మిత్రపురుగులతో తెల్లదోమకు చెక్!

28 Sep, 2015 23:51 IST|Sakshi
మిత్రపురుగులతో తెల్లదోమకు చెక్!

పంటలను కాపాడిన మహిళా రైతుల నైపుణ్యం
 
 పంజాబ్‌లోని భటిండా ప్రాంతానికి చెందిన పత్తి రైతులను తెల్లదోమ ఈ ఏడాది తీవ్రంగా నష్టపరిచింది. వేలాది ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకు పోవడంతో రైతులు కుదేలయ్యారు. 200 మందికి పైగా పంజాబ్ పత్తి రైతులు ఆత్మహత్యల పాలయ్యారంటే తెల్లదోమ దెబ్బ ఎంత విధ్వంసకరంగా పరిణమించిందో అర్థం చేసుకోవచ్చు. శక్తివంతమైన రసాయనిక పురుగుమందులకూ తెల్లదోమ లొంగలేదు. తెల్లదోమ నష్టానికి గురైన ప్రతి ఎకరానికి రూ. 50 వేల మేరకు పరిహారం ఇవ్వాలంటూ పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు..

 అయితే.. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నప్పటికీ తెల్లదోమ దెబ్బకు తల్లడిల్లని కొన్ని గ్రామాలు వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. హర్యానా లోని జింద్ జిల్లాలో నిధానా, లలిత్ ఖేరా అనేవి చిన్న గ్రామాలు. అక్కడి రైతులకు తెల్లదోమ అసలు సమస్య కానే కాదు. రసాయనిక పురుగుమందుల పిచికారీని చాలా ఏళ్ల క్రితమే నిలిపివే సి.. వాటికి బదులు మిత్ర పురుగులను ఉపయోగిస్తుండడమే ఇందుకు కారణం. తెల్లదోమకు సహజ శత్రువులైన కీటకాలను ఇళ్ల దగ్గర పెంచి, పొలాల్లో వదలటం ద్వారా తె ల్లదోమను కట్టడి చేయగలుగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడి రైతులు మిత్రపురుగులతో స్నేహం చేసే కళను గత కొన్నేళ్లుగా ఒంటబట్టించుకున్నారు.

 హర్యానాలోని సిర్సా జిల్లాలో 70, భీవానిలో 10 ఎకరాల్లో, రోహ్‌తక్ జిల్లాలోని 10 ఎకరాల్లో, పంజాబ్‌లోని  మన్సా జిల్లాలో 62 ఎకరాల్లో, భటిండా జిల్లాలోని మరికొందరు రైతులు కూడా రసాయన రహిత పద్ధతుల్లో  రసంపీల్చే పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఈ ప్రాంతంలో మిత్రపురుగుల వినియోగం పెరగడానికి కీ. శే. సురేంద్ర దలాల్ కృషే కారణం. ఆయన హర్యానా వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేశారు. 150 మంది రైతులకు అప్పట్లో ఆయన సమగ్ర శిక్షణ నిచ్చారు. ఇందులో ఎక్కువ మంది మహిళా రైతులే. శత్రుపురుగులను గుర్తించటం, వాటిపై మిత్ర కీటకాలను ప్రయోగించటంలో వీరు సుశిక్షితులయ్యారు.

కొంచెం చదువునేర్చిన మహిళలు, నిరక్షరాస్య మహిళా రైతులు సైతం తెల్లదోమను నియంత్రించటంలో పైచేయి సాధించారు.  జాతీయ సమీకృత చీడపీడల నివారణ సంస్థ (న్యూఢిల్లీ) ఈ పద్ధతులను పరిశీలించి ఆమోద ముద్ర వేసింది కూడా. ఈ నిధాన ప్రాంతంలో రైతులు అనుసరిస్తున్న నమూనాని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని జిస్టిస్ ఎస్. ఎన్. అగర్వాల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

 స్థానికంగా ఇనో, ఈరో అని పిలిచే రెండు కీటకాలను వారు తెల్లదోమపైకి ప్రయోగించి మట్టుబెడుతున్నారు. ఈ పద్ధతినే ఇక్కడి రైతులందరూ అనుసరిస్తున్నారు. ఒక్క మిత్ర పురుగు 100 శత్రు కీటకాలను మట్టుపెడుతుంది. ఈ మిత్ర కీటకాలు పంటకు హాని చేసే ఇతర కీటకాలను కూడా తినేస్తాయి. 170 రకాల కీటకాల గురించి ఇక్కడి మహిళా రైతులకు తెలుసు. ఈ ఒక్క విషయం చాలు ఇక్కడి మహిళా రైతుల నేర్పరితనం ఏపాటిదో అర్థం చేసుకోవటానికి అంటారు ప్రముఖ వ్యవసాయ రచయిత దేవిందర్ శర్మ. వీళ్ల దగ్గర్నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు నేర్చుకునే ప్రయత్నం చేయకపోవటం సిగ్గుపడాల్సిన విషయమని అభివర్ణించారు.
 - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు