వంటకీ...వొంటికీ...

7 Dec, 2013 00:08 IST|Sakshi

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు.
 చక్కనమ్మ కాకపోతే మాత్రం? చిక్కితే అందంగా ఉండరా ఏంటి?!
 ఉంటారు.
 కానీ, చిక్కడం అంత ఈజీనా చెప్పండి.
 వాకింగ్‌లు, వర్కవుట్లు, డైటింగులు... ఎన్ని చెయ్యాలి!!
 చెయ్యగలితే ఓకే...
 చెయ్యలేకపోతే మాత్రం.... ఈ సీజనంతా... సంక్రాంతి వరకు...
 చిక్కుడు ఐటమ్స్‌ని లాగించేయండి!
 చిక్కుడు వంకాయ, చిక్కుడి పచ్చడి, చిక్కుడు తీపి కూర...
 చిక్కుడు కారం, చిక్కుడు ఫ్రై... మీ ఇష్టం.
 చిక్కుడు ఎందులోనైనా చక్కగా కలిసిపోతుంది.
 అంతేకాదు, మిమ్మల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
 చిక్కుడులో ఒక ఫిట్‌నెస్ గురు ఉన్నారు.
 ఒక ఫిజీషియన్ ఉన్నారు.
 ఇద్దరినీ మించి... ఓ మంచి వంట మాస్టర్ కూడా!!

 
 చిక్కుడు ఆవకాయ
 
 కావలసినవి:
 చిక్కుడుకాయలు - కిలో; పప్పు నూనె - పావు కిలో; కారం - 100 గ్రా; ఉప్పు - 100 గ్రాములకు కొద్దిగా తక్కువ; ఆవపిండి - 100 గ్రా; మెంతులు - టేబుల్ స్పూను; చింతపండు - పావుకిలో
 
 తయారి:
 చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీయాలి  
 
 బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, చిక్కుడుకాయలను అందులో వేసి బాగా వేయించి తీసేయాలి  
 
 ఒక పాత్రలో ఆవపిండి, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు, కొద్దిగా నూనె వేసి కలపాలి  
 
 వేయించి ఉంచుకున్న చిక్కుడుకాయలను జతచేసి బాగా కలపాలి  
 
 చివరగా నూనె పోసి గాలిచొరని పాత్రలో ఉంచి, మూడవ రోజు తిరగ కలపాలి  
 
 ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది (ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక, తగు పరిమాణంలో తయారుచేసుకుంటే మంచిది)
 
 పచ్చికారం కూర
 
 కావలసినవి:
 చిక్కుడుకాయలు - పావు కిలో; అల్లం - చిన్న ముక్క;
 పచ్చిమిర్చి - 4; ఎండుమిర్చి - 2; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; కొత్తిమీర - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను
 
 తయారి:
 ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వరుసగా వేసి వేయించాలి  
 
 చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మూత పెట్టాలి (మూత పెట్టడం వల్ల కూర మెత్తగా ఉంటుంది)  
 
 బాగా ఉడుకు పట్టిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి  
 
 చివరగా మిరప్పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
 
 చిక్కుడుకాయ బంగాళదుంపకూర

 
 కావలసినవి:
 చిక్కుడుకాయలు - అరకిలో; బంగాళదుంపలు - పావుకిలో; ధనియాల పొడి - అర టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; పల్లీలపొడి - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కారం - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్‌స్పూన్లు
 
 తయారి:
 ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి ముక్కలు చేయాలి  బంగాళదుంపలను ఉడికించి, పైన పొట్టు తీసి ముక్కలు చేయాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక బంగాళదుంపముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసి, ఉప్పు జతచేసి బాగా కలిపి మూత ఉంచాలి  
 
 పది నిముషాలయ్యాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, పల్లీలపొడి, కారం వేసి బాగా కలిపి ఐదు నిముషాలుంచి దించేయాలి  
 
 కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచిగా ఉంటుంది.
 
