మట్టి అంటని ‘మెగా’ సేద్యం!

9 May, 2017 00:31 IST|Sakshi
మట్టి అంటని ‘మెగా’ సేద్యం!

- రూ. 5 కోట్ల పెట్టుబడితో దేశంలోనే తొలి హైడ్రోపోనిక్‌ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు
- మట్టి కుండీల్లో కొబ్బరి పొట్టు, ద్రవరూప ఎరువులతో అత్యాధునిక సేద్యం
16 పాలీహౌస్‌లలో భారీ ఎత్తున చెర్రీ టొమాటోల సాగు
- శుద్ధి చేసిన నీటితో నాణ్యమైన దిగుబడి
పెద్ద నగరాల్లోని మాల్స్‌లో అమ్మకాలు.. కిలో ధర రూ. 400
- దుబాయ్‌కీ ఎగుమతి చేస్తున్న వైనం
- హైదరాబాద్‌ యువ మహిళా రైతు విజయగాథ


‘ధైర్యే.. సాహసే.. లక్ష్మీ..’ అన్నారు.పాయల్‌ రైనా ఘోష్‌ ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.ఈ విజయ మంత్రాన్ని ఆమె ఎంతగా వంటపట్టించుకున్నారో తెలుసుకోవాలంటే.. ఆమె సృష్టించిన అత్యాధునిక హైడ్రోపోనిక్‌ పాలీహౌస్‌ల వ్యవసాయ క్షేత్రాన్ని ఒక్కసారి తేరిపార చూస్తే చాలు. సంప్రదాయ వ్యవసాయం బొత్తిగా ఎరుగని కశ్మీరీ పండిట్‌ కుటుంబంలో.. అందునా హైదరాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల కావచ్చు.. చెంచాడు కూడా మట్టి అవసరం లేని హైడ్రోపోనిక్‌ సేద్య పద్ధతిని పాయల్‌ ఎంచుకున్నారు! అంతేకాదు.. సంపన్నులు ఇష్టంగా తినే తియ్యటి చెర్రీ టొమోటోలను హైదరాబాద్‌ సమీపంలో భారీ పెట్టుబడితో భేషుగ్గా పండిస్తూ భేష్‌ అనిపించుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 16 పాలీహౌస్‌లలో సాగు చేస్తూ.. మహిళా రైతుగా ఆశ్చర్యకరమైన విజయాలను నమోదు చేస్తున్నారు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ సేద్య రీతిపై ప్రత్యేక కథనం
‘సాగుబడి’ పాఠకుల కోసం..   

పంటకు ఆధారం మట్టే. కానీ, చిటికెడు మట్టిని కూడా ఉపయోగించకుండా పంటలు పండించేదే ‘హైడ్రోపోనిక్‌’ పద్ధతి. మట్టికి బదులుగా కొబ్బరి పొట్టును కుండీల్లో నింపి.. డ్రిప్‌ ద్వారా నీటితోపాటు ద్రవరూప ఎరువులను కలగలిపి నిరంతరం అందించడం ఈ సేద్య పద్ధతి ప్రత్యేకత. దేశవిదేశాల్లో ఇంటిపంటల్లో హైడ్రోపోనిక్‌ పద్ధతిని వాడటం తెలిసిందే. అయితే, హైదరాబాద్‌కు చెందిన మహిళా రైతు పాయల్‌ రైనా ఘోష్‌ భారీ స్థాయిలో ధైర్యంగా పాలీహౌస్‌లలో హైడ్రోపోనిక్‌ వ్యవసాయం చేపట్టడం అభినందనీయం.

వినూత్న పద్ధతిలో పాలీహౌస్‌ల నిర్మాణం
రంగారెడ్డి జిల్లా కర్తాల్‌ మండలం సలార్‌పుర్‌ గ్రామపరిధిలో ‘స్పర్శ్‌ బయో’ పేరిట అత్యాధునిక హంగులతో కూడిన వ్యవసాయ క్షేత్రాన్ని పాయల్‌ నిర్మించారు. రూ.5 కోట్ల పెట్టుబడితో 25 ఎకరాల ఆవరణలో 16 పాలీహౌస్‌లు నిర్మించారు. వీటి నికర విస్తీర్ణం 30 వేల చదరపు మీటర్లు. వీటిలో కొన్నిటిని సంప్రదాయ ఆకృతుల్లోనే నిర్మించారు. మరికొన్నిటిని దక్కన్‌ పీఠభూమి వేడి వాతావరణానికి తగినట్టుగా ఆకృతిని మార్చి, 10% తక్కువ ఖర్చుతో హైబ్రిడ్‌ పాలీహౌస్‌లను నిర్మించారు. పాలీహౌస్‌లో నుంచి వేడి గాలి త్వరగా బయటకు పంపడానికి గాలికి తిరిగే టర్బో వెంటిలేటర్లను అమర్చారు. పాలీహౌస్‌కు రెండు వైపులా 2.8 మీటర్ల ఎత్తున నైలాన్‌ 40 మెష్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాలీహౌస్‌లలో 35 డిగ్రీల కన్నా ఉష్ణోగ్రత పెరగకుండా, పగటి పూట 5 నిమిషాలకోసారి నీటి తుంపరలను ఆటోమేటిక్‌గా వెదజల్లే ఏర్పాట్లు చేశారు.

