ఇంకిన చినుకులే సిరులు పంచాయి!

14 Jun, 2016 00:21 IST|Sakshi
ఇంకిన చినుకులే సిరులు పంచాయి!

- చెక్ డ్యాంల నిర్మాణంతో కరువును జయించిన గిరిజన తండా
- రెండేళ్లుగా సరైన వర్షాలు లేకున్నా జలసిరితో బావులు కళకళ
- నీటి భద్రతతో ఏటా కొత్తగా 50 ఎకరాలు సాగులోకి..
 
 కరువుకు చిరునామాగా నిలిచిన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామం అది. దశాబ్దం క్రితం వ్యవ సాయమనే ఊహకూ తావులేదు. ప్రస్తుతం జలసిరితో తుల తూగుతూ నాణ్యమైన సేంద్రియ పంట ఉత్పత్తులకు మారుపేరుగా నిలిచింది. ఊరు చుట్టూతా చెక్ డ్యాంల నిర్మాణంతోనే గ్రామం జీవకళను సంతరించుకుంది. వాన నీటిని భూగర్భంలో ఇంకించుకోవటంపై చూపిన శ్రద్ధే ఆ గ్రామానికి శాశ్వత నీటి భద్రతను సాధించిపెట్టింది. స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ఆ గిరిజన తండా వాసులు సమష్టి చైతన్య స్ఫూర్తితో సాధించిన ఈ విజయం.. కరువు పీడిత గ్రామాలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం..

 తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ జల కళ ఉట్టిపడుతున్న గ్రామం గొల్లపల్లి తండా. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో రెండోది అనంతపురం జిల్లా. ఆ జిల్లాలోని తలుపుల మండలంలో ఉన్న ఆ తండాలో 130 కుటుంబాలు నివసిస్తున్నాయి. పక్క గ్రామాల్లో 500 అడుగుల లోతు బోర్లు వేసినా కరుణించని గంగ ఈ గ్రామంలో 15 అడుగుల లోతు బావుల్లోనే దర్శనమిచ్చి అచ్చెరువొందిస్తోంది. ఒక్క పంటను అదనులో సాగు చేయలేని కరువు కాలంలోనూ.. ఈ గ్రామంలోని రైతులు వివిధ రకాల పంటలను ఏడాదంతా సేంద్రియ విధానంలో సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.  

 తొలి చెక్ డ్యాంతోనే దశ తిరిగింది..
 తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో అనంతపురానికి చెందిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) స్వచ్ఛంద సంస్థ 2003లో గొల్లపల్లి తండాలో తొలి చెక్‌డ్యాంను నిర్మించింది.  2-7 కి. మీ. పరిధిలో కురిసిన వర్షపు నీరంతా చెక్ డ్యాంలోకి వ చ్చి చేరుతోంది. ఒక్కసారి నిండితే ఆరు నెలల పాటు నీరు నిల్వ ఉంటుంది. ఒక్క వానకే చెక్‌డ్యాంలు నిండిన సందర్భాలున్నాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు కొండల అంచుల వెంబడి అటవీ శాఖ సహాయంతో కందకాలను తవ్వుకున్నారు. బోరు బావుల వల్ల భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయంతో గ్రామ పరిధిలో బోర్లపై గ్రామ సంఘం నిషేధం విధించింది. చెక్‌డ్యాం నిర్మించిన తొలి ఏడాదే గ్రామంలో 9 బావులు తవ్వారు. 20 - 30 అడుగుల్లోనే సమృద్ధిగా నీరు లభించడంతో, ఆ ఏడాదే 20 ఎకరాల పొలం సాగులోకి వచ్చింది.

 అప్పటి నుంచి ఏటా 40-50 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వస్తోంది. ఊటబావుల సంఖ్య క్రమంగా 83కు చేరింది. ఇప్పుడా గ్రామంలో 700 ఎకరాల భూమికి కరువు కాలంలోనూ సాగు నీటికి దిగుల్లేదు. పక్క గ్రామాల్లో 500 అడుగుల లోతు తవ్వినా బోర్లలో నీరు పడటం లేదు. గొల్లపల్లితండాలో మాత్రం రోహిణి కార్తెలోనూ 15-20 అడుగుల లోతుగల బావుల్లోనే పుష్కలంగా నీరుంది.

 సేంద్రియ సేద్యపు బాట..
 వాన నీటిని వొడిసిపట్టుకొని నీటి భద్రతను సాధించుకోవడంతోపాటు ఆ నీటిని పొదుపుగా సద్వినియోగం చేసుకోవడంలోనూ గొల్లపల్లి తండా ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆర్‌డీటీ సాయంతో ఊట బావుల వద్ద ప్రతి రైతూ ఒక సోలార్ మోటార్‌ను అమర్చుకున్నారు. అంతేకాదు.. సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో సేంద్రియ సేద్యపు బాట పట్టారు. 2009 నుంచి గొల్లపల్లితండాలో సేంద్రియ వ్యవసాయం ప్రారంభమైంది. మామిడి, వేరుశనగ, వరి అక్కడ ప్రధానంగా సాగయ్యే పంటలు. వేసవిలో టమాటా, చిక్కుడు, మిరప, అనాస, సజ్జ, కొర్రలు వంటి పంటలు పండిస్తున్నారు. వరీ కంపోస్టు, పేడ ఎరువులు, వేపకషాయం, గోమూత్రంనే వాడుతున్నారు.

