కలుపు మందుల వాడకంలో మెలకువలు

22 Jun, 2014 23:21 IST|Sakshi
కలుపు మందుల వాడకంలో మెలకువలు

ఈ వారం వ్యవసాయ సూచనలు
సుస్థిర అధికోత్పత్తికి సమగ్ర పోషక యాజమాన్యంతోపాటు సమగ్ర కలుపు నిర్మూలన కూడా అంతే అవసరం. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభించినప్పటికీ, కలుపు మందుల వాడకంలో తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించినట్లయితే సమర్థవంతంగా కలుపును నివారించి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది.
- పస్తుతం మార్కెట్‌లో అనేక రకాలైన కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పంటకు ఏ కలుపు మందును ఎంత పరిమాణంలో, ఏ సమయంలో వాడాలో తెలుసుకొన్న తరువాత మాత్రమే పిచికారీ చేయాలి.
- కలుపు మందులు రెండు రకాలు. మొదటి రకం, కలుపు మొలకెత్తక ముందు పిచికారీ చేసే మందులు (ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు). విత్తిన వెంటనే అంటే 24 గంటల నుంచి 48 గంటల్లోపు తడి నేల మీద పిచికారీ చేయాలి. ఉదా.. పెండిమిథాలిన్, అట్రాజిన్, అలాక్లోర్.

- కలుపు గింజలు మొలకెత్తే సమయంలో ఈ మందులను పీల్చుకొని చనిపోతాయి. కాబట్టి పంట విత్తిన 48 గంటల్లోపేపిచికారీ చేయాలి.
- రెండో రకం కలుపు మందులు పంట, కలుపు మొలకెత్తిన తర్వాతే పిచికారీ చేసుకొనేవి(పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు). ఉదా: ఇమాజిథాపైర్, పినాక్సాప్రాప్ పి ఇథైల్ లాంటివి. ఈ మందులను పంట మొలిచిన 15 నుంచి 20 రోజుల్లో పిచికారీ చేయాలి.
- పంట మొలకెత్తిన తర్వాత వాడే కలుపు మందులను.. కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.

- కొన్ని రకాల కలుపు మందులు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి ఉపయోగపడతాయి. వీటిని చల్లేటప్పుడు పక్కన పత్తి, పొద్దుతిరుగుడు లాంటి వెడల్పాకు పంటలు ఉంటే జాగ్రత్తవహించాలి.
- అంతర పంటలు వేసుకొన్నప్పుడు ఆ రెండు పంటలకు అనుకూలమైన కలుపు మందులు వాడాలి. ఎకరానికి 200 నుంచి 240 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
- కలుపు మందులను తేలికపాటి నేలల్లో తక్కువ మోతాదులోనూ, నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులోనూ, ఎర్ర నేలల్లో మధ్యస్థంగా వాడుకోవాలి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు గానీ, గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు గానీ కలుపు మందులు చల్లకూడదు.

- కలుపు మందులను ఇతర సస్యరక్షణ మందులతో కలిపి వాడకూడదు.
- హాండ్ స్ప్రేయర్‌తో మాత్రమే కలుపు మందులను పిచికారీ చేయాలి.
- కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు మాస్క్, అప్రాన్ తప్పనిసరిగా ధరించాలి. గాలికి ఎదురుగా పిచికారీ చేయకూడదు. వెనక్కి నడుచుకుంటూ మందులు పిచికారీ చేయాలి.
- రసాయనాలతోనే కాకుండా అంతర కృషి ద్వారా కూడా కలుపును నివారించుకోవచ్చు. నేల గుల్లబారడంతోపాటు నీటి సంరక్షణ, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
 - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
 ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,  హైదరాబాద్

 
 శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
 1100, 1800 425 1110
 కిసాన్ కాల్ సెంటర్ :1551

 
తల్లి రొయ్యల దిగుమతికి ‘క్వారంటైన్’ తప్పనిసరి
- దేశాంతరాలలో జీవ సంబంధ పదార్థాలను మార్పిడి చేసేటప్పుడు వాటి ద్వారా వ్యాపించేందుకు అవకాశం ఉన్న వ్యాధుల నుంచి ఆయా దేశాలకు రక్షణ కల్పించే పద్ధతే క్వారంటైన్ పద్ధతి.
- వెనామీ తల్లి రొయ్యల దిగుమతికి కూడా ‘క్వారంటైన్’ తప్పనిసరి. చెన్నై పోర్టు ద్వారానే తల్లి రొయ్యల దిగుమతి జరుగుతుంది.
- పేటెంట్ హక్కులున్న విదేశీ సంస్థల నుంచి నాణ్యమైన తల్లి రొయ్యలను దిగుమతి చేసుకున్న తర్వాత 5 రోజుల పాటు నియంత్రిత ప్రదేశం (క్వారంటైన్ ఫెసిలిటీ)లో  25-28 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి పరీక్షలు చేస్తారు.
- రోగలక్షణాలు లేని తల్లి రొయ్యలను ప్రభుత్వం ద్వారా హేచరీలకు అందజేస్తారు. క్వారంటైన్ పరీక్షల వల్లనే కొన్ని ప్రమాదకర రొయ్యల వ్యాధులు మన దేశంలోకి ప్రవేశించలేదు.
 - ప్రొఫెసర్ పి. హరిబాబు (98495 95355),
 ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా

 
8 నిమిషాల్లో పాలు తీయడం ముగించాలి

- పాలు తీయడం ఒక కళ. పశువు నుంచి పాలను 8 నిమిషాల్లో పూర్తిగా తీసెయ్యాలి. రోజూ ఒకే వేళల్లో, ఒకరే తీస్తే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
- ఎక్కువ పాలిచ్చే పశువుల నుంచి రోజుకు 2, 3 సార్లు కూడా పాలు తీస్తారు. రోజులో ఎక్కువ సార్లు తీస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
- పిట్యూటరీ గ్రంధి ప్రేరేపించబడి పాల చేపు వస్తుంది. ఆక్సీటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీని ప్రభావం 8 నిమిషాలే ఉంటుంది. ఆలోగా వేగంగా పాలు తీయాలి. లేదా ఎగచేపే అవకాశం ఉంది.
- బొటన వేలు, చూపుడు వేలును ఉపయోగించడం.. బొటనవేలిని లోపలికి మడిచి పాలు తీయడం కన్నా.. అర చేతితో రొమ్మును ఒత్తుతూ పాలు పితకడం ఉత్తమం.
 - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506),
  అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా

 
చెరువు లీజు రైతుకు భారం కాకూడదు
- తెల్ల చేపల ఉత్పత్తి ఖర్చు ఎక్కువై రైతుకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఎకరానికి ఏడాదికి 4 టన్నుల దిగుబడి వస్తుంటే.. రూ. 60 వేల వరకు లీజు పలుకుతోంది. లాభంలో సగం మేరకు లీజుకే చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.  
- ఈ పరిస్థితుల్లో కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించే రైతులు.. లీజు ఎంతైనా ఫర్వాలేదనుకోకుండా.. మొత్తంగా చేపల సాగుకు అయ్యే ఖర్చులన్నిటినీ లెక్కించుకొని.. లీజు గరిష్టంగా ఎంత చెల్లించవచ్చో సరైన అంచనాకు రావచ్చు.
 - డా. రావి రామకృష్ణ (98480 90576)
 సీనియర్ ఆక్వా శాస్త్రవేత్త, ఫిష్‌నెస్ట్, ఏలూరు

 
 మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా:
 ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్‌‌స, 6-3-249/1,
 రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034
 saagubadi@sakshi.com

మరిన్ని వార్తలు