం) 1.25 గ్రాములు, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 అక్టోబర్ / నవంబర్ నెలల  నుంచి మామిడి చెట్లకు నీరు కట్టడం ఆపి చెట్లను నీటి ఎద్దడికి గురి చేయాలి.
నవంబర్‌లో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత, మొగ్గలు సకాలంలో వస్తాయి.
పూమొగ్గ పెరుగుదల దశలో (జనవరి 15 నుంచి) తేలికపాటి నీటి తడులు ఇవ్వడం వల్ల త్వరగా పూత విచ్చుకుని ఫలదీకరణ చెందుతుంది.
 పదేళ్లకు పైబడిన చెట్లకు 4 డిప్పర్లు చెట్టు కాండం నుంచి మీటరు దూరంలో ఉండేటట్లు అమర్చి ఒక చెట్టుకు 60 నుంచి 80 లీటర్ల నీరు అందేటట్లు (రోజుకు 2 గంటలు) ఇవ్వాలి.
 సూక్ష్మధాతు లోపం ఉన్న తోటల్లో 1.25 గ్రాముల బోరాన్ (19 శాతం) లీటరు నీటిలో కలిపి పూమొగ్గల పెరుగుదల దశలో పిచికారీ చేయడం ద్వారా ఫలదీకరణం బాగా జరిగి పిందె బాగా కట్టి అధిక దిగుబడి ఇస్తుంది.
 మామిడి పిందె దశలో (జొన్న పరిమాణం) ఉన్నప్పుడు నాఫ్తిలిన్ అసిటిక్ ఆమ్లం(ఎన్‌ఏఏ) 20-20 నపీపీఎం గాఢతతో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తద్వారా పూత, పిందె బాగా నిలుస్తుంది.
కాయలు నిమ్మకాయల పరిమాణంలో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్‌ను (13-0-45) 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ద్వారా కాయ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని త్వరగా పెరుగుతుంది.

మరిన్ని వార్తలు