‘లక్ష్మీ’కటాక్షం!

7 Mar, 2017 00:22 IST|Sakshi
‘లక్ష్మీ’కటాక్షం!

⇒ సాగు పద్ధతి మారితే రైతు తలరాత మారుతుందని చాటుతున్న మహిళా రైతు విజయగాథ
⇒ రసాయనిక సేద్యంతో అప్పుల పాలై భర్త ఆత్మహత్య
⇒ సేంద్రియ సేద్యం చేపట్టి అప్పులు తీర్చిన మహిళా రైతు లక్ష్మి


రసాయనిక వ్యవసాయం అప్పులను పోగేసి రైతుల ప్రాణాలనే హరించి వేస్తుంటే.. సేంద్రియ వ్యవసాయం బడుగు రైతుల బతుకులను ఆకుపచ్చగా మార్చుతున్నది. రసాయనిక సేద్యం మిగిల్చిన అప్పుల వ్యథతో బడుగు రైతు బలవన్మరణం పాలైనప్పుడు.. ఆ బాధిత కుటుంబానికి భర్తను అర్ధంతరంగా కోల్పోయిన మహిళే పెద్ద దిక్కవుతుంది. అటువంటి వ్యవసాయ కుటుంబానికి అప్పుల పాలు చేయని సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేస్తే.. ఆ రైతు కుటుంబం తిరిగి జవజీవాలను పుంజుకోగలుగుతుందా? పేదరికంలో నుంచి, అప్పుల్లో నుంచి బయట పడగలుగుతుందా?? దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయిన మహిళా రైతు లక్ష్మి తన జీవితాన్ని ఆనందదాయకంగా తీర్చి దిద్దుకున్న తీరు ఈ ప్రశ్నలన్నింటికీ ‘‘అవును’’ అన్న సమాధానాన్ని ఎలుగెత్తి చాటుతోంది!


రైతులే కాదు, సమాజంలో ఏ వృత్తిని నమ్ముకున్న వారైనా అవసరార్థం అప్పులు చేస్తూనే ఉంటారు. కానీ, అప్పులు అదుపు తప్పి ప్రాణాలనే బలిగోరే దుర్గతి పాలవుతున్నది రైతులే. అప్పుల బాధతో బలవన్మరణం పాలైన ఒకానొక రైతు పేరు నీల బాలయ్య. అతనిది సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామం. అందరు రైతుల్లానే బోరుబావులు, పంటలకు ఎరువులు, పురుగుమందుల కోసం అప్పుల మీద అప్పులు చేశాడు. అప్పు ముప్పని తెలుసుకొని దూరం జరిగే ప్రయత్నంలో మరింత దగ్గరయ్యాడు. తమ కళ్లెదుటే పచ్చని పంటలు మోడువారుతున్నా బోరు బావులు నీరు లేక బావురుమన్నాయి.

2006లో పురుగు మందు తాగి చనిపోయాడు. బాలయ్య బలవన్మరణం పాలయ్యే నాటికి పెద్ద కూతురుకు పెళ్లి అయింది. అతని భార్య లక్ష్మి సహా చదువుకుంటున్న కొడుకు, పెళ్లీడుకొచ్చిన కూతురు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. రెండెకరాల పొలంతోపాటు రూ. 3 లక్షల అప్పు ఉంది. నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకున్న లక్ష్మి కొడుకు సాయంతో తిరిగి వ్యవసాయం ప్రారంభించింది. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. కానీ అదృష్టం ఈసారి లక్ష్మి వైపు ఉంది.

సేంద్రియ సేద్యం మార్పు తెచ్చింది..
రసాయన సేద్యం చేస్తే పాత పరిస్థితులే పునరావృతమయ్యేవేమో కానీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కేరింగ్‌ సిటిజన్‌ కలెక్టివ్‌ (సీసీసీ) సంస్థతో ఆమెకు పరిచయమయింది. ఖమ్మం జిల్లాకు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణుడు పర్చా కిషన్‌రావు వద్ద శిక్షణ పొందడంతో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం వల్ల పెరుగుతున్న ఖర్చుల గురించి అవగాహన కలిగింది. ఉన్న కొద్దిపాటి నీటినే పొదుపుగా వాడుకుంటూ పంటలను సాగు చేసే పద్ధతులు, కంపోస్టు తయారీ, స్వంతంగా విత్తనోత్పత్తి, శ్రీ విధానంలో వరి సాగు గురించి శిక్షణలో తెలుసుకుంది. వాణిజ్య పంటలను సాగు చేస్తే ఖర్చులు పెరుగుతాయని గుర్తించి, తొలుత ఎకరంలో వరిని, మరో ఎకరంలో  కూరగాయలను సాగు చేయటం ప్రారంభించింది. నీటి కొరత రావటంతో బోరు వేయించేందుకు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష ఆర్థిక సహాయం అక్కర కొచ్చింది. బోరు పోసే కొద్దిపాటి నీటినే పొదుపుగా వాడుకుంటూ పంటలు పండించారు.

కోడి కూయకముందే పొలానికి చేరుకొని కూరగాయలు కోసి పంటను బస్సులో వేసుకొని సిద్దిపేట, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని రైతు మార్కెట్లో అమ్ముకొని.. రాత్రికి తిరిగి ఇంటికి చేరుకునేది. మళ్లీ పొద్దు పొడవకముందే పొలానికి పరుగెత్తవలసి వచ్చేది. అయితే, కొద్ది కాలంలోనే లక్ష్మి మంచి నికరాదాయాన్ని కళ్ల జూసింది. రూ. 3 లక్షల అప్పు తీరింది. అంతేకాదు.. మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేయటం ప్రారంభించింది. సొంత ఇల్లు కట్టుకొని.. కూతురు, కొడుకు పెళ్లిళ్లు చేసింది. ఇప్పుడు భయం లేని సరికొత్త జీవితం గడుపుతోంది.

మహిళా రైతుల సహకార సంఘం..
వ్యవసాయంలో చితికిపోయిన తోటి రైతుల కుటుంబాలకు లక్ష్మి సాంత్వనగా నిలిచారు. సిసిసి డైరెక్టర్‌ కె. సజయ (99483 52008), ఆశాలతల మార్గనిర్దేశనంలో 16 పరిసర గ్రామాల్లోని 136 మంది మహిళా రైతులతో కలసి ‘నేలమ్మ మహిళా రైతుల సహకార సంఘా’న్ని ఏర్పాటు చేయడంలో లక్ష్మి చురుకైన ప్రాతను నిర్వహించారు. ఈ సంఘం ద్వారా తోటి మహిళా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి చైతన్యవంతం చేసే పని ప్రారంభించడం విశేషం.
(లక్ష్మి కుమారుడు మల్లేశం 80980 32828ను సంప్రదించవచ్చు)
– అనినెల్ల బాలనర్సయ్య, సాక్షి, తొగుట, సిద్దిపేట జిల్లా

మరిన్ని వార్తలు