పసుపు సాగు.. కాపాడితే బాగు

24 Sep, 2014 02:42 IST|Sakshi

అల్లిక రెక్కనల్లి (తెగులు)
 కారణాలు...
 ఎక్కువ నీడ, తక్కువ గాలి, వెలుతురు ఉండడం.
 పైరులో సూక్ష్మ వాతవరణం పొడిగా, చల్లగా ఉండడం.
 పొలంలో పరిశుభ్రత పాటించకపోవడం.

 లక్షణాలు ...
 ఆకుల అడుగు భాగంలో తల్లి, పిల్ల పురుగులు ఉండి రసం పీల్చడం వల్ల ఆకుపై భాగాన తెల్లని వచ్చలు ఏర్పడుతాయి.
 మొక్క పేలవంగా కనిపిస్తుంది.
 నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి.

 నివారణ...
 విత్తనాన్ని సరైన సాంధ్రతతో నాటి మొక్కలకు గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి.
 వేప పిండిని పైపాటు ఎరువుగా వేయాలి.
 పైరుపై పురుగును గమనించగానే లీటరు నీటిని 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా, 2 మిల్లీలీటర్ల డైమిథోఏట్‌ను కలపి పైరుపై పిచికారి చేయాలి.
 
 ఎర్రనల్లి(పొగచూరు తెగులు) :
 లక్షణాలు...
పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగుభాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి మొక్కలు ఎండిపోతాయి.

 నివారణ...     
లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్, 1 మిల్లీలీటరు సబ్బు నీరు కలపి ఆకుల అడుగు భాగాన తడిచేటట్టు పిచికారి చేయాలి.
 
 పొలుసు పురుగు(స్కేల్స్) లక్షణాలు..    
ఇవి తెల్లని చుక్కల వలే దుంపల మీద కనిపిస్తాయి. విత్తనం నిల్వ చేసినప్పుడు కొమ్ముల నుంచి రసాన్ని పీల్చి వదలి పోయే టట్లు చేస్తాయి.
     
విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ములను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల మలాథీయన్ మందు కలిపిన ద్రవంలో 30 నిమిషాలు ఉంచి, ఆరబెట్టి నిల్వ చేసుకుంటే పొలుసు పురుగులు ఆశించవు.
 
 దుంప తొలుచు ఈగ :  
 కారణాలు..
 చీడపీడలు ఆశించిన తోట నుంచి విత్తనం ఎన్నుకోవటం.
 విత్తనశుద్ధి చేయక పోవటం.
 పసుపు తర్వాత పసుపు పంట సాగుచేయడం.
 తక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఎక్కువ ఉండటం.
 తేమ నిల్వ ఉండే పల్లపు భూముల్లో సాగుచేయడం.
 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆకాశం మేఘావృతమై చెదురుముదురుగా వర్షాలు పడడం.
 
నష్టపరిచే విధానం...
 అక్టోబర్ నె నుంచి పంట చివరి వరకు దుంప తొలుచు ఈగ సమస్య ఉంటుంది.
 చిన్నవిగా, నల్లగా ఉండే ఈగలు మొక్కల మొదల్లపై నుంచి లోపలికి చేరి గుడ్లు పెడతాయి.
 గుడ్ల నుంచి బయటకు వచ్చే పిల్ల పురుగులు తెల్లగా బియ్యం గింజల మాదిరిగా ఉంటాయి.
 ఇది భూమిలోని దుంపల్లోకి చొచ్చుకుపోయి లోపలి కణజాలాన్ని తింటాయి.
 
లక్షణాలు...
 దుంప తొలుచు ఈగ ఆశించిన మొక్క, సుడిఆకు దాని దగ్గరలో ఉన్న లేద ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి.
 మొవ్వు లాగితే సులభంగా ఊడివస్తుంది.
 దుంపలో కణజాలం దెబ్బతింటుంది.
 పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్రమాదిరి కనిపిస్తుంది.
 మొక్క ఎదుగుదల నిలిచిపోయి, దిగుబడి 45-50 శాతం తగ్గుతుంది.
 
నివారణ...
 విత్తనశుద్ధి దుంపలను విత్తే ముందు లీటరు నీటికి 2మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్, లేదా 3మిల్లీలీటర్ల మలథీయాన్,కలిపిన ద్రావణంలో దుంపల్ని నానబెట్టి తర్వాత నాడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
 సమతుల ఎరువులను వాడాలి.
 మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి.మొక్కల మధ్య నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 పైరుపై దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. ఇది దుంపపుచ్చు కలిగించే ఈగను దగ్గిరకు రానీయదు. సత్తువగా కూడా పనిచేస్తుంది.
 వేపపిండి లేకపోతే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను అంతే పరిమాణం కలిగిన ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి.
 
 వేరు నులిపురుగులు :
 కారణాలు..
 పుచ్చు ఉన్న తోట నుంచి విత్తనం ఎన్నుకోవడం.
 పసుపులో అంతర పంటగా సొలనేసి కుటుంబానికి చెందిన మిరప, టమాట, వంగపైర్లను సాగుచేయడం.
 మురుగునీరు పోయే అవకాశం లేకపోవడం.
 పంట మార్పిడి చేయకపోవడం.
 సేంద్రియ ఎరువులు వేయకపోవడం.
 
నష్టపరిచేతీరు...
 నులిపురుగులు చేసిన గాయాల ద్వారా నేలలోని వ్యాధి కారణాలు వేళ్లలోకి వ్రవేశిస్తాయి. తద్వారా వేర్లు ఉబ్బిపోయి, కణతులు కలిగి ఉంటాయి.
 
లక్షణాలు....
 ఆకులు పాలిపోయి, మొక్కలు బలహీనంగా, పొట్టిగా ఉంటాయి.
 నులి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.
 
నివారణ...
 చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యమైన విత్తనాన్ని ఉపయోగించాలి.
 పసుపులో అంతర పంటగా బంతిని వేసుకోవాలి.
 పచ్చి ఆకులు లేదా ఎండిన ఆకులతో మల్బింగ్ చేసుకోవాలి.
 ఎకరాకు 500 కిలోల వేపపిండిని వేసుకోవాలి.
 ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను వేసుకోవాలి.

మరిన్ని వార్తలు