మట్టి కుండీలు.. కొబ్బరిపొట్టు..
ప్రత్యేకంగా తయారు చేయించిన అడుగు ఎత్తుండే ఎర్రమట్టి కుండీలో శుద్ధిచేసిన 700 గ్రాముల కొబ్బరి పొట్టును నింపుతారు. స్విట్జర్లాండ్‌ నుంచి తెప్పించిన హైబ్రిడ్‌ విత్తనాలతో నారుపోసి, 28 రోజుల చెర్రీ టొమాటో మొక్క నాటుతున్నారు. సాళ్ల మధ్య 4.5 అడుగులు, మొక్కల మధ్య 16 అంగుళాల దూరం ఉంచుతున్నారు. ఈ కుండీలు పక్కకు పడిపోకుండా ఇనుప ఫ్రేమ్‌పై అమర్చి, ఎయిరో డ్రిప్పర్‌ ద్వారా తగుమాత్రంగా నీటిని ఇస్తున్నారు.

సాగు నీటిగా శుద్ధ జలాలు
రోజుకు 3 దఫాలు (మొత్తం 10 నిమిషాలపాటు) ఒక్కో మొక్కకు రోజుకు లీటరుకు పైగా శుద్ధమైన నీటిని ఇస్తున్నారు. భూగర్భ జలాలను బోర్లతో తోడి రివర్స్‌ ఆస్మోసిస్‌ పద్ధతిలో శుద్ధి చేసి, ఆ నీటిని చెర్రీ టొమాటో మొక్కలకు ఇస్తున్నారు. సాధారణంగా పాలీహౌస్‌లలో మొక్కలకు ఇచ్చే నీరు 95% వృథా అవుతుందని, తమ వద్ద 5% మాత్రమేనని పాయల్‌ తెలిపారు. అందువల్లే కరువు పీడిత ప్రాంతంలోనూ నిశ్చింతగా 35 వేల లీటర్ల ఆర్‌.ఓ. నీటిని పంటకు ఇస్తున్నామన్నారు. చెర్రీ టొమాటో తీగ జాతి మొక్క. తాడు ఆసరాతో 12 అడుగుల పొడవు∙పెరుగుతున్నది. 5,6 అడుగుల ఎత్తు పెరిగే వరకు ఆసరా తాడును నిలువుగానే కట్టి ఉంచుతారు. ఆ తర్వాత పక్కకు ఏటవాలుగా వంచి కట్టేస్తారు. ఎంత పొడవు పెరిగినా కాయలు చేతికి అందేంత ఎత్తులో ఉంచడం కోసమే ఇలా చేస్తున్నామని పాయల్‌ వివరించారు. నాటిన రెండు నెలలకు కాపుకొస్తాయి. ఆ తర్వాత 3–4 నెలల పాటు మొక్కకు 3–4 కిలోల చెర్రీ టొమాటోల దిగుబడినిస్తున్నాయని పాయల్‌ వివరించారు.

ప్రతి పాలీహౌస్‌లోనూ చెర్రీ టొమాటో మొక్కలనే ఏక పంటగా సాగు చేస్తున్నారు. రసాయనిక ద్రవ రూప ఎరువులను నీటితో పాటే మొక్కలకు అందిస్తున్నారు. పురుగుల బెడదను తగ్గించడానికి లింగాకర్షక బుట్టలతోపాటు జిగురు పూసిన పసుపు, నీలి అట్టలను వాడుతున్నారు. అవసరమైనప్పుడు తగుమాత్రంగా రసాయనిక పురుగుమందులు వాడుతున్నామని పాయల్‌ చెప్పారు. ప్రతి పాలీహౌస్‌లోనూ చెర్రీ టొమాటో మొక్కలనే ఏక పంటగా సాగు చేస్తున్నారు. రసాయనిక ద్రవ రూప ఎరువులను నీటితో పాటే మొక్కలకు అందిస్తున్నారు. అయితే, సుస్థిర సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించడంపై దృష్టిపెడితే సుస్థిర వ్యవసాయానికి పాయల్‌ మార్గదర్శకురాలిగా నిలుస్తారనడంలో సందేహం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారని ఆశిద్దాం.
వివరాలకు: ఫామ్‌ మేనేజర్‌ రాకేష్‌ గౌడ్‌ 91333 00621
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి, సాక్షి ఫొటో జర్నలిస్టు


నాణ్యతలో రాజీ లేదు...
చెర్రీ టొమాటోలో రోజుకు 500 కిలోల  దిగుబడి తీస్తున్నాం. కోసిన 10 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. రైళ్ల ద్వారా మన దేశంలో హైదరాబాద్‌ సహా అన్ని ముఖ్యనగరాలతోపాటు దుబాయ్‌కి కూడా ఎగుమతి చేస్తున్నాం. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకపోవడం వల్ల మార్కెటింగ్‌ ప్రారంభించిన 10 నెలల్లోనే మంచి పేరు వచ్చింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు ప్రొ. రమేష్‌ చంద్‌తోపాటు ఇజ్రాయిల్‌ రైతులు, స్పెయిన్‌ శాస్త్రవేత్తలు సైతం ఫామ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. కుటుంబ బాధ్యతలు, ఫామ్‌ పనులను ఏకకాలంలో చక్కబెట్టుకోవడం తొలుత ఇబ్బందైనా త్వరగానే నేర్చుకున్నా. మహిళగా నాకు ఈ శక్తియుక్తులు పుట్టుకతోనే వచ్చాయి.
        – పాయల్‌ రైనా ఘోష్‌

>
మరిన్ని వార్తలు