కలుపు మొక్కలు.. సమస్యలు

19 Nov, 2014 02:37 IST|Sakshi

కలుపు మొక్కలు.. సమస్యలు
 కలుపు మొక్కల వల్ల కలిగే నష్టం ఇతర చీడపీడల మాదిరిగా పంటలపై తక్షణం కనిపించదు.
 కలుపు మొక్కలు ప్రధాన పైర్లతో గాలి, వెలుతురు, నీరు, పోషకాల కోసం పోటీపడి వాటిని ప్రధాన పంటకు అందకుండా చేస్తాయి.
 పంట దిగుబడులు 20-60శాతం వరకు తగ్గిస్తాయి.
 వీటి వల్ల పంట దిగుబడి తగ్గడమే కాక నాణ్యత కూడా తగ్గుతుంది.
 చీడపీడలకు ఆశ్రయం ఇచ్చి ప్రధాన పైరుపై వాటి సమస్యను తీవ్రతరం చేస్తాయి.
 
 నివారణ ఆవశ్యకత
 పంటలను చీడపీడల నుంచి కాపాడటం ఎంత ముఖ్యమో.. కలుపు మొక్కల నుంచి పోటీ లేకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.
 పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా, పెరిగినా పుష్పించి, విత్తనోత్పత్తి దశకు చేరుకోకుండా సకాలంలో నిర్మూలించాలి.
 పంట తొలిదశలోనే, అంటే పంట కాలంలో మూడింట ఒకవంతు సమయంలో పైరుకు కలుపు నుంచి ఎలాంటి పోటీ లేకుండా చూడాలి.
 కలుపు మందులను తేలికపాటి(ఇసుక,గరప) నేలల్లో తక్కువ మోతాదులో, ఎర్రనేలల్లో మధ్యస్థంగా, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో వాడాలి.
 సాధ్యమైనంత వరకు రైతులు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ, అంతరకృషి చేయుట మొదలగు సేద్యపద్ధతులను అవలంబిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు.

 మొక్కజొన్న
 విత్తనం వేసిన 2-3రోజులలోపు తేలిక నేలల్లో అయితే ఎకరానికి 800గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరానికి 1200గ్రాముల అట్రజిన్‌ను 200లీటర్లల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను ఒకనెల వరకు అదుపు చేయవచ్చు.
 మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం ఎకరానికి 1లీటరు పిండిమిథలిన్‌ను 200లీటర్ల నీటిలో కలిపి విత్తిన రెండు రోజుల్లో పిచికారి చేయాలి.
 విత్తిన నెల రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే ఎకరానికి 500గ్రాముల 2,4-డి సోడియంసాల్ట్‌ను 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
 విత్తిన 30-35రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్‌తో అంతర పంట కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు.

 జొన్న
 జొన్న విత్తిన వెంటనే లేదా 2వ రోజు లోపల ఎకరానికి 800గ్రాముల అట్రజిన్ 50శాతం పొడి మందును 200లీటర్ల నీటిలోకలిపి తడినేలపై పిచికారి చేయాలి.
 జొన్న విత్తిన 35-40రోజులకు జొన్న మల్లె మొలకెత్తుతుంది. జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటరు నీటికి 2గ్రాముల 2,4డి సోడియం సాల్ట్ లేదా 50గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా 200గ్రాముల యూరియాను కలిపి మల్లెపై పిచికారి చేసి నిర్మూలించవచ్చు.

 శనగ
 విత్తే ముందు ఎకరానికి 1లీటరు ప్లూక్లోరాలిన్ 45శాతం మందును పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. లేదా విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని ఎకరానికి 1.5లీటర్‌ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి.
 విత్తిన 20,25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి.
 
పెసర, మినుము

 విత్తనం విత్తిన వెంటనే గాని, మరుసటి రోజుగాని ఎకరానికి 1లీటరు 50శాతం అలాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండిమిథాలిన్ 30శాతం మందును పిచికారి చేయాలి.
 విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి.
 వరి మాగాణుల్లో విత్తనం చల్లిన 21-28రోజుల మధ్య ఎకరానికి 250మి.లీ. ఫినాక్సిప్రాప్‌ఇథైల్ (ఉదాహరణకు నివారణకు) 250 మి.లీటర్ల ఇమాజితాఫిర్(వెడల్పుకు కలుపు, బంగారుతీగ నివారణకు), 400మి.లీటర్ల క్విజాలోఫాప్‌ఇథైల్ (ఊవ, చిప్పిర, గరిక నివారణకు) 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
 
 పొద్దుతిరుగుడు
 విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ఎకరానికి లీటరు పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50%ను కలిపి పిచికారి చేయాలి.
 విత్తిన 20-25రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి.
 30-40రోజుల వరకు పంటల్లో కలుపు లేకుండా చూసుకోవాలి.

 వేరుశనగ
 విత్తిన వెంటనే గాని లేదా 2-3రోజుల లోపు ఎకరానికి 1లీటరు అలాక్లోర్ 50శాతం లేదా 1.25-1.5లీటర్ల బుటాక్లోర్ లేదా 1.5లీటర్ల పెండెమిథాలిన్ 30శాతం 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
 విత్తిన 20-25రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి.
 విత్తిన 45రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయరాదు.
 విత్తిన వెంటనే కలుపు మందులు వాడలేకపోయిన లేదా 20రోజుల వరకు కలుపు తీయలేని పరిస్థితుల్లో పైరులో మొలచిన కలుపును నిర్మూలించవచ్చు.
 విత్తిన 21రోజుల లోపు కలుపు 2-3ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 300మిల్లీలీటర్ల ఇమాజిలిఫిర్ 10శాతం లేదా 400మీ.లీటర్ల క్విజాలోఫాప్‌ఇథైల్ 5శాతంను 200లీటర్ల నీటిలో కలిపి చాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారి చేసి కలుపును నిర్మూలించవచ్చు.
 
కుసుమ
 విత్తిన వెంటనే గాని, మరుస టి రోజుగాని ఎకరానికి 1లీట రు అలాక్లోర్ 50శాతం లేదా పెండమిథాలిన్ 30శాతం కలిపి పిచికారి చేయాలి.
 విత్తిన 20-30రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.
 విత్తిన 25రోజులకు, 45-50రోజుల వరకు దంతులు తొలి అంతర కృషి చేయాలి.

మరిన్ని వార్తలు