ఈ మొక్కలు దిగుబడులను హరిస్తాయి

20 Jul, 2014 23:10 IST|Sakshi
ఈ మొక్కలు దిగుబడులను హరిస్తాయి

పెనుగొండ (పశ్చిమ గోదావరి): వరి నాట్లు వేసిన 25-30 రోజులకు కూలీలతో కలుపు మొక్కలను తీయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అప్పటికే ఈ మొక్కలు భూమిలోని పోషకాలను చాలా వరకూ గ్రహిస్తాయి. దీంతో వరి పైరుకు నష్టం జరుగుతోంది. కలుపు వల్ల వరి దిగుబడి 20-34% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో వరిలో కలుపు నివారణపై పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మానుకొండ శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి అందిస్తున్న సూచనలు...
 
ఇవి మూడు జాతులు
వరిని 3 జాతుల కలుపు మొక్కలు నష్టపరుస్తాయి. గడ్డి జాతికి చెందిన వరి మొక్క, అదే జాతికి చెందిన కలుపు మొక్క ఒకేలా ఉంటాయి. అందువల్ల వీటిని గుర్తించి తీసేయడం చాలా కష్టం. వరి చేలో ఊద, గరిక, కరిగడ్డి/కారిగడ్డి, నక్కపీచు/నక్కతోక, చిప్పర గడ్డి, ఉర్రంకి వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు కన్పిస్తుంటాయి. ఇక తుంగ జాతి కలుపు మొక్కల వేర్లలో అక్కడక్కడ దుంపలు ఉంటాయి. వీటిలోని ఆహారాన్నే మొక్కలు నిల్వ చేసుకుంటూ పెరుగుతాయి.

కాబట్టి ఈ మొక్కను దుంపతో సహా పీకేయాలి. వరి చేలో తుంగ, నీటి తుంగ, బొడ్డు తుంగ, చలి తుంగ, రాకాసి తుంగ వంటి తుంగ జాతి మొక్కలు కన్పిస్తుంటాయి. కొన్ని కలుపు మొక్కల ఆకులు వెడల్పుగా ఉంటాయి. ఈ మొక్కలు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. తూటికూర, తూటికాడ, గుంట గలిజేరు, చిన్న నక్కపూత చెట్టు, పులిచింత, నీరుదంటు, ఆమడకాడ, తోటకూర వంటివి ఈ జాతికి చెందిన కలుపు మొక్కలు.
 
యాజమాన్య పద్ధతులతో...
గట్ల మీద, సాగు నీటి కాలువల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. పొలాన్ని బాగా దమ్ము చేస్తే కలుపు బెడద సగం తగ్గుతుంది. పోషకాలు, సాగు నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పైరు నేలంతా కమ్ముకొని కలుపును పెరగనీయదు. ప్రతి సంవత్సరం వరి పైరునే వేయకుండా వరి తర్వాత వేరుశనగ లేదా ఇతర పంటలు వేసుకుంటే కలుపు తాకిడి తగ్గిపోతుంది.
 
నాట్లు వేసిన తర్వాత 20, 30 రోజులప్పుడు కలుపు మొక్కలను వేర్లతో సహా తీసేయాలి. అవసరమైతే 40 రోజులప్పుడు మూడోసారి కలుపు తీయించాలి. మొదటిసారి కలుపు తీసిన తర్వాత నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే మొక్కలకు ఎక్కువ పిలకలు వస్తాయి. కలుపు తీసిన తర్వాతే ఎరువు వేయాలి.
 
రసాయనాలతో...

ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు సరిపడే నారుమడిలో విత్తనాలు చల్లిన 7-8 రోజులకు ఊద ని ర్మూలన కోసం 200 లీటర్ల నీటిలో 1.5-2 లీట ర్ల బ్యూటాక్లోర్ కలిపి పిచికారీ చేయాలి. లేకుం టే విత్తనాలు చల్లిన 14-15 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి.
 
మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డి జాతి మొక్కల నిర్మూలనకు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 1-1.5 లీటర్ల బ్యూటాక్లోర్ 50% లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ 30% లేదా 500 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ 50% లేదా 1.5-2 లీటర్ల బెంధియోకార్బ్ 50% మందును 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. లేకుంటే ఎకరానికి 35-50 గ్రాముల ఆక్సాడయార్జిల్ 80% పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని నాటిన 3-5 రోజుల మధ్య పొడి ఇసుకలో కలిపి చల్లాలి. చేలో తుంగ, గడ్డి, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు సమానంగా ఉన్నప్పుడు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 4 కిలోల బ్యూటాక్లోర్ 5% గుళికలు+4 కిలోల 2,4-డి ఇథైల్ ఎస్టర్ 4% గుళికలను 20 కిలోల పొడి ఇసుకలో కలిపి వెదజల్లాలి.
 
విత్తనాలు వెదజల్లినప్పుడు...
దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తనాలను వెదజల్లినప్పుడు... విత్తనాలు చల్లిన 8-10 రోజుల్లో బ్యూటాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 1.25 లీటర్లు లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ లేదా ప్రెటిలాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 600 మిల్లీలీటర్లు లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. విత్తనాలు చల్లిన 15-20 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 80 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ కలిపి పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 25-30 రోజులప్పుడు వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పడేలా పిచికారీ చేసుకోవాలి.

ఈ జాగ్రత్తలు అవసరం
కలుపు మందు పిచికారీ చేయడానికి స్ప్రేయర్‌కు ఫ్లడ్‌జెట్ లేక ప్లేట్‌ఫేస్ నాజిల్‌ను ఉపయోగించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు రసాయనాలు పిచికారీ చేసినా లేదా గుళికలు చల్లినా పనిచేయవు. కలుపు మందును ద్రవ/గుళికల రూపంలో ఇసుకలో కలిపి వాడినప్పుడు చేలో 2-5 సెంటీమీటర్ల వరకు నీటిని నిలగట్టాలి. మందును పొలమంతా సమానంగా పడేలా చల్లుకోవాలి. బయటి నీరు లోపలికి రాకుండా, లోపలి నీరు బయటికి వెళ్లకుండా గట్లను కట్టుదిట్టం చేయాలి. నాలుగైదు రోజుల వరకు ఆ నీటిని తీయకూడదు. పైరు దశ, కలుపు మొక్క జాతిని బట్టి తగిన మందులు వాడాలి.

మరిన్ని వార్తలు