 సేంద్రియ మామిడికి రెండింతల ధర
 సేంద్రియ మామిడి పండ్లకు గొల్లపల్లి తండా ప్రసిద్ధి చెందినది. కాయ మంచి రంగు, నాణ్యత బావుండటంతో మామిడి పండ్లకు గిరాకీ పెరిగింది. బంగినపల్లి, అల్ఫాన్సా వంటి మామిడి రకాలకు స్థానికంగా లభించే ధరలతో పోల్చితే రెండింతల ధర లభిస్తోంది. వ్యాపారులే వచ్చి కొనుగోలు చే సి హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. విత్తన వేరుశనగ సాగులోనూ గొల్లపల్లి తండా పేరుగాంచింది. వ్యాపారులు రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకొని అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. గిట్టుబాటు ధర రాబట్టుకోవడం కోసం, మార్కెటింగ్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘాన్ని కూడా రైతులు ఏర్పాటు చేసుకోవడం విశేషం.

 ఇటు గొర్రెలు.. అటు ఆవులు..
 గొల్లపల్లి తండా పశుసంపదతో తులతూగుతోంది. గ్రామంలో 7 వేల గొర్రెలు ఉన్నాయి. బళ్లారి, నెల్లూరు జాతి రకం గొర్రెలను రైతులు పెంచుతున్నారు. ఇవి మూడు నెలల్లోనే అమ్మకానికి వచ్చి.. ఒక్కో గొర్రెకు రూ. 3 వేల వరకు ధర లభిస్తుంది. మరోవైపు పాడి పరిశ్రమ వృద్ధి చెందింది. ఒక్కో కుటుంబానికి 10-20 వరకు ఆవులున్నాయి.

 55 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
 ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ఉన్నత విద్యనభ్యసించే యువకుల సంఖ్య పెరిగింది. ఈ పదిహేనేళ్లలోనే గ్రామం నుంచి 55 మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందటం విశేషం.

 మారుమూల కొండల్లోని ఒక తండా ఇంత వృద్ధిలోకి రావడానికి మూలకారకుడు భూక్యా బాల గంగాధర్ నాయక్. ఆ గ్రామవాస్తవ్యుడైన నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉద్యోగం చేస్తూనే తండావాసులను వెలుగుబాటన నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తాను 30 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలిచారాయన. చెక్‌డ్యాంలు, కందకాల నిర్మాణంతో కరువును జయించి, పాడి పంటలతో సుభిక్షంగా అలరారుతున్న గొల్లపల్లి తండా మరెన్నో కరువు పీడిత గ్రామాల్లో కొత్త వెలుగులకు స్ఫూర్తి ప్రదాత కావాలని ఆశిద్దాం.   
 - చెరువు శ్రీనివాసరెడ్డి, సాక్షి, కదిరి, అనంతపురం జిల్లా
 
 సేంద్రియ సాగుతో అధికాదాయం!
 2009 నుంచి మా గ్రామ రైతులందరూ సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. మేం పండించే పంటలన్నింటికీ గిరాకీ ఉంది. మంచి ఆదాయం లభిస్తోంది. నీటి భద్రత, సేంద్రియ సేద్యమే మా బలం. చెక్‌డ్యాంలు, బావుల నిర్మాణంతోనే నీటి భద్రత కల సాకారమైంది. 
 - భూక్యా బాల గంగాధర్ నాయక్ (94408 74442), సేంద్రియ రైతు, గొల్లపల్లి తండా, తలుపుల మం., అనంతపురం జిల్లా
 
 చెక్ డ్యాంలతో రెండింతల నీటి సంరక్షణ

 10 -20 అడుగుల లోతులోనే బావుల్లో నీళ్లున్న గ్రామం అనంతపురం జిల్లా మొత్తంలో గొల్లపల్లి తండా ఒక్కటే. దీనిక్కారణం చెక్‌డ్యాంల నిర్మాణమే. చెక్‌డ్యాంల వల్ల అంతకుముందుకన్నా రెండింతల నీరు భూమిలోకి ఇంకుతుంది. చెక్‌డ్యాం నుంచి నీరు భూమి పై పొరల్లోకి మాత్రమే ఇంకుతుంది. కాబట్టే 10 అడుగుల ఊట బావుల్లో నీరు ఉంటున్నది.  బోర్లు వేస్తే ఫెయిలవుతాయి. పైగా ఉన్న ఆ కొద్దిపాటి భూగర్భ జలాలూ త్వరగా ఖర్చయిపోతాయి. అందుకే గొల్లపల్లి తండా రైతులెవరూ బోర్లు వేయకూడదని తీర్మానించుకొని దానిని కచ్చితంగా పాటిస్తున్నారు.
 - గోపిరెడ్డి నాగేశ్వర్‌రెడ్డి (98490 49096), డెరైక్టర్, ఆర్‌డీటీ ఎకాలజీ సెంటర్, అనంతపురం
 
 తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి!
 ఐదేళ్లుగా ఈ తండా రైతులు సేంద్రియ సేద్యం చేస్తున్నారు. వేరుశనగ రసాయనిక  సేద్యం చేసే రైతుల కన్నా తక్కువ ఖర్చుతోనే ఎకరానికి 2, 3 బస్తాల అధిక దిగుబడి తీస్తున్నారు. భారీ వర్షాన్ని, సుదీర్ఘ బెట్టను సైతం పంటలు తట్టుకుంటున్నాయి. నాణ్యమైన విత్తనాలకు ఈ గ్రామం పెట్టింది పేరు.
 - కె. ఆదినారాయణ (94904 37796), సుస్థిర వ్యవసాయ కేంద్రం, కదిరి

మరిన్ని వార్తలు