 చిక్కుడు కాయ పచ్చడి
 
 కావలసినవి:
 చిక్కుడుకాయలు - పావుకిలో; చింతపండు- కొద్దిగా; ఎండుమిర్చి - 4; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; కొత్తిమీర - కొద్దిగా; నూనె - 2 టీ స్పూన్లు
 
 తయారి:
 బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వరసగా వేసి దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి  
 
 అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి కొద్దిగా వేగిన తర్వాత, ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి  
 
 ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి  
 
 మిక్సీలో ముందుగా పోపు వేసి మెత్తగా చేయాలి  
 
 చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర  జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి.
 
 వంకాయ చిక్కుడుకాయ కూర

 
 కావలసినవి:
 వంకాయలు - పావుకిలో; చిక్కుడుకాయలు - అరకిలో; అల్లం - చిన్నముక్క; పచ్చిమిర్చి - 6; ఎండుమిర్చి - 5; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; పాలు - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారి:
 వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి  
 
 చిక్కుడుకాయలను కడిగి ఈనెలు తీసి,  పెద్ద ముక్కలు చేయాలి  
 
 బాణలి లో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరుసగా వేసి వేయించాలి  
 
 కరివేపాకు వేసి వేగాక, వంకాయముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి  కలిపి మూత పెట్టాలి  
 
 కూర దగ్గర పడిన తర్వాత పాలు జత చేసి మరోమారు కలిపి కొద్దిగా మగ్గించాలి  అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 
 చిక్కుడుకాయ వేపుడు
 
 కావలసినవి:

 చిక్కుడుకాయలు - పావు కిలో; ఉప్పు - తగినంత; మిరప్పొడి - టేబుల్ స్పూను; నూనె - రెండు టేబుల్ స్పూన్లు
 
 తయారి:
 ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీయాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక చిక్కుడుకాయలను వేసి బాగా కలిపి మూత ఉంచాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి)
 
 పావు గంట తర్వాత ఉప్పు, కారం వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి.
 
 చిక్కుడుకాయ తీపికూర
 
 కావలసినవి: 
చిక్కుడుకాయలు - అర కిలో; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 8; చింతపండుగుజ్జు - టేబుల్ స్పూను; బెల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; పసుపు - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా
 
 తయారి:
 చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి  
 
 బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేయాలి  
 
 చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి  
 
 బాగా ఉడుకుపట్టాక బెల్లం తురుము, చింతపండు గుజ్జు, బియ్యప్పిండి, పసుపు వేసి కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి  
 
 కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 
 కర్టెసీ: కల్యాణలక్ష్మి,
 హైదరాబాద్
 సేకరణ: డా.వైజయంతి

 
 ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
 
 పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుంచి పండిస్తున్నారు  
 
 తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా పండిస్తున్నారు. ఇప్పుడిప్పుడే చిక్కుడు ఉత్తరభారతదేశంలోకి కూడా వ్యాపించింది  ప్రతి వంద గ్రాముల చిక్కుడు కాయలలో 48 క్యాలరీల శక్తి ఉంటుంది
 
 చిక్కుడును ఆహారంలో ఎక్కువ తీసుకుని, వరి అన్నం తక్కువ తీసుకుంటే డయాబెటిస్‌ను 25 శాతం నియంత్రించవచ్చని కోస్టారికా అధ్యయనంలో తెలిపింది  
 
వారంలో కనీసం మూడు కప్పుల చిక్కుడు తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడ తాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూస్తాయి  
 
 సన్నబడాలని డైటింగ్ చేసేవాళ్లు చిక్కుడును అధికంగా తింటే మంచిది
 
 అరకప్పు చిక్కుళ్లలో 7 గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటిని కూరలలోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు  
 
 బీకాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు వీటిలో లభిస్తాయి
 
 కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి అనేక భాగాలకు చిక్కుడు నుంచి శక్తి అందుతుంది.
 

>
మరిన్ని వార్తలు