బెల్లం పొడి భలే..

7 Mar, 2016 23:57 IST|Sakshi
బెల్లం పొడి భలే..

ఎకరాకు రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం
ప్రకృతి సేద్యంలో  మహిళా రైతు ప్రస్థానం

ఎటువంటి యంత్రాలు వాడకుండానే సంప్రదాయ పద్ధతుల్లోనే నాణ్యమైన బెల్లం పొడిని తయారు చేసి విక్రయిస్తున్నారు విజయనగరం జిల్లాలోని మెరకముడిదాం మండలం గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా రైతు అల్లూరి విజయ. ఎంఎస్సీ కమ్యూనిటీ హెల్త్ సెన్సైస్ అండ్ న్యూట్రిషన్ కోర్సు చదువుకున్న ఆవిడ... లండన్‌లో ఒకటిన్నర సంవత్సరం ఉద్యోగం చేశారు. 2011లో స్వగ్రామానికి తిరిగొచ్చి సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 30 ఎకరాల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

 తొలి ఏడాదే టన్ను విక్రయించాం..
ప్రకృతి వ్యవసాయంలో పండించి, తయారు చేస్తున్న బెల్లం, బెల్లం పొడికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది.  ఈ ఏడాదే ప్రారంభించినా ఇప్పటి వరకు టన్ను బెల్లం పొడిని విక్రయించాం. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. బెల్లం దిమ్మల విక్రయాలతో పోల్చితే.. బెల్లం పొడి ద్వారా 50 శాతం అధిక ఆదాయం లభిస్తుంది. దీనికి భవిష్యత్తులో మరింత గిరాకీ పెరగవచ్చు. చెరకు రైతులు దీనిపై దృష్టి సారిస్తే మిల్లుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మరింత ఆదాయం పొందవచ్చు.
- అల్లూరి విజయ (97017 06432), గరుగుబిల్లి, విజయనగరం జిల్లా

 బెల్లం పొడితో పెరిగిన ఆదాయం
8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో చెరకును పండించి నాణ్యమైన బెల్లం పొడిని తయారు చేస్తున్నారు విజయ. బెల్లం దిమ్మెల తయారీలో అనుసరించే ప్రక్రియనే పొడి తయారీలోను అనుసరిస్తారు. తొలుత చెరకును నీటితో కడిగి, యంత్రాల ద్వారా రసం తీసి బాణలిలో పోస్తారు. బాణలిని పొయ్యిపై ఉంచి నాలుగైదు గంటలు వండితే బెల్లం పాకం వస్తుంది. బెల్లం పాకాన్ని పూర్తిగా ఎండబెట్టి జల్లిస్తారు. తరువాత బొరిగెలు వంటి ఇనప పరికరాలతో తురుముతారు. దీంతో పొడి వస్తుంది. 4.8 శాతం తేమ ఉండేలా ఎండబెట్టిన పొడిని అర కిలో, కిలో ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. ముందుగా ఆర్డర్లు తీసుకొని పొడిని తయారు చేసి విశాఖ పట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు పంపుతున్నారు. బెల్లం పొడిని కిలో రూ. 120 చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యత చెడకుండా చెరకు గడల నుంచి రసం తీయడం దగ్గర్నుంచి ప్యాకింగ్ వరకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొడి తయారీ, ప్యాకింగ్ దశల్లోను కూలీల చేతులకు గ్లౌజులు వాడుతున్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ బెల్లం పొడి చెడిపోకుండా ఉండేందుకు యంత్రం సహాయంతో గాలి చొరబడకుండా ప్యాకింగ్ చేస్తారు. ప్రవాస భారతీయులు బెల్లం పొడిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

 ప్రకృతి పద్ధతుల్లో సాగు చేయటం వల్ల వీరి పొలంలో ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి వస్తోంది. దీని నుంచి 4 టన్నుల బెల్లం వస్తుంది. దీన్ని విక్రయిస్తే రూ. 2.80  లక్షల ఆదాయం వస్తుంది. బెల్లం పొడిగా మార్చి విక్రయిస్తే ఎకరాకు రూ. 4.80 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంతర పంటల ద్వారా ఖర్చులు వస్తున్నాయి. అంటే బెల్లం పొడి లేదా దిమ్మెల ద్వారా     వచ్చేదంతానికరాదాయమేనని విజయ చెప్పారు.

 ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి
రసాయన సేద్యం చేసిన రైతులు ఎకరాకు 25 - 30 టన్నుల దిగుబడి వస్తుండగా విజయ మాత్రం 50 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. పైగా చెరకులోనే అంతర పంటలుగా  కంది, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసి ఎకరాకు 5 బస్తాల దిగుబడి సాధించారు. వీటిని పప్పులుగా చేసి తామే విక్రయించటం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. వేరు శనగలో ఎకరాకు 15 బస్తాల దిగుబడి వచ్చింది.  గింజల నుంచి గానుగతో నూనె తీసి విక్రయిస్తున్నారు. ఈ ఆదాయంతో చెరకు సాగు ఖర్చులు వచ్చేస్తున్నాయి. ప్రకృతి సేద్యంలో వరి పంటను సాగు చేసి ఆమె ఎకరాకు 30 బస్తాల దిగుబడి సాధించారు. హుద్‌హుద్ తుపాన్ తాకిడికి కూడా తమ తోటలో అరటి చెట్లు పడిపోలేదన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ఉన్న శక్తి అదేనని ఆమె అన్నారు.
- సతీష్ కుమార్ మరిపి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా

మరిన్ని వార్తలు